- సంతానలేమి సమస్యతో యువ జంటలు సతమతం
- ప్రతి100లో 30- 40 జంటలకు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్
- ఇటీవల సంతాన ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం
- రెండు లక్షల మంది రావడంతో అవాక్కైన ఆలయ పూజారులు
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోలేని ట్రీట్‌మెంట్
- సంతానం లేక డిప్రెషన్‌లోకి లక్షలాది జంటలు
భారతీయ జంటల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు. భారతదేశంలో కోట్ల మంది దంపతులు అనేక కారణాల వల్ల పిల్లలు కనలేకపోతున్నారు. పెళ్లయిన ప్రతి జంట త్వరగా తల్లిదండ్రులు అయ్యేందుకు ఇష్టపడతారు. అయితే భారతదేశంలో తొలిసారిగా అనేక జంటలు పిల్లలు కలగక ఇబ్బంది పడుతున్నారు. ది లాన్సెట్ చేసిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు చాలా తగ్గిపోయినట్టు బయటపడిరది. అలాగే ఒక మహిళ ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లల్ని కంటున్నట్టు తేలింది. మన దేశంలో దాదాపు 28 మిలియన్ల జంటలు పిల్లలు లేక బాధ పడుతున్నారని ఈ అధ్యయనంలో బయటపడిరది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌ఫర్టిలిటీకి ట్రీట్‌మెంట్ అందించే సౌకర్యాలు లేకపోవడం, ప్రైవేటు హాస్పిటళ్లలో రూ.లక్షల్లో చార్జీలు వసూలు చేస్తుండడంతో ఆర్థిక స్థోమత లేని ఎంతో మంది మానసికంగా కుంగిపోతున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని అక్కడి పూజారులు చెప్పడంతో.. గత శుక్రవారం ఏకంగా రెండు లక్షల మంది ప్రసాదం కోసం ఆ గుడికి వచ్చారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. తోపులాటల మధ్యే 30 వేల మంది మహిళలకు పూజారులు ప్రసాదం అందించారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ప్రసాదం కోసం జనాలు రాలేదు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానంలేని మహిళలకు, సంతాన భాగ్యం కలుగుతుందని ఈసారి పూజారులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి సంతానలేమితో ఇబ్బంది పడుతున్న మహిళలు గుడికి పోటెత్తారు. అయితే, రాష్ట్రంలో ఉన్న ఇన్‌ఫర్టిలిటీ సమస్యను ఈ ఒక్క ఘటన తేటతెల్లం చేసింది. మళ్లీ ఇదే స్థాయిలో జనాలు వస్తారన్న భయంతో, ఈ నెల 20న జరగాల్సిన ‘‘వివాహ ప్రాప్తిరస్తు’’ పూజకు భక్తులను రావొద్దని ఆలయ పూజారులు పిలుపునిచ్చారు. లేకుంటే, పెళ్ళి జరగక ఎంత మంది ఇబ్బంది పడుతున్నరో కూడా తేలిపోయేది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి ఆరు జంటలలో ఒక జంట పిల్లలు కలగక ఎంతో బాధను అనుభవిస్తున్నారు. పిల్లలు కలగక పోవడానికి జీవనశైలి పద్ధతులతో పాటు జీవసంబంధ కారకాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే జన్యుపరమైన కారణాలవల్ల, పర్యావరణ కారణాలవల్ల కూడా పిల్లలు కలగకపోవడం అనేది జరుగుతుందని వివరిస్తున్నారు వైద్యులు.
స్త్రీ పురుషుల్లో సమస్యలు
కేవలం మహిళల్లోనే కాదు పురుషుల్లో ఎన్నో సమస్యల వల్ల వారికి పిల్లలు కలగడం లేదని చెబుతున్నారు వైద్యులు. పురుషుల్లో స్పెర్మ్ కౌంటు తక్కువగా ఉండడం, వీర్య కణాలు కదిలే వేగం తక్కువగా ఉండడం, స్పెర్మ్ ఆకారం అసాధారణంగా ఉండడం వంటివి సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. ఇక మహిళల్లో హార్మోన్లు అసమతుల్యత ఉండడం, అండోత్సర్గం సరిగా జరగకపోవడం, గర్భాశయం లేదా ఫెలోపియన్ ట్యూబులలో అసాధారణలు ఉండడం, వయస్సు ఎక్కువగా ఉండడం వంటివి కూడా ప్రధాన కారకాలుగా ఉన్నాయి. మహిళ అండాలు నాణ్యతగా ఉంటేనే పిల్లలు కలుగుతారు. ఎప్పుడైతే వాటి నాణ్యత తగ్గుతుందో... పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది.
జీవన శైలి వల్ల
ఆధునిక జీవనశైలిలో ఆహారం ఎంతో మారిపోయింది. దీని వల్ల పురుషులు, మహిళల ఆరోగ్యం ఎంతగానో ప్రభావితం అవుతుంది. మహిళల్లో అండోత్సర్గంలో సమస్యలు వస్తున్నాయి. అండోత్సర్గంలో అండం విడుదలవ్వక పోవడం, పీరియడ్స్ రాకపోవడం, పీరియడ్స్ చాలా తక్కువ సమయం పాటు కావడం వంటివి కూడా కారణంగా మారుతున్నాయి. థైరాయిడ్ గ్రంధి సమస్యలు, అడ్రినల్ సమస్యలు, పిట్యూటరీ వ్యాధి వంటివి మహిళల్లో అండోత్సర్గం సరిగా కాకుండా అడ్డుకుంటాయి. అండోత్సర్గము సరిగా కాకపోతే పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. అండోత్సర్గంలో అండం విడుదలయితేనే వీర్య కణంతో కలిసే అవకాశం ఉంటుంది. అదే అండం విడుదల కాకపోతే పిల్లలు పుట్టే అవకాశం సున్నా.మహిళల్లో ఫైబ్రాయిడ్లు సమస్యలు, అండాశయంలో తిత్తులు పెరగడం, ఎండోమెట్రియోసిస్ వంటి పరిస్థితుల వల్ల గర్భం ధరించలేకపోతున్నారు.
ఇక పురుషుల్లో
హైపోథాలమస్, పిట్యూటరీ వ్యాధులు కూడా పిల్లలు కలగకుండా అడ్డుకుంటున్నాయి.ఎవరైతే అధిక ధూమపానం, మద్యపానం చేసేవారు, ఎక్కువ కాలం పాటు కూర్చుని ఉండే ఉద్యోగాలు చేసేవారు, వ్యాయామం చేయనివారు, వాయు కాలుష్యానికి గురయ్యేవారిలో సంతానలేని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. నలభై ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత చాలా వరకు తగ్గుతుంది. ఇది కూడా సంతానోత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు ఉన్న పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు.అధ్యయనాల ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1950లో దాదాపు 6.2గా ఉండేది. 2021లో ఆ రేటు రెండు కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. ఇలాగే కొనసాగితే 2050 కల్లా 1.29కి, 2100 సంవత్సరానికల్లా 1.04కి పడిపోయే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.ఆధునిక జీవనశైలిని మార్చుకోకపోతే మహిళలు, పురుషుల్లో సంతానాన్ని కనే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయని చెబుతున్నారు వైద్యులు.
పట్టించుకోని ప్రభుత్వాలు
మారిన లైఫ్ స్టైల్‌తో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగాయి. పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. కానీ, ఈ సమస్యను ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు పెడుతామని 2017లో ప్రకటించిన నాటి బీఆర్‌ఎస్ సర్కార్, 2023 వరకూ ఒక్క గాంధీ హాస్పిటల్లో మాత్రమే ఫర్టిలిటీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక్కడ ఐయూఐ, ఐవీఎఫ్ వంటి ఆధునిక చికిత్సలు కూడా అందించాలని నిర్ణయించి, అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేశారు. నిరుడు అక్టోబర్‌లో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీ శ్‌రావు ఈ సెంటర్‌ను హడావుడిగా ప్రారంభించారు. కానీ, ఇప్పటివరకూ అక్కడ ఒక్కరికి కూడా ఐవీఎఫ్ చేయలేదు. ఐవీఎఫ్ చేయడానికి కావాల్సిన రీఏజెంట్స్, మెడిసిన్‌ఏ వీ అందుబాటులో లేకపోవడం వల్ల తామేమీ చేయలేకపోతున్నామని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే, ఐవీఎఫ్ సెంటర్ నడపడానికి గైనకాలజిస్ట్‌తో పాటు, ఎంబ్రియాలజిస్ట్ కూడా అవసరం. వీర్యం, అండం కలెక్ట్ చేసి, వాటిని ట్యూబ్‌లో ఫలదీకరణం చెందించే బాధ్యత అంతా ఎంబ్రియాలజిస్టుదే. కానీ, గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో అసలు ఎంబ్రియాలజిస్టునే ఇప్పటివరకూ నియమించలేదు. దీంతో ఎక్విప్‌మెంట్ అంతా నిరుపయోగంగా మారింది.
ప్రైవేట్‌లో అడ్డగోలు దోపిడీ
ఇన్‌ఫర్టిలిటీ సమస్య డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. సమస్య తీవ్రతను ప్రభుత్వాలు తెలుసుకోలేక పోయినా, డాక్టర్లు మాత్రం సమస్యను పసిగట్టి వందల సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వ దవాఖాన్లలో అసలు ఫర్టిలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడం వీరికి మరింత కలిసొచ్చింది. ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రూ.50 వేల నుంచి 80 వేల మధ్య పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు ఏకంగా రూ.3 లక్షల నుంచి 6 లక్షలు చార్జ్ చేస్తున్నారు. ఈ దోపిడీ ఆరోగ్యశాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకూ తెలిసే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.