ASPD : పిల్లలకు పొంచిఉన్న మానసిక సంక్షోభం !

0

పుట్టుకతో ఎవరూ నేరస్తులు కాదు. జన్మతః ఏ ఒక్కరికీ చెడు వ్యసనాలు ఉండవు. కానీ కొందరు క్రమక్రమంగా పక్కదారి పడుతారు. కుటుంబ వాతావరణం, పరిసరాలు, నిత్యజీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలు, చెడు స్నేహాలు మనిషిని నెగెటివ్‌గా ప్రభావితం చేస్తాయి. మానసిక రుగ్మతలకు గురిచేస్తాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మానసిక అశాంతికి లోనవుతారు. వీలైనంత త్వరగా ఆ వలయంలోంచి బయటపడి యథాతథ స్థితికి వస్తారు. కొందరు మాత్రం నేర ప్రపంచం వైపు మళ్లుతారు. ఉన్మాదిలా మారిపోతారు. అలా నేర ప్రవృత్తివైపు తీసుకెళ్లే మానసిక స్థితినే వైద్య పరిభాషలో యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ (ASPD) అంటారు. పిల్లలు కౌమారదశలోనే యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ (ఏఎస్‌పీడీ) లక్షణాలు బాలబాలికల ఆలోచనల్ని దారితప్పిస్తాయి. హింసాత్మక ప్రవృత్తిని మెదడులోకి చొప్పిస్తాయి. తొలిదశలోనే ఆ లక్షణాలను గుర్తిస్తే.. యువతను మానసిక ఆరోగ్య సంక్షోభం నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.

వ్యాధి కాదు..

యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ అనేది నూటికి నూరుపాళ్లు వ్యాధి కాదు. ఒక రకమైన మానసిక లోపం. ఇలాంటి వారు ఇతరుల గురించి ఆలోచించరు. స్వార్థానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇట్టే నేర ప్రవృత్తి వైపు మొగ్గు చూపుతారు. అసాంఘిక కార్యకలాపాలు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, హత్యలు, అత్యాచారాలకు వెనుకాడరు. డ్రగ్స్‌, మద్యం, ధూమపానం వంటి వ్యసనాలకు కట్టు బానిసలు అవుతారు. సమాజంలోని కట్టుబాట్లు, నిబంధనలు ఏమాత్రం పట్టించుకోరు.

పర్యవేక్షణ కరువై

యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌కు ప్రధాన కారణం.. ఎదుగుతున్న వయసులో సరైన పర్యవేక్షణ లేకపోవడం. తగిన మార్గదర్శకత్వం అందకపోవడం. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, చిన్న కుటుంబ వ్యవస్థ ఇందుకు ప్రధాన కారణాలు. గతంలో దాదాపుగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. దీనివల్ల ఆ ఇంట్లోని పిల్లలకు ప్రేమరాహిత్యం సమస్య తెలిసేది కాదు. ఒంటరితనం బాధించేది కాదు. ప్రత్యేకించి బయటి స్నేహితుల అవసరమూ ఉండేదీ కాదు. తల్లిదండ్రులతోపాటు.. నానమ్మ, తాతయ్య, మేనమామలు, చిన్నాన్న, పెదనాన్న.. ఇలా బంధాలు బలంగా ఉండేవి. బంధుత్వాలు వెన్నంటి నిలిచేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీనికి తోడు యువత చదువుల కోసమో, ఉద్యోగం కారణంగానో తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. తీవ్ర భావోద్వేగాలకు గురైనప్పుడు, మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు, ప్రేమ వైఫల్యాలు, కెరీర్‌ పరాజయాలు ఎదురైనప్పుడు.. ఓదార్చేవారు లేక, మనోధైర్యం అందించేవారు కానరాక.. ఆలోచనలు పక్కదారి పడతాయి. అది కాస్తా ముదిరిపోయి.. యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌కు దారితీస్తాయి.

పెరిగిన వాతావరణమూ..

చిన్న కుటుంబాల స్వరూప, స్వభావాలు వేరుగా ఉంటాయి. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగ, వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటారు. పిల్లల్ని పర్యవేక్షించేందుకు పెద్ద దిక్కు ఉండదు. వాళ్లు ఆడిరదే ఆట, పాడిరదే పాట. కన్నవారు సంపాదనపరులు కాబట్టి, చేతినిండా డబ్బు. ఇంట్లో ఎవరూ ఉండరు కాబట్టి, కావల్సినంత స్వేచ్ఛ. దీన్నొక అవకాశంగా మార్చుకోడానికి స్నేహ బృందం సిద్ధంగా ఉంటుంది. వారసత్వ ప్రభావాన్నీ కాదనలేం. వాతావరణ పరిస్థితులు, బాల్యంలోని చేదు అనుభవాలు కూడా ప్రభావితం చేస్తాయి. యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌కు గురైన వ్యక్తులు ఎదుటివారు చెప్పేది వినిపించుకోరు. చదువుపై శ్రద్ధ పెట్టరు. మొండిగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రుల బాధనుకాని, బయటి వ్యక్తుల ఇబ్బందులను కాని పట్టించుకోరు. ఇట్టే ఆవేశపడతారు. హద్దులులేని కోపంతో ఊగిపోతారు. తల్లిదండ్రుల మాట వినరు. ఎదుటివారి గురించి ఆలోచించరు. ఎంతకైనా తెగిస్తారు. మద్యం, డ్రగ్స్‌, ధూమపానానికి అలవాటు పడతారు. డబ్బు అవసరం పెరగడంతో.. దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, హత్యలకు వెనుకాడరు.

