aa okkati adakku review : ఆ ఒక్కటీ ఆడక్కు మూవీ రివ్వ్యూ

0

వినోదాత్మక చిత్రాలతో సినీప్రియుల్ని మురిపించిన అల్లరి నరేష్‌ ‘నాంది’తో సీరియస్‌ సినిమాల వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో ‘ఉగ్రం’, ‘మారేడుమిల్లి నియోజకవర్గం’ చిత్రాలతో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. దీంతో ఆయన మళ్లీ తన కామెడీ జోన్‌లోకి వచ్చి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ చిత్రం చేశారు. ప్రచార చిత్రాలు నరేష్‌ శైలి వినోదాలతో ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడిరది. మరి ఈ సినిమా థియేటర్లో ఏస్థాయిలో నవ్వులు పూయించింది? అల్లరి నరేష్‌ను కెరీర్‌ను మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? ఇప్పడు చూద్దాం.

కథేంటంటే

గణపతి (అల్లరి నరేష్‌) రిజిస్టర్‌ ఆఫీసులో పని చేస్తూ ఉంటాడు, అతనికి వయసు పైబడుతున్నా ఇంకా పెళ్లి అవదు. ఆసక్తికరం ఏంటంటే గణపతి తమ్ముడికి పెళ్ళైపోతుంది, అతని భార్య (జామీ లీవర్‌), పాప కూడా గణపతితోనే వుంటారు. గణపతికి ఎన్ని సంబంధాలు వస్తున్నా ఒక్కటి కూడా కుదరకపోవడంతో అతను హ్యాపీ మాట్రిమోనీ అనే ఒక వివాహాలు కుదిర్చే సంస్థలో తన పేరుని నమోదు చేసుకుంటాడు. వాళ్ళు అమ్మాయిల ఫోటోలను, వారి వివరాలని పంపిస్తామని చెపుతారు. ఈలోగా గణపతికి, సిద్ధి (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయి పరిచయం అవుతుంది, ఆమెతో ప్రేమలో పడతాడు. సిద్ధిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు, కానీ ఆమె ఆ ఒక్కటి అడక్కు అని సమాధానం చెబుతుంది. వివాహాలు కుదిర్చే సంస్థ అమ్మాయిల ఫోటోలు, నంబర్స్‌ గణపతికి పంపిస్తారు, కానీ అందులో కొంతమందికి వివాహం అయిపోవటం, కొంతమంది చేసుకోను అని చెప్పటం జరుగుతూ ఉంటుంది. నిరాశతో వున్న గణపతి రెండు సార్లు విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఈ క్రమంలోనే జబ్బు పడిన తన తల్లిని సంతోష పెట్టేందుకు ఓసారి సిద్ధిని తన ప్రియురాలిగా ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాడు. కట్‌ చేస్తే.. ఆ మరుసటి రోజే సిద్ధి గురించి ఓ వార్త బయటకొస్తుంది. హ్యాపీ మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే ఖిలాడీ లేడీ అంటూ వార్తల్లోకి ఎక్కుతుంది. అసలు సిద్ధి అనే అమ్మాయి ఎవరు, ఆమె నేపధ్యం ఏమిటి? ఈ మాట్రిమోనీ సంస్థల నిజస్వరూపం ఏంటి? నిజంగానే వాళ్ళు వివాహాలు కుదురుస్తారా, లేక డబ్బులు కోసం మాయమాటలు చెప్పి, ఎవరివో అమ్మాయిల ఫోటోలు, నంబర్లు ఇస్తుంటారా? గణపతి చివరికి ఏమి చేశాడు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలు తెలియాలంటే ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా చూడాల్సిందే.

ఎలా సాగిందంటే 

పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువతీయువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు? ఆ వివాహ వేదికల ద్వారా వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? సదరు సంస్థలు వాళ్ల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నాయన్నది ఈ చిత్రంలో ప్రధానంగా చర్చించారు. నిజానికిది చాలా సీరియస్‌ ఇష్యూ. ఆ అంశాన్నే ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు మల్లి అంకం. కాకపోతే ఈ సీరియస్‌ కథకు దర్శకుడు వేసిన షుగర్‌ కోటింగ్‌ చాలా తక్కువగా అనిపించింది. ఫలితంగా ఈ కథ అటు సీరియస్‌గా సాగక.. ఇటు కామెడీగా నడవక రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైంది. పెళ్లి కాని కుర్రాడిగా తన ఫ్రస్టేషన్‌ను చూపెడుతూ ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌తో నరేష్‌ పాత్రను పరిచయం చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది. గణ కుటుంబ నేపథ్యం.. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్‌ చేసే హంగామా.. ఈ క్రమంలో వచ్చే గణ పెళ్లి చూపుల ఎపిసోడ్‌.. అన్నీ సరదా సరదాగా సాగిపోతాయి. సిద్ధి పాత్ర కథలోకి ప్రవేశించాక సినిమా కాస్త రొమాంటిక్‌గా మారుతుంది. ఇక హ్యాపీ మ్యాట్రిమోనీలో సభ్యుడిగా చేరాక గణకు ఎదురయ్యే అనుభవాలు ఓవైపు నవ్విస్తూనే ఆలోచింపజేయిస్తాయి. కాకపోతే ఆ తర్వాత నుంచి కథలో వినోదం కంటే సీరియస్‌నెస్‌ పెరుగుతూ పోయింది. విరామానికి ముందు సిద్ధిలోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయమవుతుంది. అది చూశాక గణ కూడా ఆమెతో చేతిలో మోసపోనున్నాడా? అన్న ఆసక్తి అందరిలోనూ మొదలవుతుంది.ద్వితీయార్ధంలో ఓవైపు గణ లవ్‌ట్రాక్‌ను చూపిస్తూనే.. మరోవైపు మ్యాట్రిమోనీ సైట్ల మాటున జరుగుతున్న మోసాల్ని బలంగా ఎత్తిచూపే ప్రయత్నం చేశారు దర్శకుడు. దీంతో కథ పూర్తిగా సీరియస్‌గా సాగుతున్న అనుభూతి కలుగుతుంది. దీంట్లో చూపించిన ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు తెలిసిన వ్యవహారమే అయినా ఫేక్‌ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్‌ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అలాగే దీని చుట్టూ నడిపిన కామెడీ ట్రాక్‌ అక్కడక్కడా నవ్వులు పూయించింది. గణ కెరీర్‌ పరంగా మంచిగా స్థిరపడినా.. తనకు పెళ్లి కాకపోవడానికి వెనకున్న కారణం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. సినిమాని ముగించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే

గణపతి వంటి ఫ్రస్టేషన్‌ పాత్రలు అల్లరి నరేష్‌కు కొట్టిన పిండి. అందుకే ఈ పాత్రను ఆయన తనదైన శైలిలో తేలికగా చేసుకుంటూ వెళ్లిపోయారు. కాకపోతే ఆయనలోని కామెడీని దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారనిపిస్తుంది. సిద్ధి పాత్రలో ఫరియా అందంగా కనిపించింది. కథలో ఆమెది మంచి ప్రాధాన్యమున్న పాత్రే. ఆరంభంలో చలాకీ నటనతో ఆకట్టుకున్న తను.. ద్వితీయార్ధంలో భావోద్వేగభరితమైన నటనతో కట్టిపడేస్తుంది. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్‌ నటన నవ్వులు పూయిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర కనిపించినప్పుడల్లా థియేటర్లో నవ్వులు వినిపిస్తాయి. వెన్నెల కిషోర్‌, హర్ష పాత్రలు తెరపై కనిపించినంత సేపూ నవ్వించాయి. ఇక మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని ఆద్యంతం వినోదభరితంగా తీర్చిదిద్దుకోవడంలో తడబడ్డాడు. ఇందులో బలమైన సంఘర్షణ కనిపించదు. ప్రతి సీన్‌ ఊహలకు తగ్గట్లుగానే సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు డ్రామా మరీ సినిమాటిక్‌గా ఉంది. గోపీసుందర్‌ పాటలు, నేపథ్య సంగీతం ఓకే అనే స్థాయిలోనే ఉన్నాయి. విజువల్స్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !