- కర్ణాటకలో డోంగర్‌గావ్ గ్రామ పంచాయితీ సంచలన నిర్ణయం.
- ఆ దిశగా కొత్త వ్యవస్థ కోసం గుజరాత్ ప్రభుత్వం అధ్యయనం.
ప్రేమ (Love marriages) వివాహాలపై సంచలన తీర్మానం (Resolution) చేసింది కర్ణాటకలోని ఓ గ్రామపంచాయతీ. తల్లిదండ్రుల (Parents) అనుమతి లేకుండా చేసుకునే వివాహాలను నిషేధించాలని కోరుతూ నిర్ణయం తీసుకుంది. గ్రామంలో తల్లిదండ్రుల అనుమతి లేని ప్రేమ వివాహాలను ప్రభుత్వం నిషేధించాలని కలబురిగి జిల్లా డోంగర్‌గావ్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. గ్రామ సర్పంచ్ శాంతకుమార్ కె ములాగే , పంచాయతీ సభ్యులు గ్రామసభ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు అనుమతిస్తేనే ప్రేమ వివాహాలు జరిగేలా ఓ వ్యవస్థను తీసుకొచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఓ అధ్యయనం చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడిరచారు.రాజ్యాంగబద్ధంగా సాధ్యమైతే ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘సర్దార్ పటేల్ గ్రూప్’ మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. తల్లిదండ్రులు అనుమతిస్తేనే ప్రేమ వివాహాలు జరిగేలా చూడాలని పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ తరహా తీర్మానాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలతో పాటు ప్రభుత్వాలు సైతం చట్టం రూపంలోకి తీసుకొచ్చే అవకాశం నూరుశాతం ఉండబోతోంది.
‘‘ప్రేమ వివాహాల వల్ల వారి ఇరువురి కుటుంబాల్లోను తరచూ వివాదాలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రేమికులు వివాహమైన కొద్ది రోజులకే విడిపోతున్నారు. కొద్దికాలానికే వారి బంధం విడిపోతుంది. అందువల్లనే ఇటువంటి ప్రేమ వివాహాలు నిషేధిస్తూ గ్రామపంచాయతీలో తీర్మానం చేశాం.’’
- శాంతకుమార్ కె ములాగే , డోంగర్‌గావ్ గ్రామ పంచాయతీ సర్పంచ్
ప్రేమ వివాహాలపై నిర్ణయానికి ప్రత్యేక సమావేశం..
తల్లిదండ్రుల సమ్మతి లేకుండా యువతీయువకులు చేసుకునే ప్రేమ వివాహాలపై నిర్ణయం తీసుకునేందుకు సర్పంచ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు అనుమతిస్తే ప్రేమికులు వివాహం చేసుకోవచ్చని పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. ప్రేమ వివాహాలను నిషేధిస్తూ ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రేమ వివాహాల పట్ల నిర్ణయానికి కారణం
డోంగర్‌గావ్ గ్రామపంచాయతీ పరిధిలో గత ఏడాదే 15 జంటలు ప్రేమ వివాహాలు చేసుకున్నాయి. చాలా మంది ప్రేమలో పడి వారి తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఈ కారణంలో తరుచూ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు, గొడవలు జరుగుతున్నాయి. గ్రామంలో అశాంతి చోటుచేసుకుంటోంది. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. డోంగరగావ్ గ్రామపంచాయతీ పరిధిలో నాలుగు చిన్న గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు 18 మంది పంచాయతీ వార్డు మెంబర్లు ఉన్నారు.