AP GOVT : ఎలక్షన్స్‌ ముందు మూకుమ్మడిగా దెబ్బ మీద దెబ్బ

0

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ మొండివైఖరిని వ్యతిరేకిస్తూ  ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, సమగ్రశిక్షా అభియాన్‌ సిబ్బందితోపాటు వాలంటీర్లు సమ్మె బాట పట్టారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని హామీల మీద హామీలిచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, అధికారం చేపట్టి నాలుగేన్నరేళ్లు గడిచినా ఏ ఒక్క హామీని నేరవేర్చకపోవడంపై అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, సమగ్రశిక్షా అభియాన్‌ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తామంటూ తమని దారుణంగా మోసం చేశారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు 

వేతనాల పెంపు, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు (టీచర్లు), ఆయాలు (హెల్పర్లు) డిసెంబర్‌ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. నాలుగున్నరేళ్లుగా కనీస వేతనానికి నోచుకోకుండా పని చేస్తున్నామని, తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ విధులకు హాజరుకాబోమని అంగన్‌వాడీలు తేల్చిచెప్పారు. తాము అధికారంలోకి రాగానే అంగన్‌వాడీలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ మాట తప్పి, మడమ తిప్పారని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు.

పారిశుద్ద్య కార్మికుల సమ్మె 

పారిశుద్ధ్య కార్మికులపై పలు బహిరంగ సభల్లో ఎనలేని ప్రేమాభిమానాలు కురిపించినా సీఎం జగన్‌, నాలుగున్నరేళ్లుగా తమకు తీరని అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది సమ్మెకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ప్రభుత్వ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ తాము సమ్మెకు దిగినట్లు ప్రకటించారు. ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం తక్షణమే స్పందించి, పారిశుద్ధ్య కార్మికులకు రూ.26వేల జీతం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చివరికి వాలంటీర్లు కూడా 

సీఎం జగన్‌ తన సొంత సైన్యంగా చెప్పుకునే వాలంటీర్‌ వ్యవస్థ సమ్మెకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2.65 లక్షల మంది వాలంటీర్లు తమకు జగన్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా గౌరవ వేతనాలు పెంచడం లేదని, సర్వీసులు క్రమబద్ధీకరించడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈరోజు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరించారు. అరకొర జీతాలు ఇస్తూ పని భారాన్ని మోపారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ ఛాంబర్‌ ఎదుట బైఠాయించి, నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్‌ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. వాలంటీర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !