గతేడాది ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకుల్ని మురిపించి.. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు కథానాయకుడు రజనీకాంత్ ఇప్పుడు అదే జోష్‌లో ‘లాల్ సలాం’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. రజనీ కుమార్తె కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్ నేడు థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. పాటలు.. ప్రచార చిత్రాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్ర కథేంటి?ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకుంది?
కథేంటంటే
ఇది పూర్తిగా 1990ల కాలంలో నడిచే కథ. హిందూ ముస్లింలు ఐకమత్యంగా సోదర భావంతో మెలిగే కసుమూరు అనే గ్రామంలో కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ముంబయి వెళ్లి గొప్ప వ్యాపార వేత్తగా ఎదుగుతాడు మొయిద్దీన్ (రజనీకాంత్). తన కొడుకు షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్‌ను చేయాలన్నది అతని కల. మొయిద్దీన్ ఊరు వదిలి వెళ్లాక కొందరు రాజకీయ నాయకుల కుట్రల వల్ల ఊళ్లోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోతారు. ఇక ఆ ఊళ్లో త్రీస్టార్ - ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆట కూడా మతం రంగు పులుముకొని గొడవలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఒకరోజు మ్యాచ్ నడుస్తుండగా.. రెండు టీమ్స్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్). ఇంతకీ ఆ గురు మరెవరో కాదు మొయిద్దీన్ ప్రాణ స్నేహితుడి (ఫిలిప్ లివింగ్‌స్టోన్) తనయుడే. క్రికెట్‌లో జరిగిన ఆ గొడవ క్రమంగా మత కల్లోలంగా మారుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు క్రికెట్‌లో జరిగిన గొడవకు కారణమేంటి? షంషుద్దీన్ చేయి నరికేసేంత కోపం గురుకు ఎందుకొచ్చింది? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు? ఊళ్లో జాతరకు ఈ కథకూ ఉన్న సంబంధం ఏంటి? ఊళ్లోని మత కల్లోలాలు ఎలా సద్దుమణిగాయి? అన్నది మిగతా కథ.
ఎలా సాగిందంటే
మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో’... ఈ చిత్ర ట్రైలర్‌లో రజనీ చెప్పిన సంభాషణ ఇది. ఈ సినిమాతో దర్శకురాలు చెప్పదలుచుకున్న సందేశమిదే. ఇలా మతసామరస్యాన్ని చాటి చెప్పే నేపథ్యంలో ఇప్పటి వరకు తెరపైకి ఎన్నో కథలొచ్చాయి. అయితే దీంట్లో ఆ పాయింట్‌ను క్రికెట్‌ను కేంద్రంగా చేసుకొని.. దానికి రాజకీయ ముసుగును తగిలించి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. (%శ్రీaశ్రీ ంaశ్రీaaఎ ఎశీఙఱవ తీవఙఱవష ఱఅ ్‌వశ్రీబస్త్రబ%) ఊళ్లో జరిగే జాతర.. దాని కేంద్రంగా నడిచే సంఘర్షణ ఉప కథగా ఉంటుంది. అయితే ఈ మూడు అంశాల్ని సరిగ్గా మేళవించి కథనాన్ని ఆసక్తికరంగా ముందుకు నడపడంలో దర్శకురాలు ఐశ్వర్య ఆది నుంచే తడబడిరది. ఈ సినిమా ఏ దశలోనూ ఓ సరైన దిశలో ముందుకు సాగుతున్నట్లు అనిపించదు. ప్రథమార్ధమయ్యే వరకు అసలు కథేంటో కూడా ప్రేక్షకులకు అంతుచిక్కదు.ఒక ఊరి ఓట్ల కోసం రాజకీయ నాయకులు కుట్రలు పన్నడం.. కట్ చేస్తే ఊరి ప్రజల నుంచి తనని తాను రక్షించుకోవడం కోసం విష్ణు విశాల్ ప్రయత్నించడం.. మరోవైపు ఊళ్లో తలెత్తిన ఘర్షణలతో సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. కానీ, ఆ తర్వాత కథంతా ఏదో సినిమాకి సంబంధం లేనట్లుగా సాగుతున్నట్లు ఉంటుంది. గురు ప్రపంచం.. ఊళ్లోని రెండు ప్రధాన క్రికెట్ టీమ్స్ మధ్య జరిగే ఆట.. దాని మాటున జరిగే రాజకీయ కుట్రలు.. ఏవీ ఆసక్తికరంగా అనిపించవు. ఇక మధ్యలో వచ్చే లవ్ ట్రాక్.. పాటలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష. మధ్యలో రజనీ ఎంట్రీ ఎపిసోడ్.. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కాస్త ఊపశమనాన్నిస్తాయి. విరామానికి ముందు ఊరి జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కొంత నయం. ఆ జాతర కోసం అరువు తెచ్చిన తేరు (రథం)ను రాజకీయ కుట్రలో భాగంగా జాతర మధ్య నుంచే తీసుకెళ్లిపోవడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ద్వితీయార్ధమంతా ఎక్కువగా రథం చుట్టూనే తిరుగుతుంది. ఊరి వాళ్ల దృష్టిలో నీచుడిలా మారిన గురు తనని తాను మార్చుకొని నిరూపించుకోవడానికి జాతర కోసం రథం తయారు చేసి తీసుకురావాలని సిద్ధపడతాడు. ఈ క్రమంలో నడిపించే డ్రామా అంతా బోరింగ్. ఇక గురుకు.. షంషుద్దీన్‌కు మధ్య ఉన్న వైరానికి గల కారణం అంత బలంగా అనిపించదు. కథలో కీలకమైన మొయిద్దీన్ ఫ్రెండ్‌షిప్ ఎపిసోడ్‌ను ఎక్కడా మచ్చుకైనా చూపించరు. ఆఖర్లో జాతరను కేంద్రంగా చేసుకొని ‘కాంతార’ స్టైల్‌లో భిన్నమైన ముగింపు ఇవ్వాలని ప్రయత్నించినా.. అదీ వర్కవుట్ అవ్వలేదు.
ఎవరెలా చేశారంటే
మొయిద్దీన్ పాత్రలో రజనీకాంత్ కనిపించినంత సేపు ప్రేక్షకుల్లో ఓ ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క రిలీఫ్ ఆయన మాత్రమే. అయితే తను కూడా తన కూతురుపై ప్రేమతోనే ఈ సినిమా చేశాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఆయనలోని నటుడికి పని చెప్పే సన్నివేశం ఒక్కటి కూడా కనిపించదు. ఆయన పాత్రకు దీంట్లో సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. మనో గాత్రానికి అలవాటు పడిన ప్రేక్షకులకు అదంత అతికినట్లుగా అనిపించదు. గురు పాత్రలో విష్ణు విశాల్ చక్కగా నటించాడు. తనదైన శైలిలో తేలికగా ఈ పాత్రను చేసుకుంటూ వెళ్లిపోయాడు. విక్రాంత్, సెంథిల్, తంబి రామయ్య, నిరోషా తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. హీరో తల్లి పాత్రలో జీవిత ఆద్యంతం ఏడుపు లుక్‌లోనే కనిపించింది. నాయిక పాత్రైతే ముచ్చటగా మూడు సన్నివేశాలకే పరిమితం. మతం, క్రికెట్, స్నేహం, రాజకీయం.. ఇలా అనేక రకాల అంశాల్ని కిచిడీ చేసి ప్రేక్షకులకు ఏదో భిన్నమైన రుచి చూపించాలనుకుంది దర్శకురాలు ఐశ్వర్య. అది ఏ దశలోనూ ప్రేక్షకులకు మింగుడు పడని విధంగానే తయారైంది. ఈ సినిమాలో ఏది ఫ్లాష్‌బ్యాకో.. ఏది వర్తమానంలో జరుగుతున్న కథో అసలు అర్థం కాదు. ఇక జాతర.. ఆ నేపథ్యంలో వచ్చే పాటలు, కొట్లాటలు.. అంతా సహనానికి పరీక్షలాగే ఉంటాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.