సికింద్రాబాద్‌ విధ్వంసరచన వెనుక ‘వ్యూహకర్తలు' ఎవరు ?

0

‘అగ్నిపథ్‌’పై ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు ! ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని ప్రవేశ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో అగ్రహోదగ్దులయ్యారు ! పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పలు రైళ్లను టార్గెట్‌ చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన యువకుడు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సికింద్రాబాద్‌ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి.

అసలు నేపథ్యం !

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా తెలంగాణలోని కరీంనగర్‌లో 2019లో, 2021లో హకీంపేట్‌లో ఆర్మీ ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఆయా ర్యాలీలకు హాజరయ్యారు. వారిలో 3500 మంది ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించారు. మెడికల్‌ పరీక్షలు పూర్తి చేసుకున్నారు. కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (సీఈఈ) కోసం తమ జిల్లాల పరిధిలోని కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్ళ నుండి ప్రభుత్వం సీఈఈ నిర్వహించట్లేదని వారంతా ఆందోళన చెందుతున్న వేళ కేంద్రం ఉన్నట్టుండి ‘అగ్నిపథ్‌’ పథకాన్ని ప్రకటించడంతో వారంతా ఆగ్రహంతో ఉడికిపోయారు. కేంద్ర ప్రభుత్వానికి తమ వాణి వినిపించాలంటే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిరసన తెలపడమే ఏకైక మార్గమని వారు నిర్ణయించుకున్నారు. 

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నిరసన కాండను నిర్వహించాలని ముందుగానే ప్రణాళిక రచించుకున్న ఆర్మీ అభ్యర్థులు ఆ దిశగా పకడ్బందీగా ముందుకుసాగారు. ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మేసేజ్‌లతో సమయం, వేదికను నిర్ణయించుకున్నారు.  దీంతో మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, సిద్ధిపేట్‌, కరీంనగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, తదితర జిల్లాల్లోని అకాడమీల్లో చదువుతున్న వందలాది మంది యువకులు గురువారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనుకున్న సమయానికి స్టేషన్‌కు చేరుకుని నిరసనలతో మొదలు పెట్టి ఆగ్రహంతో రగిలిపోయి విధ్వంసానికి పాల్పడ్డారు. అనుకోని ఈ చర్యలతో ప్రయాణీకులు భీతిల్లారు. అగ్నికీలలు ఎగిసిపడుతున్న వేళ ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు.. ఆర్పీఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ సిబ్బంది, స్పెషల్‌ఫోర్స్‌తోపాటు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు ప్రయత్నించారు. అయితే, వారు పట్టాలపై కూర్చుని భీతావహ వాతావరణం సృష్టించడమే కాక.. పట్టాలపై ఉన్న రాళ్లతో వారిపై దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఉదయం 11 గంటల సమయంలో రైల్వే డీజీ సందీప్‌ శాండిల్య ఆదేశాల మేరకు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఎస్‌ఎల్‌ఆర్‌లతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేశ్‌ (22) ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. మరో ఇద్దరికి తలకు, ఇంకొకరి వీపు భాగంలో తూటాలు తగిలాయి.  గాయపడిన పలువురు యువకులను గాంధీకి తరలించారు. వారిలో ఒక ఆందోళనకారుడికి వెన్నెముక విరిగింది.  


‘అగ్నిపథ్‌’ ఆందోళనకారుల విధ్వంసం విషయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌, ఠాణాల స్థాయిలో స్పెషల్‌ బ్రాంచ్‌ పూర్తిగా విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆందోళనకారులు పకడ్బందీగా రెండు రోజులుగా వాట్సాప్‌ గ్రూపుల్లో చాటింగ్‌ చేసుకుంటున్నా.. అధునాతన టెక్నాలజీతో నిషేధిత ‘కీవర్డ్స్‌’ను కనుగొనే అవకాశాలున్నా.. నిఘావర్గాలు ఆ దిశలో దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విధ్వంసానికి ప్రధాన వ్యూహకర్తగా భావిస్తూ సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆర్మీ అభ్యర్థులే కాకుండా ఇతర సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఈ విధ్వంస రచనలో పాల్గొన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !