Malla Reddy : కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యే మల్లారెడ్డి ?

0

ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవారే రాజకీయ నాయకుడు. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి గెలుచుకున్న ఎమ్మేల్యే పదవికి ప్రతిపక్షంలో కూర్చుంటే ఏమొస్తుంది. అందుకే ప్రతిపక్షంలోని కొందరు అధికార పార్టీ పంచన చేసి పదువులను అనుభవించేందుకు తహతహలాడుతున్నారు. ఆ కోవలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి హస్తం గూటికి చేరేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. కారు గుర్తు పార్టీకి త్వరలో గుడ్‌బై చెప్పేందుకు మల్లారెడ్డి సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి అనుసరిస్తున్న తీరే ఇందుకు ఉదాహరణ. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎప్పుడెప్పుడు పిలుస్తారా..? ఎప్పుడు పార్టీ జంప్‌ చేద్దామా..? అని మల్లారెడ్డి వెయిటింగ్‌ చేస్తున్నట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన మల్లారెడ్డి అవి బెడిసి కొట్టడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కీలక మంత్రితో భేటీ..

రాష్ట్ర మంత్రి వర్గంలోని ఓ కీలక మంత్రిని ఈ నెల 4వ తేదీన మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్‌ భద్రారెడ్డిలు రహస్యంగా కలిసినట్లు సమాచారం. తనను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవాలని మల్లారెడ్డి సదరు మంత్రిని అభ్యర్థించినట్లు తెలిసింది. తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని రిక్వెస్ట్‌ చేసినట్లు సమాచారం. అయితే మంత్రి మాత్రం మీ రాకను పార్టీ పెద్దలు ఒప్పుకోక పోవచ్చని, కానీ తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చినట్లు తెలిసింది. సీఎంను ఏలాగైనా ఒప్పించాలని, లేకపోతే ఢల్లీి స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలని మల్లారెడ్డి కోరినట్లు తెలిసింది.

డీకేతో రాయబారం..

కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రాయబారం నడుపుతున్నట్లు తెలిసింది. కర్నాటక స్టేట్‌కే చెందిన తన చిన్న కోడలు డాక్టర్‌ ప్రీతి రెడ్డి ద్వారా డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ఉంది. అయితే డీకే శివకుమార్‌ ఒక వేళ పార్టీ పెద్దలను ఒప్పించగలిగితే ఈ నెల 9వ తేదీన మేడ్చల్‌ నియోజకవర్గం కండ్లకోయలో జరిగే సీఎం సభలో పార్టీలో చేరాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. లేదంటే ఈ నెల 11వ తేదీన తన చిన్న కొడుకు భద్రారెడ్డితో సభా వేదికపై కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు ట్రై చేస్తున్నట్లు సమాచారం ఉంది.

బీఆర్‌ఎస్‌కు రaలక్‌..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులను కాంగ్రెస్‌ సర్కార్‌ మోసం చేసిందంటూ ఈ నెల 6న బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఆయా నియోజవకర్గాలు, మండలాల్లో ఆందోళన చేపట్టారు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం పార్టీ ఇచ్చిన పిలుపును బేఖాతరు చేశారు. తన నియోజకవర్గం మేడ్చల్‌తో సహా ఏక్కడ ఆయన ధర్నాలో పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌ చేసి ధర్నాలో ఎందుకు పాల్గొనలేదని అడిగితే.. తాను సాయంత్రం వచ్చి కలుస్తానని మల్లారెడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

బీజేపీతో బెడిసి కొట్టిందా..?

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మల్కాజిగిరి ఎంపీగా తన చిన్న కుమారుడు భద్రారెడ్డిని పోటీ చేయించాలని మల్లారెడ్డి ప్లాన్‌ వేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ నియోజకవర్గమంతా ప్లేక్సీలు ఏర్పాటు చేసి హల్‌ చల్‌ చేశారు. అయితే మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కష్టమని పలు సర్వేలు తేల్చడంతో మల్లారెడ్డి డైలామాలో పడ్డారు. కాగా భద్రారెడ్డి సైతం తన పొలిటికల్‌ కెరీర్‌ ను ఓటమితో ప్రారంభించడం ఇష్టంలేదని, దానికి తోడు డబ్బులు కూడా పోతాయని వెనకడుగు వేసినట్లు తెలిసింది. దీంతో బీజేపీ పార్టీ నుంచి ఎంపీ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే బీజేపీ పెద్దలు ఈసారి ఎంపీగా ఈటల రాజేందర్‌ ను గెలిపించాలని, పార్టీలోకి రావాలంటే మల్లారెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించడంతో బీజేపీ ప్రపోజల్స్‌తో మల్లారెడ్డి వెనక్కి దగ్గినట్లు తెలిసింది.

పార్టీ పెద్ద నిర్ణయం కోసం వెయిటింగ్‌..

పార్టీ పెద్దలు పిలిస్తే మల్లారెడ్డి హస్తం గూటికి చేరనున్నారని టాక్‌ వినిపిస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డిని ఒప్పించేందుకు తన సమీప బంధువు, ఓ మాజీ ఎమ్మెల్యేను ఇటీవల మల్లారెడ్డి సంప్రదించినట్లు తెలిసింది. అయితే సదరు మాజీ ఎమ్మెల్యే.. నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించినట్లు తెలిసింది. రాజీనామా చేసినట్లయితే సీఎంతో మాట్లాడుతానని హామి ఇచ్చినట్లు తెలిసింది. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉన్నప్పడు మంత్రిగా మల్లారెడ్డి.. రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు, ఛాలెంజ్‌లు చేసిన సంగతి తెలిసిందే.. తొడగొట్టి మరీ రేవంత్‌కు మల్లారెడ్డి సవాలు విసిరారు. పరుష పద జాలంతో దూషించారు. కానీ ఇప్పుడు రేవంత్‌ దయ కోసం మల్లారెడ్డి ఎదురు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి రాకను ఒప్పుకుంటారా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే మరీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !