ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడిరది. ఆయనపై వేటు వేస్తూ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయన అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున గెలిచిన జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. దీంతో, ఆయనపై శాసనమండలి ఛైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపి, కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఈ క్రమంలో విచారణ జరిపిన మండలి ఛైర్మన్... చివరకు కృష్ణమూర్తిపై వేటు వేశారు. 1999, 2009లో పల్నాడు జిల్లా గురజాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కృష్ణమూర్తి గెలిచారు. అనంతరం వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీలో ఉన్న సమయంలో విప్ గా కూడా పని చేశారు. ఎన్నికల ముందు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీని వీడక ముందే ఆయనను విప్ పదవి నుంచి తొలగించడం గమనార్హం.
కక్షపూరిత చర్య !
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెలుగుదేశం పార్టీ నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారన్నారు. దీన్ని వెనుకబడిన వర్గాలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఎమ్మెల్సీ పదవి నాకు వ్యక్తిగతంగా కాదు.. నా బీసీ వర్గాలకు ఇచ్చింది. మండలి ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి అనర్హత వేటు వేయించారు. బీసీ నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం వైసీపీ చేసింది. ఆ పార్టీలో బీసీలను వాడుకొని వదిలేస్తారు’’ అని వ్యాఖ్యానించారు.