TSPSC : చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి రాజీనామాను తిరస్కరించిన గవర్నర్‌ !

0

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష జరపనుండగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌ బి. జనార్ధన్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్‌ ఆమోదించలేదు. ఈ విషయాన్ని రాజ్‌భవన్‌ వర్గాలు మంగళవారం వెల్లడిరచాయి. ఇప్పటికే జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్‌ రాజీనామా తిరస్కరించడంతో సీఎం జరిపే సమీక్షకు జనార్ధన్‌రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో సచివాలయంలో సమీక్షించనున్నారు. గ్రూప్‌-2 పోటీ పరీక్షలు, గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీ,గ్రూప్‌-3 షెడ్యూలు ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, జనార్దన్‌రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖను అందజేశారు. 

ట్వీస్ట్‌ ఇచ్చిన గవర్నర్‌ !

పేపర్‌ లీకులు అయినప్పుడే నిరుద్యోగుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళసై లేఖ రాశారు. అప్పుడు దానిని డీఓపీటీకి రాష్ట్రపతి అధికారులు పంపించారు. టీఎస్‌ పీఎస్సీ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఏం జరిగిందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి లేఖ అందింది. మునుపటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పందించకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇపుడు ప్రభుత్వం మారగానే టీఎస్‌ఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా లేఖ ఇచ్చారు. ఇప్పటికే కోర్టులో పేపర్‌ లీకు కేసు ఉంది. గతంలో చర్యలు తీసుకునేలా బోర్డును పుర్తిగా రద్దు చేసేలా ముందుకి వెళ్లడమా..? లేదంటే జనార్దన్‌ రెడ్డి రాజీనామాను ఆమోదించడమా? అనే దానిపై గవర్నర్‌ సందిగ్ధంలో ఉన్నారు. రాజీనామా ఆమోదిస్తే పేపర్‌ లీకు సంగతి అంతేనా అనే ఆలోచనలో గవర్నర్‌ తమిళి సై ఉన్నారు. లీగల్‌ ఒపీనియన్‌ తీసుకోవడంతో పాటు.. ప్రస్తుత రాష్ట్ర సర్కార్‌ స్టాండ్‌ తెలుసుకునేందుకు సీఎస్‌కు లేఖ రాసే అవకాశం ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !