Arvind Kejriwal : దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ !

0

దిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్‌ చేశారు. ఈడీ బృందం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను తనతో పాటు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్ళింది. మరోవైపు, దిల్ల్లీ సీఎం నివాసం వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రభస సృష్టిస్తున్నారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద కుట్రేనని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా అన్నారు.  మరోవైపు ఢల్లీి పోలీసులు డ్రోన్లతో ఆ ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. 

హైకోర్టులో ఊరట లేదు

మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటివరకు 9 సార్లు సమన్లు ​​పంపిన విషయం తెలిసిందే! ఈడీ బృందం 10వ సమన్లతో గురువారం సాయంత్రం కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకుంది. సీఎం నివాసంలో రెండు గంటల పాటు విచారించారు. ఈ సమయంలో ఈడి జాయింట్‌ డైరెక్టర్‌ కపిల్‌ రాజ్‌ కూడా కేజ్రీవాల్‌ నివాసంలో ఉన్నారు. పీఎంఎల్‌ఏలోని సెక్షన్‌ 50 కింద కేజ్రీవాల్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర సీఎం కేజ్రీవాల్‌ను విచారించింది. పక్కా ఆధారాల ప్రకారం సీఎం ఇంట్లో సోదాలు జరిగాయి. కాగా, హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ న్యాయవాద బృందం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు దిల్ల్లీ కేబినెట్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా కేజ్రీవాల్‌ ఇంటి బయటికి చేరుకుని కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

నోట్‌ విడుదల చేసిన ఈడీ !

దిల్లీిలో న్యూ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్‌  ముఖ్య కుట్రదారు అని మీడియాకు విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత, ఆప్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌లతో కలిసి కుట్రకు తెరతీశారని వివరించారు. న్యూ ఎక్సైజ్‌ పాలసీతో సౌత్‌ లాబీకు భారీగా లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. అందుకు ప్రతీగా సౌత్‌ లాబీ ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల నగదు ఇచ్చిందని వెల్లడిరచారు. లిక్కర్‌ పాలసీ కేసు విచారణ క్రమంలో కొందరు నిందితులు, సాక్షులు తమ వాంగ్మూలంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును చెప్పారని అధికారులు రిమాండ్‌, చార్జిషీట్లలో రాశారు. లిక్కర్‌ పాలసీ కేసులో నిందితుడు అయిన విజయ్‌ నాయర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యాలయానికి తరచు వెళ్లేవారని అధికారులు తెలిపారు. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని వివరించారు. అలాగే లిక్కర్‌ పాలసీ గురించి కేజ్రీవాల్‌తో చర్చించామని మద్యం వ్యాపారులకు విజయ్‌ నాయర్‌ చెప్పారని అధికారులు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను కలువడానికి ఇండో స్పిరిట్‌ యజమాని సమీర్‌ మహేంద్రను విజయ్‌ నాయర్‌ పంపారని తెలిపారు. తర్వాత మరోసారి ముగ్గురు కలిసి వీడియో కాల్‌ మాట్లాడారని వివరించారు. తను విశ్వసించే వారిలో నాయర్‌ ఒకరని మహేంద్రతో అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారని ఈడీ అధికారులు చెబుతున్నారు. సౌత్‌ లాబీలో తొలి నిందితుడు రాఘవ్‌ మాగుంట సాక్షిగా మారిన సంగతి తెలిసిందే. రాఘవ్‌ తండ్రి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిశారని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

ఇదిలా ఉండగా.. ఈ అంశంపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి గురువారం రాత్రి విచారణ జరిపించేలా లీగల్‌ టీమ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

కేజ్రీవాల్‌ గొంతు అణచివేసేందుకే.. అసెంబ్లీ స్పీకర్‌

కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారుల రాకపై దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయెల్‌ స్పందించారు. మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసినా ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ గొంతు అణిచివేసేందుకే.. ఆయన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారని గోయెల్‌ విమర్శించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !