Hero Vijay : తమిళనాడులో హీరో విజయ్‌ కొత్త రాజకీయ పార్టీ !

0


తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ కథానాయకుడు, దళపతి విజయ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని విజయ్‌ అధికారికంగా సోషల్‌ మీడియాలో ప్రకటించారు.  ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చా. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు. ఇతర పార్టీలకు మద్దతు కూడా ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం’’ అని విజయ్‌ వెల్లడిరచారు. ఇక, పార్టీ జెండా, అజెండాను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

తమిళగ వెట్రి కళగం పేరుతో...

తమిళనాట రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయి స్టార్‌డమ్‌ ఉన్న నటుడు విజయ్‌. అభిమానులు ‘దళపతి’ అని పిలుస్తుంటారు. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు. ప్రతిభ చూపిన పదో తరగతి, ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రానని స్పష్టంచేయడంతో.. విజయ్‌ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేశారు. అందులో భాగంగానే విజయ్‌ మక్కల్‌ ఇయక్కం (అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై రాజకీయ పార్టీపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ‘తమిళగ మున్నేట్ర కళగం’ పేరుతో పార్టీని స్థాపిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. దీనికి స్వల్ప మార్పులు చేసి  ‘తమిళగ వెట్రి కళగం’ పేరును ఖరారు చేశారు. పార్టీ ప్రకటన అయితే వచ్చేసింది కానీ అందుకు సంబంధించిన గుర్తును త్వరలో ప్రకటించనున్నారు. పార్టీ ఎజెండాను కూడా త్వరలో ప్రకటిస్తామాని విజయ్‌ నుంచి ఒక నోట్‌ వెలువడిరది. 

సేవా కార్యక్రమాలతో...

హీరో విజయ్‌ తన రాజకీయ రంగప్రవేశం ఒకరోజుతో అనుకుని జరగలేదు. పక్కా ప్లాన్‌తోనే ఆయన అడుగులు వేశారు. పొలిటికల్‌ రంగంలోకి దిగిన తర్వాత తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అనే దృఢ సంకల్పంతోనే టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన విజయ్‌ మక్కళ్‌ ఇయక్కుమ్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరవయ్యారు. ఈ సంఘం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆపై అనేక రక్తదాన శిబిరాలతో పాటు  ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయ్‌ ఏర్పాటు చేశారు.గతేడాది తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ముగ్గురు చొప్పున తన కార్యాలయానికి రప్పించి వారికి ప్రశంసాపత్రాలతో పాటు కానుకలను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌ వారితో ముఖ్యంగా నోటుకు ఓటు విధానం సరికాదని, దీన్ని అందరూ పాటించాలని హితవు పలికారు. నెలరోజుల క్రితం తమిళనాడులో తుపాను దెబ్బకు వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారందరికి తనవంతుగా సాయం అందించి వారికి అండగా నిలిచాడు. ఇలా తన పొలిటికల్‌ ఎంట్రీ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు.  ప్రస్తుతం తమిళనాడులో సినిమా పరిశ్రమ నుంచి కమల్‌ హాసన్‌, ఖుష్బూ, నమిత వంటి వారు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. విజయ్‌ రాకతో ఆయన పార్టీలోకి మరికొంత మంది చేరనున్నారని సమాచారం.

తెలుగు చిత్రాలతో స్టార్‌డమ్‌

విజయ్‌కి ఈ స్థాయి స్టార్‌డమ్‌ రావడం వెనుక తెలుగు చిత్రాల ప్రభావం ఎక్కువగానే ఉంది. విజయ్‌ కెరీర్‌లో ‘పోక్కిరి’, ‘గిల్లి’, ‘బద్రి’, ‘ఆది’, ‘వేలాయుధం’, ‘యూత్‌’ వంటి సినిమాలు ముఖ్యమైనవి. ఆ చిత్రాలే కెరీర్‌ను మలుపు తిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమా రీమేక్‌లు కావడం విశేషం. అలాగే విజయ్‌ అభిమానులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏడాదిలో రెండుసార్లు నేరుగా సమావేశమై వారికి విందు, బహుమతులు అందిస్తారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !