గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్‌కు అండగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే తాను సమాచారాన్ని ధ్వంసం చేశానని ప్రణీత్‌రావు వెల్లడిరచిన సంగతి తెలిసిందే. 2018 నుంచే అక్రమ ట్యాపింగ్ దందా మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. ఇజ్రాయిల్ నుంచి అత్యాధునిక ఉపకరణాలు ఖరీదు చేయగా, రామ్ గోపాల్ కన్సల్టెంట్, అడ్వైజర్‌గా వ్యవహరించారు. ఆదిలాబాద్ ఘర్షణ సమయంలో అక్కడ వినియోగించినట్లు గుర్తించారు. ప్రణీత్‌రావు కేసులో మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. కాగా, మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్‌లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండగా ఉన్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్‌కు ఎస్‌ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్‌ఐబీలో ఉన్న ఇతర ఇన్‌స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం.
ప్రణీత్ రావు పిటీషన్ కొట్టేసిన కోర్టు
మరోవైపు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసులో అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ ప్రణీత్‌రావు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారమే వాదనలు జరగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 24 గంటలూ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదని నాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారన్నారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదన్నారు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పారు. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోందని చెప్పారు. ఈ వాదనలను విన్న హైకోర్టు ప్రణీత్ రావు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడిరచింది. ఈ సందర్బంగా కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.ఇక ఈ కేసు విచారణలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్‌ఐబీ స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్ అడ్డాగా మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అండ్ టీమ్ నిర్వాకాల డొంకలు కదులుతున్నాయి. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కొత్త మాల్వేర్ ద్వారా ప్రణీత్ రావు అండ్ టీమ్ ప్రైవేటు వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో తేలింది. కాల్ రికార్డ్స్‌ను హార్డ్‌డిస్కల్లో ప్లస్ పెన్ డ్రైవ్‌లో సేవ్ చేశారు. ఎస్‌ఐబీ కంప్యూటర్లలో కొన్ని సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసిన ప్రణీత్.. ఎన్నికలు రోజు ఆ సాఫ్ట్‌వేర్లను డిలీట్ చేసినట్టు విచారణలో తేలింది. ప్రభుత్వం మారిపోగానే.. ఎస్‌ఐబీకి చెందిన పలు హార్డ్ డిస్క్‌లను కట్టర్లతో కత్తిరించి, వాటిని అడవిలో పడేసినట్లు ప్రణీత్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.