కౌమారంలోనే గుర్తిస్తే..

బాల్యం నుంచి కౌమారంలో అడుగుపెట్టే సమయానికే ఎవరిలో అయినా మానసిక లోపాలను గుర్తించవచ్చు. పిల్లల ప్రవర్తన, మాటతీరు ఆధారంగా ఏఎస్‌పీడీని అంచనా వేయవచ్చు. పరిస్థితి తీవ్రమైతే భవిష్యత్తులో విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని యుక్త వయసులోనే ఆ లక్షణాలు కనిపెట్టి, పిల్లలకు సరైన చికిత్స అందించడంతోపాటు మార్గనిర్దేశం చేయాలి. లేకపోతే అటు తల్లిదండ్రులకు, ఇటు సమాజానికి భారంగా మారతారు. ఈ డిజార్డర్‌కు గురైన వారిని పూర్తిగా సాధారణ జీవనంలోకి తీసుకురావడం సాధ్యమే. తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్‌ తీసుకుంటూ నిపుణులు నిర్దేశించిన ప్రకారం మందులు వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ వంటివి మంచి ఫలితాలు ఇస్తాయి. దీంతోపాటు ఒత్తిడితో ముడిపడిన హార్మోన్‌ను నియంత్రించేందుకు కొన్నిరకాల మందులు అందిస్తారు.

తల్లిదండ్రులకు సూచన

చాలామంది తల్లిదండ్రులు వృత్తి, ఉద్యోగాల్లో తలమునకలైపోయి.. పిల్లలకు మానసికంగా దూరం అవుతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు సైతం.. నాలుగు కబుర్లు చెప్పుకోకుండా, స్కూలు గురించో, చదువు గురించో మాట్లాడకుండా.. ల్యాప్‌టాప్‌లోనో, కంప్యూటర్‌లోనో, ఫోన్‌లోనో తల దూర్చేస్తారు. అంటే.. భౌతికంగా పక్క పక్కనే ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం ఎంతో దూరం. ఇదంతా చేసిది పిల్లల భవిష్యత్తు కోసమే కదా’ అనే ఆత్మవంచన ఒకటి. ఈ పద్ధతి సరికాదు. పిల్లలకు తగిన సమయం కేటాయించాలి. వారి ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. భాషను గమనించాలి. అవసరాలు తెలుసుకుంటూ ఉండాలి. స్నేహంగా మెలగాలి. ముఖ్యంగా యుక్తవయసు పిల్లలను చదువు విషయంలో, ఉద్యోగాల విషయంలో ఇతరులతో పోల్చడం సరికాదు. ఇంటా, బయటా జరిగిన సంఘటనలు, ఎదురైన అనుభవాలు, లైంగిక దాడులు.. ఏదైనా కావచ్చు. పిల్లలు నిర్భయంగా పంచుకునేలా ఉండాలి. ఎంతసేపూ ప్రోగ్రెస్‌ కార్డులు, ర్యాంకులు, ఐఐటీ సీట్ల గురించే మాట్లాడకుండా.. పిల్లల మనస్తత్వం, సామర్థ్యం, అవసరాలు, ఇబ్బందులపై కూడా దృష్టి పెట్టాలి. బాల్యం నుంచే పిల్లలకు విలువలతో కూడిన జీవన విధానాన్ని, పాజిటివ్‌ దృక్పథాన్ని, ఆశావాదాన్ని, మానవతను పరిచయం చేయాలి.

గాడ్జెట్స్‌తో జాగ్రత్త..

ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. సెల్‌ఫోన్‌, ట్యాబ్‌ లాంటివి అవసరానికి ఇచ్చినా.. వాటిని పిల్లలు ఎలా వినియోగిస్తున్నారు, అందులో ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారు అన్నది సూక్ష్మంగా గమనిస్తూ ఉండాలి. బాల్యం నుంచే మితిమీరిన మొండితనం, అలవికాని స్వార్థం, హింసాత్మక ప్రవృత్తి తదితర లక్షణాలు ఉంటే.. సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. ఇవన్నీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయాల్సిన అంశాలు కాదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !