Sam Pitroda : దక్షిణాది వాళ్ళు ఆఫ్రికన్స్‌లా కనిపిస్తారు !

0

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు హస్తం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల ‘వారసత్వ పన్ను’పై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన.. అది సద్దుమణగక ముందే కొత్త దుమారానికి తెరలేపారు. భారత్‌ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలికలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన జాతి వివక్షకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. 

ఇంటర్వ్యూలో

కోల్‌కతాకు చెందిన ‘ద స్టేట్స్‌ మెన్‌’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శామ్‌ పిట్రోడా భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి ఆయన మాట్లాడారు. ‘‘లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మన దేశమే ఉత్తమ నిదర్శనం. మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమ వాసులు అరబ్బులుగా కన్పిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. మనమంతా సోదరసోదరీమణులమే. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లో పాతుకుపోయాయి’’ అని అన్నారు. పిట్రోడా కామెంట్స్‌ను మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరెన్‌ సింగ్‌, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతోపాటు బీజేపీ నేతలు తప్పుబట్టారు. ‘శామ్‌ భాయ్‌.. నేను దేశంలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన వాడిని. నేను భారతీయుడిలా కనిపిస్తా. మేం చూసేందుకు భిన్నంగా కనిపించొచ్చు.. కానీ మేమంతా ఒక్కటే. దేశం గురించి కనీసం కొంచెమైనా అర్థం చేసుకో’ అంటూ హిమంత బిశ్వ శర్మ ‘ఎక్స్‌’లో కామెంట్‌ పోస్ట్‌ చేశారు.

విరుచుకుపడిన కంగనా రనౌత్‌

మరోవైపు పిట్రోడాపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మండి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ విరుచుకుపడిరది. ఆయన వ్యాఖ్యలు జాతి విద్వేష, దేశ ప్రజలను విభజించేలా ఉన్నాయని విమర్శించింది. ‘రాహుల్‌ గాంధీ మెంటర్‌ శామ్‌ పిట్రోడా. భారతీయుల గురించి ఆయన చేసిన జాతి విద్వేష, విభజన వ్యాఖ్యలను వినండి. వారి (కాంగ్రెస్‌ నేతలు) సిద్ధాంతమే దేశాన్ని విభజించి పాలించడం. సాటి భారతీయులను చైనీయులుగా, ఆఫ్రికన్లుగా అభివర్ణించడం దారుణం. ఇది సిగ్గుచేటు’’ అని మండిపడ్డారు అని కంగనా రనౌత్‌ ‘ఎక్స్‌’లో విమర్శించింది.

స్పందించిన  కాంగ్రెస్‌

ఈ వివాదంపై కాంగ్రెస్‌ స్పందించింది. ‘‘పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యల నుంచి కాంగ్రెస్‌ పూర్తిగా దూరంగా ఉంటుంది’’ అని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. ఇటీవల పిట్రోడా వారసత్వ పన్ను గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అదొక ఆసక్తికరమైన అంశం. ఇది న్యాయంగానే ఉంది’’ అని అన్నారు. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో కాంగ్రెస్‌ స్పందించింది. అదంతా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !