అలనాటి అమరావతి ప్రభువు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయడు

0



అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన జమిందారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయడు 1761లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జగ్గన్న, అచ్చమాంబ. వేంకటాద్రి నాయడుకి మూడేళ్ళ వయసులోనే ఆయన తల్లిదండ్రులు మరణించారు.వేంకటాద్రి నాయడి తండ్రి జగ్గన్న వాసిరెడ్డి సంస్థానానికి జమిందారు అయ్యాకా సంస్థానం క్రమంగా విస్తరించింది. ఆయన కొన్ని సంస్థానాల మీద పోరాడి వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

అప్పట్లో కృష్ణా, గుంటూరు జిల్లాలలో అనేక సంస్థానాలున్నా వాసిరెడ్డివారి సంస్థానమే కృష్ణానదికి ఇరువైపులా విస్తరించి అత్యధిక గ్రామాలు కలిగిన సంస్థానంగా ఉండేది. జగ్గన్న ఇలా బలపడటం చూసి అసూయ చెందిన ఇతర జమిందార్లు ఆయన మీద లేనిపోని నిందలు మోపి రెండవ నిజాం తమ్ముడైన బసాలత్ జంగ్‌లో జగ్గన్న మీద అకారణ ద్వేషం రగిల్చారు. బసాలత్ జంగ్ జగ్గన్నని సమావేశం నెపంతో పిలిపించుకుని హత్య చేయించాడు. ఈ వార్త తెలిసే సమయానికి ఆయన భార్య అచ్చమాంబ కంసాలి చేసి తెచ్చిన బంగారు పూసలపేరుని చేతిలో పట్టుకుని పరీక్షిస్తున్నారు. వార్త తెలియగానే ఆమె చేతిలోని దండని విసిరేసి భర్తతో సహగమనం చేయడానికి నిర్ణయించుకుంది. ఆమె గౌరవార్ధం వాసిరెడ్డి వంశీయులు ఇప్పటికీ బంగారు పూసలపేరుని ధరించరుట.

మూడేండ్ల పిల్లవాడైన వేంకటాద్రి నాయడిని జగ్గయ్యగారి అన్నగారైన రామన్న దగ్గరపెట్టుకుని తన జమీ(భూమి)తో పాటు తమ్ముడి జమీని కూడా 'వేంకటాద్రి నాయడి జమీ' అనే పేరుతో పాలించాడు.

తన తమ్ముడిని చంపిన బసాలత్ జంగ్ తన మీద కూడా ఆగ్రహించడంతో రామన్న 1771లో చింతపల్లిని విడిచి నందిగామకి మారవలసి వచ్చింది(అంటే ఆ రోజుల్లో నవాబులకి జమిందారులు ఎంత భయపడేవారో తెలుస్తుంది). బ్రిటీష్ సైనికులతో పోరాడి ఓడిపోయి తనని శరణు వేడిన మైలవరం జమిందారుకి రామన్న ఆశ్రయం ఇవ్వడంతో నందిగామకి చేరినా అతడికి కష్టాలు తప్పలేదు. మైలవరం జమిందారుని తమకి అప్పగించకపోతే నందిగామ మీదకి దండెత్తి వస్తామని కంపెనీవారు హెచ్చరించడంతో శరణు కోరిన మితృడిని రామన్న వెళ్ళిపోమ్మని చెప్పవలసి వచ్చింది.

ఒక ప్రక్క బసాలత్ జంగ్, ఇంకొక ప్రక్క కంపెనీవారు. వీరిద్దరికీ భయపడుతూ రామన్న పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. 1775లో వారిద్దరినీ మచ్చిక చేసుకుని రామన్న వేంకటాద్రి నాయడిని వెంటపెట్టుకుని చింతపల్లికి తిరిగివచ్చాడు. పధ్నాలుగేళ్ళు వచ్చేసరికల్లా వేంకటాద్రి నాయడు అప్పటి సంప్రదాయానికి అనుగుణంగా ఉండే చదువుని పూర్తిచేసి విలువిద్య, కత్తియుద్ధం మొదలైన యుద్ధవిద్యలలో కూడా రాటుదేలాడు. చందర్లపాడు జమిందారు కుమార్తె వెర్రెమాంబ(వెర్రెమ్మ) అద్భుత సౌందర్యరాశి అని విన్న వేంకటాద్రి నాయడు ఆమె చిత్తరువు తెప్పించుకుని చూసి ఆమెని చేపట్టాలని నిశ్చయించుకుని తన ఉద్దేశాన్ని ఆమె తండ్రికి తెలియజేసాడు. ఈడూ జోడూ కుదరడంతో 1779లో వేంకటాద్రి నాయడు వెర్రెమ్మని వివాహం చేసుకున్నాడు.

కొన్నాళ్ళకి పెదనాన్న పాలనా పద్ధతులు నచ్చక పెదనాన్నంటే వైముఖ్యం ఏర్పడినా వేంకటాద్రి నాయడెప్పుడూ తన వాటా పంచిమ్మని మాత్రం అడగలేదు. 1778లో పెత్తండ్రి మరణంతో తన వాటాతోపాటు పెత్తండ్రి వాటాని కూడా వేంకటాద్రి నాయడు పాలించవలసి వచ్చింది. జమీని వేంకటాద్రి నాయుడొక్కడే పరిపాలిస్తున్నాడని వివిధ కారణాల వల్ల తమకి వారసత్వపు హక్కు లేకపోయినా అసూయపడ్డ దాయాదులని(పినతండ్రి, పెత్తండ్రి కొడుకులని) వేంకటాద్రి నాయడు చింతపల్లి కోటలో బంధించాడు. తన సంస్థానాన్ని కాపాడుకోవడానికి దగ్గరి బంధువులని బంధించినప్పటికీ ఆయన వారినెవరినీ ద్వేషించినట్లు అనిపించదు. ఎందుకంటే తాను నిర్బంధించినవారి పిల్లలని ఆయన కొంతకాలం తరువాత దత్తత తీసుకున్నాడు. చాలామంది బంధువులని చేరదీసాడు కూడా.

కంపెనీ వారి ప్రమేయముతో నాయడు 1794లో వీరిద్దరినీ విడుదల చేసి కంపెనీ వారు ఆదేశించినట్లు వారిద్దరికీ జీవనభృతి కూడా ఇచ్చాడు. కంపెనీవారికి జమిందారులెవరూ బలపడటం ఇష్టంలేదు. వారి 'విభజించు-పాలించు' సూత్రంలో భాగంగా వాసిరెడ్డి వంశీయుడైన లక్ష్మీపతిని వాసిరెడ్డి సంస్థానం మీద నిఘాకి నియోగించారు. ఈ విషయం యువకుడైన వేంకటాద్రి నాయడికి తెలియడంతో ముక్త్యాల కోటమీద దాడి చేసి నేలమట్టం చేసాడు. ఈ విషయం కంపెనీ వారికి తెలిసినా ఆనాటి దేశ, కాలమాన పరిస్థితులు వేంకటాద్రి నాయడికి అనుకూలంగా ఉండటంతో అతడి మీద చర్య తీసుకోలేదు.

క్రమంగా వేంకటాద్రి నాయడి ఆధ్వర్యంలోని వాసిరెడ్డి సంస్థానం బలపడసాగింది. ఎవరైనా సంస్థానాధీశులు ఎదుగుతుంటే చూసి ఇరుగుపొరుగు ఓరవలేకపోవడం సహజమే కానీ ఇక్కడ నిజాం తమ్ముడైన బసాలత్ జంగ్(ఫ్రెంచ్ సైనికుల అండదండలున్న ముర్తుజానగర్ పాలకుడు) తనకి జమిందారులందరూ లోబడి ఉండవలసినదేనని, వేంకటాద్రి నాయడు తనని లెక్కచేయని పరిస్థితి రాకూడదని భావించి వాసిరెడ్డి సంస్థానం మీద ఓ కన్ను వేసి ఉంచాడు.

1783లో బసాలత్ జంగ్ మరణంతో వేంకటాద్రి నాయడికి శతృవులు లేకుండా పోయారు. జంగ్ మరణించడంతో అతడి పాలనలో ఉన్న ముర్తుజానగర్(కొండవీడు) కంపెని పాలనలోకి వచ్చింది. రెండవ నిజాం గుంటూరు, కృష్ణా జమిందారుల మీద దృష్టి పెట్టకపోవడం, బ్రిటీష్, ఫ్రెంచివారు ఇక్కడ ఆధిపత్యం కోసం పొటీపడటంతో అది వేంకటాద్రి నాయడికి అనుకూలమై అతడు బలపడటానికి దోహదపడింది.

మొదట కుటుంబంలోని శతృవులని కట్టడి చేసిన వేంకటాద్రి నాయడు బయటినుండి శతృవులు రాకుండా కూడా చూసుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో వ్యాపార నిమిత్తమై వచ్చి స్థానిక పాలకుల మధ్య అనైక్యతని, ఇతర బలహీనతలని కనిపెట్టి భారతీయులని దెబ్బకొట్టడానికి కాచుక్కూర్చున్న బ్రిటీష్, ఫ్రెంచివారొకవైపు, దేశం మొత్తం మీద తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని చూస్తున్న మొఘలులు(నిజం చెప్పాలంటే అప్పటికి మొఘలులు కష్టదశలో ఉన్నారు) ఇంకొకవైపు ఉండటంతో ఏ మూల నుండి ఏ ముప్పు వస్తుందో తెలియని స్థితి.

వీరే కాకుండా మొఘలులకి వ్యతిరేకంగా పోరాడుతూ దాడులు చేస్తున్న మరాటీలు, సైన్యం అండదండలతో చిన్న చిన్న రాజ్యాలని ఏర్పరచుకున్న ఇతర సంస్థానాధీశులు కూడా ఎప్పుడు అవకాశం దొరికినా దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉండేవారు. ఇంతమందిని గమనిస్తూ తన రాజ్యాన్ని నిలుపుకుని ప్రజలకి మేలుచేయాలని తపించినవాడు వేంకటాద్రి నాయడు.

గుళ్ళల్లో విద్వంసకాండ జరిగి దేవుడికే భద్రత లేకపోతే ఎలా అని ప్రజలలో అభద్రత వ్యాపించిన కాలమది.

ఇలాంటి పరిస్థితులలో వాసిరెడ్డి సంస్థానాధీశుడైన వేంకటాద్రి నాయడు జనరంజకంగా పాలించాడని చరిత్రకారులు చెప్తారు.

సాహిత్య కళాపోషణ

పాలనలో, దానధర్మాలలో అన్నిటా రాయలని ఆదర్శంగా తీసుకున్న వేంకటాద్రి నాయడు తన ఆస్థానంలో కూడా ఎనమండుగురు కవులని నియమించాడు. ఆయన ఆస్థాన కవులలో దేవీభాగవతాన్ని మొట్టమొదట ఆంధ్రీకరించిన ములుగు పాపయారాధ్యుడు అత్యంత ప్రసిద్ధుడు. ఆయన తన గ్రంథాలలో దేనినీ నరులకి అంకితం చేయలేదు.

స్వయంగా కవి కాకపోయినా సాహిత్యం పట్ల వేంకటాద్రి నాయడికి అభిరుచు మెండు. ఆయన సాహిత్యగోష్టి జరిపేటప్పుడు స్వయంగా సమస్యలు ఇచ్చి పూరించమనేవాడుట. ఆయనకి తెలుగుతో పాటు ఉర్దూ, ఇంకో రెండు మూడు భాషలు కూడా వచ్చు. ఇంగ్లీషునుండి తెలుగులోకి అనువాదం చెయ్యడానికి దుబాసీని నియమించుకున్న దాఖలాలు లేవు కాబట్టి నాయడికి ఇంగ్లీషు కూడా వచ్చని తెలుస్తోంది. ఛందోబద్ధమైన పద్యాలు చెప్పగలిగే నైపుణ్యం కూడా ఉండేది.

వేంకటాద్రి నాయడు కవులని ఎంతగా ఆదరించేవాడంటే, ఒకసారి ఆయన తన మితృలైన ఇతర సంస్థానాధీశులతో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ప్రసంగవశాత్తూ తాము మరణించినప్పుడు లోకం ఏమనుకుంటుందో అనే ఆలోచన వచ్చింది. నాయడు మరణిస్తే పండితులు, కవులు అందరూ దుఃఖిస్తారని ఆయన మితృడు చెప్పాడని నాయుడి ఆస్థాక కవి ములుగు పాపయారాధ్యులు ఆంధ్రీకరించిన దేవీభాగవతానికి ఉపోద్ఘాతం వ్రాస్తూ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తెలియజేసారు.

తన ఉద్యానవనానికి నందనవనం, ఏనుగుకి ఐరావతం అని పేరు పెట్టిన నాయడు తన సభకి మాత్రం సుధర్మ(ఇంద్రుడి సభ పేరు) మాత్రం పెట్టలేదు. గొప్ప పండితులు, కవులు సభలో ఉండగా తాను దేవేంద్రుడిలా సింహాసనం మీద కూర్చుంటే దర్పం చూపినట్లవుతుందని, పండితులు, కవుల మీద గౌరవంతో నాయడు తన సభకి సుధర్మ అనే పేరుంచలేదు కానీ నాయడి నివాస భవనానికి ఎదురుగా ఉండే భవనాన్ని విద్యాభవనం అని పిలిచేవారని జనుల నోటిమాట.

నాయడి కీర్తిని కీర్తించే పద్యాలు అనేకం ఉన్నాయి. ఆస్థానంలో కవులు కాకపోయినా తనని దర్శించి, అర్థించిన కవులని సత్కరించడం ఆయన నైజం.

పేదరికంతో బాధపడుతున్న ఒక కవి నాయడిని దర్శించాలని అమరావతికి వస్తుండగా నాయడు మరణించాడన్న వార్త తెలియగానే ఆ కవి బ్రహ్మని ఇలా తిట్టిపోసాడు

రాజ్య విస్తరణ

నాయడు పట్టాభిషిక్తుడయ్యే సమయానికి దేశంలో అరాజకం నెలకొనివుంది. మొఘలులు దేశాన్నంతటినీ ఒకే గొడుగు క్రిందకి తెచ్చి పాలించారన్న మాటే కానీ శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. తెలుగునాడులో అసఫ్జాహీ వంశం వారు ఇంకా బలపడకపోవడంతో వారిని ఫ్రెంచివారు, బ్రిటీషువారు దెబ్బకొట్టాలని చూస్తుండేవారు. మరోవైపు టిప్పుసుల్తాన్ నుండి దాడి భయం ఉండేది.

నాయడు అధికారంలోకి వచ్చాకా తనకి వారసత్వంగా లభించిన ప్రాంతాలనే కాకుండా అప్పు చెల్లించలేకపోయిన ఇతర సంస్థానాలనుండి కొన్ని గ్రామాలని తీసుకోవడంతో వాసిరెడ్డి సంస్థానం కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని దాదాపు ఐదువందల గ్రామాలవరకూ విస్తరించింది.

నాయడికి అదృష్టం కలిసి రావడంతో వినుకొండ జమిందారు మల్రాజు వేంకట నరసింహారావు(ఇతడి పేరు మీదే నరసరావుపేట ఏర్పడింది)కుటుంబానికి చెందిన వినుకొండ, బెల్లంకొండ పరగణాల బాధ్యతని కూడా కంపెనీ అతడికే అప్పగించింది.

నాయడు మరణించేనాటికి అతడి ఏలుబడిలో 551 గ్రామాలుండేవి.

1783 సంవత్సరంలో పట్టాభిషేకం చేసుకున్న నాయడు చింతపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభించాడు. మనసున్న మారాజు అని తొలినాళ్లలోనే ప్రజలలో ఆయనకి పేరు వచ్చింది కానీ ఇంగ్లీష్ వారు మాత్రం ఆయనను చండశాసనుడు అని ప్రచారం చేసారు. కొందరు చరిత్రకారులు దానినే నమ్మారు. కానీ ఆయన ప్రజలను పీడించిన దృష్టాంతాలను మాత్రం ఏ చరిత్రకారుడూ వ్రాయలేదు. ఆయన మరణించిన చాలా కాలం తరువాత కూడా ప్రజలు మా మంచి మహారాజు అని చెప్పుకోవడానికి ఆయన చేసిన పనులే కారణం.

కొందరు జమీందార్లు ఆ కాలంలో ప్రజలని పన్నుల కోసం పీడించేవారు కానీ నాయడు మాత్రం తన ప్రజలని ఎంతో దయతో చూసాడు. కంపెనీవారు శిస్తులని పెంచినప్పుడల్లా ప్రజలకి భారమవుతుందని ఆయన కంపెనీవారితో పేచీపెట్టుకునేవాడు.

చెల్లించాల్సిన పన్నుని విపరీతంగా పెంచిన కంపెనీవారు ఆ నింద జమిందారుల మీదకి నెట్టేసేవారు. కొందరు జమిందార్లు భోగలాలసులై తమ ఇళ్ళల్లో జరిగిన శుభకార్యాల ఖర్చుని ప్రజల నెత్తి మీద రుద్దేవారు కానీ నాయడు అలా చేసిన దాఖలాలేమీ లేవు.

మొదట్లో జమిందారుల మనుషులు ప్రజలనుండి శిస్తు వసూలు చేసేవారు కానీ ఆ తరువాత క్రొత్త విధానాలని ప్రవేశపెట్టి కంపెనీవారు శిస్తుని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

నాయడు కంపెనీ తరపున వసూలు చేయవలసిన శిస్తులో రైతు పక్షం వహించి ప్రజలలో మంచిపేరు తెచ్చుకున్నాడు కానీ కంపెనీవారి ఆగ్రహానికి గురయ్యాడు.

నాయడు పట్టాభిషిక్తుడయ్యాకా 1791లో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రజలు శిస్తు కట్టే పరిస్థితిలో లేకపోవడంతో చాలామంది జమిందారులు కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలని చెల్లించలేకపోయారు. ధాన్యానికి కరువు ఏర్పడటంతో కొందరు దోపిడీలకి పాల్పడ్డారు. నాయడి మీద ఆగ్రహంతో ఉన్న కంపెనీవారు నాయడు కంపెనీకి చెల్లించాల్సిన సొమ్ముని చెల్లించలేదని ఆక్షేపించడమే కాకుండా కొన్ని గ్రామాలని అతడే దోపిడీ చేయించాడనే అభియోగం మోపారు.

దొంగలనుండి, దోపిడీదార్లనుండీ తన రాజ్యంలోని ప్రజలకి నాయడు రక్షణ కల్పించాడు.

ఖమ్మం మెట్టు, మధిర మొదట వాసిరెడ్డి సంస్థానంలో లేకపోయినా దొంగల ఆట కట్టించినందుకు నిజాం ప్రభువు నాయడికి మన్నెసుల్తాన్ అనే బిరుదునిచ్చి తన ఏలుబడిలోని ఆ జమీలని నాయడికి కానుకగా ఇచ్చాడు.

కొంతకాలం తరువాత ఆయన అధికారాన్ని కంపెనీవారు మోసపూరితంగా కుదించడంతో ఆ తరువాత ప్రజలకి తగిన రక్షణ ఇవ్వలేకపోయాడు.

ఆలయాల మీద దాడి జరిగి దేవుడికే భద్రత లేకపోతే ఎలాగని భయాందోళనలో ఉన్న ప్రజలకి నాయడు తన చర్యల ద్వారా భరోసా కల్పించాడు. అవసరమైన దేవాలయాలకి ఇనాములిచ్చి, జీర్ణోద్ధరణ చేసాడు. పండుగలప్పుడు జరగవలసిన ఉత్సవాలని పునరుద్ధరించి అందుకు అవసరమైన ధనాన్ని ఇచ్చాడు.

అవసరార్థులైన వారికి విరివిగా ధనాన్ని దానం చేసాడు. దాతృత్వం వాసిరెడ్డి వంశంలో తరతరాలుగా ఉన్నదే. నాయడి పూర్వీకుడైన చిన పద్మనాభుడనే రాజు ఏర్పాటు చేసిన విందులలో నేయి ధారలు కట్టేదిట. అందుకని ఆయనని అందరూ నేతి పద్మనాభుడని పిలిచేవారు. అమరావతి ఆలయ ప్రాంతంలోని చాలా శాసనాలలో వాసిరెడ్డి వంశీయులు ఇచ్చిన దాన వివరాలున్నాయి.

నాయడు జీవిత కాలంలో దేశ రాజకీయవ్యవస్థలో మార్పులతో పాటు పరిపాలనలో కూడా మార్పులు వచ్చాయి. ఆయన పాలన ప్రారంభమైన తొలి రోజుల్లో ఒకవైపు కంపెనీ ,మరొకవైపు నిజాం నవాబు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుండేవారు కానీ వారిలో ఏ ఒక్కరికీ సంపూర్ణ అధికారాన్ని చెలాయించే పరిస్థితి లేకపోవడం వల్లనే నాయడు కొన్ని సంవత్సరాలపాటు తన ఆధిక్యాన్ని నిలుపుకోగలిగాడు.

పన్నుల వసూళ్లు, నేరాలను అదుపు చేయడం నాయడి ప్రభుత్వం వంతు అయింది. క్రమంగా కంపెనీ బలపడి హైదరాబాదులోని నిజాం నవాబుగానీ, ఢిల్లీలోని చక్రవర్తిగానీ తన అధికారాన్ని చూపించలేకపోయారు.

కంపెనీ బలపడటం ఒక్కసారిగా జరగలేదు. పరిపాలన యావత్తూ తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి కంపెనీవారికి చాలా సంవత్సరాలు పట్టింది. అందువల్ల నాయడు పట్టాభిషిక్తుడయ్యాకా కొన్ని సంవత్సరాల పాటు తనకి ధర్మం, న్యాయం అనిపిస్తే దానిని అమలు చేయగలిగాడు కానీ క్రమంగా కంపెనీ నియమించిన అధికారులదే పై చేయి అయ్యింది.

నాయడికి పాలనలో సహాయపడటానికి నమ్మకస్తుడు, సమర్థుడైన పొత్తూరి కాళిదాసు అనే వ్యక్తి మంత్రిగా లభించాడు. వీరిద్దరి మధ్యా చిన్ననాటినుండీ మంచి అనుబంధం ఉండేది.

నాయడు అందరినీ సమానంగా ఆదరించేవాడనడానికి ఋజువు, ఆయన సేనానులలో ఒకరైన భుజంగరావు నిమ్నవర్గానికి చెందినవాడు. ఆయన నియమించిన అధికారులందరూ విధేయులై పనిజేయడంతో నాయడు సుపరిపాలన అందించగలిగాడు.

నాయడికి పరిపాలనలో తోడ్పాటు అందించేందుకు పెద్ద సైన్యం, సిబ్బంది ఉండేవారు. అప్పట్లో స్థానిక పాలకులలో అందరికంటే ఎక్కువ సైన్యం కలిగిన నాయడిని బలహీనపరచాలనుకున్న కంపెనీ అధికారులు అతడి సాయుధ సిబ్బందిని తగించాలని నిర్ణయించుకున్నారు.

కంపెనీ అవలంబించిన క్రొత్త విధానం వల్ల జమిందారులు తమ సొంత సైన్యాలని పెట్టుకోకూడదనే చట్టాన్ని అమలులోకి తెచ్చింది. జమిందారులకి సైన్యపు ఖర్చులు తగ్గితే వారు తమకి చెల్లించాల్సిన శిస్తుని సులభంగా చెల్లిస్తారని కంపెనీ బయటకి చెప్పినా అందులో మరొక కోణం కూడా దాగివుంది. జమిందారులని మొదట సైనికపరంగా బలహీనపరిచి ఆ తరువాత వారిని లొంగదీసుకోవడమే వారి అసలైన వ్యూహం.

కంపెనీవారు ఒక కొత్త తరహా న్యాయ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసారు.

స్మాల్ కాజెస్ అదాలత్, క్రిమినల్ కోర్ట్, సివిల్ కోర్ట్ మొదలైనవి ఏర్పడ్డాయి. వీటన్నింటికీ పైన ఇంగ్లాడులో ప్రివీ కౌన్సిల్ ఉండేది. జమిందారుగా ఎన్నో వివాదాలలో ఎందరికో న్యాయం చెప్పిన నాయడి మీద సివిల్ కోర్టులో దావా పడటం, కోర్టు తీర్పుని అమలు చేయవలసి రావడం ఆయనకి అనుభవమైంది.

క్రొత్తగా ఏర్పడ్డ సివిల్ కోర్టులో నాయడి దాయాది కేసు వేయడంతో దాని పూర్వాపరాలు విచారించిన కోర్టు నాయడి పాలనలోని చింతలపాడుని అతడి దాయాది చంద్రమౌళికి ఇవ్వవలసిందిగా ఉత్తర్వులిచ్చింది. కంపెనీ ఈ విధమైన న్యాయస్థానాలని ఏర్పాటు చేయడం వల్ల జమిందారులు, వారి ప్రతినిధులు తీర్పులు చెప్పడమనే వ్యవస్థ పోయింది. జమిందారుల సైనిక బలగాన్ని కంపెనీ తగ్గించేయడంతో వారు తమలో తాము కలహించుకుని కోర్టు మెట్లెక్కడం వారి స్థాయిని తగ్గించింది.

1783లో జంగ్ మరణించినప్పుడు అతడి హయాంలో అధికారం చెలాయించిన అక్రంఖాన్, సైఫ్ నాయుడిని పట్టి బంధించాలని ప్రయత్నించారు. నాయడి దగ్గర తగిన బలగం లేదని గమనించిన సైఫ్ నాయుడి రాజ్యంలో అనేక ఆకృత్యా లు చేసాడు. తనకి తగిన సాయుధ బలగం లేకపోవడంతో ప్రజలకి రక్షణ ఇవ్వడానికి నాయడు కంపెనీవారి సహాయాన్ని కోరక తప్పని పరిస్థితి. నాయడిని తమకి అప్పగించమని సైఫ్ అధికారులని కోరాడు కానీ అప్పటికే సైఫ్ చేసిన దురాగతాల గురించి నాయడు ఫిర్యాదు చేయడంతో కంపెనీ వారు నాయడిని అప్పగించడానికి నిరాకరించి ప్రజలపై దాడులని ఆపాలని సైఫ్ పై అధికారి అయిన అక్రంఖాన్‌కి కబురుపెట్టడంతో సైఫ్ వెనక్కి తగ్గాడు. అప్పట్లో ఒక జమిందారీలోని సాయుధభటులు మరొక జమిందారీలోకి ప్రవేశించకూడదనే ఒప్పందం ఉండేది. ఇలాంటి ఒప్పందాన్ని ముచ్చలికలు అని పిలిచేవారు.

అటునుండి నరుక్కురా!

ఈ నానుడి నాయడి కాలంలోనే పుట్టింది.

మన దేశంలో కంపెనీ క్రమంగా బలపడటంతో సంస్థానాలన్నీ కంపెన్నీ చెప్పుచేతల్లో ఉండాల్సిన పరిస్థితిలో చాలా చోట్ల అశాంతి, అభద్రత నెలకొన్నాయి. కరువుకాటకాల వల్ల దొంగతనాలు, దోపిడీలు ఎక్కువవ్వడంతో కంపెనీ సైనికులు కొందరు దొంగలని పట్టుకున్నారు, కొన్ని చోట్ల పరిస్థితిని అదుపులోకి తేగలిగారు, మరికొన్ని చోట్ల సాధ్యం కాక వదిలేసారు. గజదొంగలని పట్టుకోవడం కంపెనీ సైనికులకి సాధ్యం కాలేదు.

కంపెనీ తన సాయుధ బలగాన్ని తగ్గించినా తనకున్న సైన్యంతోనే నాయుడు ప్రజలకి శాంతిభద్రతలు కల్పించడానికి ప్రయత్నించాడు. తనకి సాయుధ బలగం విరివిగా ఉన్నప్పుడు నాయడు తానే విచారణ చేసి శిక్షలు విధించేవాడు. కంపెనీ ప్రాబల్యం బాగా పెరిగాకా దొంగని పట్టుకోవాలన్నా కంపెనీ అధికారుల అనుమతి అవసరమైంది.

నాయడి దగ్గర సైనిక బలగం విరివిగా ఉన్నప్పుడు అడవులనుండి వచ్చిన దొంగల ముఠా పెడుతున్న బాధలు పడలేక ప్రజలు వచ్చి నాయడితో మొరపెట్టుకున్నారు. అడవుల్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం కష్టం కనుక మంచిమాటలతో వారిని తన దగ్గరకి పిలిపించిన నాయడు వాళ్ళ తలలు నరకమని ఆదేశించాడు. అలా తలలు నరకబడ్డ దొంగల సంఖ్య వందకి పైనే ఉంటుందని చరిత్ర కారుల అంచనా.

తలారులు తల నరకడం మొదలుపెట్టబోతుండగా మొదటి వరుసలో ఉన్న దొంగలు అటునుండి నరుక్కురమ్మన్నారుట(కొంతమందిని శిక్షించాకా అయినా ప్రభువికి జాలి కలగకపోతుందా అనే ఉద్దేశంతో).

వారిని మంచి మాటలతో పిలిపించి శిక్షించడం మోసం, ధర్మవిరుద్ధమే అయినా ప్రజలకోసం నాయడు ఇలా ప్రవర్తించాడనుకోవాలి.

ఈ విషయంలోనే రెండు కథలు జనపదుల నోళ్ళల్లో నానుతూ ఉంటాయి.

శిక్ష పడ్డ దొంగల భార్యల శాపం తగిలి నాయుడు భోజనానికి కూర్చోగానే అతడికి సహించేది కాదని చెప్పుకునేవారు.

ఇంకొకటేమో దొంగల తలల మీద తాయత్తులుండటం వల్ల తలారులు, ప్రభువు కూడా వారి తలలు నరకలేకపోయారనీ, తుదకి వారు పెట్టే బాధలు భరించలేక వారే తాయత్తు రహస్యం తలారులకి చెప్పారని ప్రచారంలో ఉన్న కథ.

ఆ తరువాత నాయడు పాపానాయక్ అనే గజదొంగని తన భటుల సహయమతో పట్టుకున్నాడని కంపెనీ తరపున ఇక్కడ పనిచేసిన ఒక మేజర్ వ్రాసిన లేఖల ద్వారా స్పష్టమవుతోంది.

అంతకుముందు సంవత్సరం అంటే 1793లో నాయడు మశూచి నుండి కోలుకుని పాలన పట్ల శ్రద్ధ వహించడం మొదలుపెట్టడంతో అతడిని బలహీన పరచడానికి కంపెనీ అతడి బలగాన్ని తగ్గించివేసింది.

1794 తరువాత పిండారీల దండయాత్రలు ఎక్కువయ్యాయి. నాయడు తన శక్తిమేర ప్రజలని కాపాడగలిగాడు కానీ అప్పటికే సాయుధపరంగా బలహీనుడయ్యాడు.

కుటుంబ జీవితం

నాయడు, వెర్రెమాంబ దంపతులకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకి లక్ష్మమ్మ అని పేరు పెట్టారు. ఆమెని శాఖమూరు వెంకయ్యకిచ్చి వివాహం జరిపించారు. కానీ వివాహమైన కొద్ది కాలానికే ఆమె ప్రమాదశాత్తూ చింతపల్లి కోట మీదనుండి జారిపడి మరణించడంతో నాయడు దంపతులు చాలా వేదనకి గురయ్యారు.

1798లో నాయడు తన పినతండ్రి కొడుకైన చంద్రమౌళికి రెండవసారి కొడుకు పుట్టడంతో ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని జగన్నాథబాబు అని నామకరణం చేసాడు. 1803లో జగన్నాథబాబుకి నాయడు ఇద్దరమ్మాయిలతో వివాహం జరిపించాడు. విశేషమేమిటంటే కోడళ్ళు వచ్చాకా అంటే 1807వ సంవత్సరంలో తాను స్వయంగా పార్వతి అనే అమ్మాయిని పెళ్ళాడాడు. ఆమె వచ్చాకా పెత్తండ్రి కుమారుడికి రెండవసారి కొడుకు పుట్టినప్పుడు ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని రామనాథబాబు అని నామకరణం చేసాడు. అంటే నాయడు తన పెత్తండ్రి, పినతండ్రి మనవలని దత్తత తీసుకున్నాడు.

ఆలయాల పునరుద్ధరణ

చేబ్రోలులో చతుర్ముఖ బ్రహ్మ ఆలయాన్ని నాయడు నిర్మించాడు. ఆంధ్రదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం ఇదే. కానీ నాలుగు ముఖాలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నది మాత్రం శివలింగమే. ఆ ఊరికి చతుర్ముఖపురమని నాయడు పేరు పెట్టాడు.

అలాగే మంగళగిరి ఆలయానికి గాలిగోపురాన్ని నిర్మించాడు. ఈ గాలిగోపురానికి పదకొండు అంతస్థులుంటాయి.

నాయడు వైకుంఠపురమనే ఊరిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసాడు. అందుకే అప్పట్లో ప్రజలు అమరావతి అమరావతే, వైకుంఠం వైకుంఠమే అనుకునేవారు.

జీర్ణాలయాల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ధ్వజస్తంభాలని వేయించాడు, క్రొత్త విగ్రహాలని ప్రతిష్టింపజేసాడు, ధూప, దీప నైవేద్యాలకి ఆదాయం లేని దేవాలయాలకి వార్షికాదాయం వచ్చే భూవసతిని ఏర్పాటు చేసాడు.

పాలనలోనే కాకుండా నాయడు చాలా విషయాలలో రాయలని అనుసరించినట్లు తెలుస్తుంది. తిరుమలలో రాయలు తన భార్యలైన తిరుమలదేవి, చిన్నాదేవిలతో కూడిన విగ్రహాన్ని ఏర్పాటు చేసికున్నట్లే నాయడు కూడా అమరావతిలో, పొన్నూరులోని భావనారాయణస్వామి దేవాలయంలో (భార్యలతో కాకుండా) కేవలం తన విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు.

రాయలు అమరావతిలో తులాభారం తూగాడని శాసనాల ద్వారా తెలుసుకున్న నాయడు తాను కూడా మూడుసార్లు తులాభారం తూగి ఆ ధనాన్ని దానమిచ్చాడు. రాయలు చేయనిది, నాయడు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం మయూర వాహనోత్సవం. ఒక బంగారు నెమలిని చేయించి, దానిలో అధిరోహించి అమరావతిలో ఊరేగిన నాయడు తరువాత దానిని దానం చేసాడు.

అమరావతి

చింతపల్లికోట 250 గజాల పొడవు, 160 గజాల వెడల్పున్న స్థలంలో నిర్మించారు. కోటగోడ ఎత్తు 30 అడుగులు. అక్కడక్కడ బురుజులుండేవి. కోట మీద కొన్ని పనికిరాని ఫిరంగులు కూడా ఉండేవి. మందుగుండు సామాగ్రి పెట్టుకునే రాతికట్టడం కూడా ఉండేది. సొంత అంగరక్షకదళం కోసం ఒక చిన్న ఇల్లు కూడా నాయడు ఈ కోటలో కట్టించాడు. ఈ కోట విశాలమైనదే అయినప్పటికీ ఆయనకి, ఆయన పరివారానికే చాలేది కాదుట. ఈ పరిస్థితుల్లో కంపెనీవారి సైన్యం వచ్చి తిష్ట వేసింది.

నాయడిని బలహీనపరచాలనుకుని అతడి సాయుధబలగాన్ని తగ్గించిన కంపెనీవారు 1795లో రెండు పటాలాల సైన్యాన్ని అతడి చింతపల్లికోటలో దింపారు. అప్పటికే అసంతృప్తితో ఉన్న నాయుడు తన కోటలో అంతమంది సైనికులకి స్థలం లేదని, సైనికులని ఉపసంహరించుకోవాలని కంపెనీ అధికారులకి వ్రాసిన స్పందన లేదు. దానికి తోడు అంతకుముందొకసారి నాయడు గుంటూరులో ఉన్నప్పుడు ఆయన మీద నిఘాకి సైనికులని అతడి నివాసం వద్ద కాపలా పెట్టడంతో నాయడి ఆత్మగౌరవం దెబ్బతింది. దానితో రాజధానిని మార్చాలనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనే అమరావతి.

ఈ పట్టణ పూర్వనామం అమరారామం. ఇది పంచారామాలలో ఒకటి.

చింతపల్లిలో ఉన్నప్పుడు కూతురు మరణించడం ఆయనని కృంగదీసిన ఘటన. నివాసం మార్చుకోవాలనుకోవడానికి అది కూడా ఒక కారణమే కానీ మూలకారణం మాత్రం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే. అమరావతిలోని అమరలింగేశ్వరుడి సన్నిధికి మారదామని ప్రతిపాదించినప్పుడు ప్రధాన మంత్రి కాళిదాసు తదితరులు సమ్మతించడంతో వాసిరెడ్డి సంస్థాన చరిత్రలో అదొక మలుపు అయ్యింది.

నాయడు పట్టుదలగా రాజధాని నిర్మాణం మొదలుపెట్టి 1798లో పూర్తిచేసాడు. తన రాజధానికి అమరావతి అనే పేరుని, తన ఏనుగుకి ఐరావతమనీ, తన ఉద్యానవనానికి నందనమని పేర్లు పెట్టుకున్నాడు.

చింతపల్లి కోటలా కాకుండా కంపెనీ సైన్యాలు వచ్చి తిష్ట వేయడానికి వీలులేకుండా అటు మరీ పెద్దదీ, ఇటు చిన్నదీ కాని కోటని నిర్మించుకున్నాడు. అమరలింగేశ్వరుడే తనకి రక్ష అని భావించాడు. ఆశ్చర్యంగా నాయుడు అక్కడ ఉండగా ఆంగ్లేయులు అతడి జోలికి పోలేదు కానీ ఇతర విధాలుగా ఇబ్బంది పెట్టారు.

నాయడి ఆహ్వానం మేరకు సంపన్న వ్యాపార వర్గాలు అమరావతికి వచ్చి స్థిరపడటంతో అమరావతి కేవలం రాజధానిగానే కాకుండా వ్యాపారకేంద్రంగానూ విలసిల్లింది.

నాయడు రాజధాని నిర్మాణానికి అవసరమైన రాళ్ళ కోసం త్రవ్వకాలు జరిపించగా బౌద్ధానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. కానీ గిట్టనివాళ్ళు మాత్రం ఆయన నిధుల కోసం త్రవ్వకాలు జరిపించాడన్నారు.

చింతపల్లి ప్రభువుగా పేరున్న వేంకటాద్రి నాయడు అమరావతిని రాజధానిగా చేసుకున్నాకా అమరావతి ప్రభువు అనిపించుకున్నాడు. ఆయన ఉన్నంత కాలం అమరావతి పట్టణం గొప్ప వైభవాన్ని అనుభవించింది.

జమిందారీ భూములు రైత్వారీ భూములుగా మారిన 19వ శతాబ్దంలో జమిందారీల క్షీణదశ మొదలై జమిందారీల రద్దు చట్టం(1946) అమలుతో వాటి చరిత్ర ముగిసింది. అయినా కూడా న్యాయస్థానాల చుట్టూ తిరిగి ఆస్థులని కరిగించి ఉండకపోతే నాయుడి వారసులు అమరావతి వైభవాన్ని మరికొంతకాలం కాపాడగలిగి ఉండేవారేమో!

అప్పటికే ఉన్న అమరావతిని నాయడు అభివృద్ధి పరచడంతోపాటు క్రొత్తగా వైకుంఠపురం, మన్నెసుల్తాన్ పాలెం, సీతారాంపురం(ప.గో. జిల్లాలో ఉన్న ఈ పట్టణాన్ని నాయడు తనకు విధేయుడైన ఒక నౌకరు పేర కట్టించాడని అంటారు), నాయుడుపేట క్రొత్తగా కట్టించాడు.

మశూచి

1794లో ఎడ్వర్ద్ జెన్నర్ మశూచికి టీకా కనుక్కోవడానికి ఒక సంవత్సరం ముందు అంటే 1793లో నాయడికి మశూచి సోకింది. నాయడి ఆరోగ్య పరిస్థితి గురించి మచిలీపట్నంలోని కంపెనీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండేది.

కంపెనీకి విధేయుడైన ఒక మంచి డాక్టరు సహాయంతో జమిందార్లందరి ఆరోగ్యపరిస్థితి కంపెనీ సేకరిస్తుండేది కానీ కృష్ణా, గుంటూరు జిల్లాలలో అతి పెద్దదైన చింతపల్లి సంస్థానం మీద కంపెనీకి ఎక్కువ శ్రద్ధ ఉండేది. నాయడిలో మశూచి లక్షణాలు కనపడగానే వైద్యం చేయడానికి డాక్టరు చింతపల్లికోటకి వచ్చినప్పుడు నాయడి బావమరిది డాక్టరుని అడ్డుకున్నాడు. అప్పట్లో మశూచికి వైద్యం చేయకూడదనే నమ్మకం ఉన్నందువల్ల వారు డాక్టరుని అడ్డుకున్నారు కానీ అలా అడ్డుకోవడం కంపెనీని ఎదిరించినట్లవుతుందని డాక్టరు బెదిరించడంతో వారు వెనక్కి తగ్గి వైద్యానికి ఒప్పుకున్నారు. డాక్టరు వైద్యంతో నాయడు కోలుకున్నాడు. ఆ తరువాత కోటలో మరికొందరికి మశూచి సోకడంతో వారందరికీ కూడా వైద్యం చేయవలసిందిగా నాయడు డాక్టరుని అభ్యర్ధించాడు.

1801లో కంపెనీవారు మశూచి టీకాలని పంపిణీ చేసినప్పుడు మొదట్లో ప్రజలు టీకా తీసుకోవడానికి నిరాకరించారు(రెండువందల ఏళ్ళ తరువాత కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఈమధ్య మనకి అక్కడక్కడ తారసపడలేదూ?) కానీ నాయడు తనకి ఆంగ్లవైద్యం వల్ల జరిగిన మేలుని వివరించడంతో ప్రజలకి నమ్మకం ఏర్పడి టీకాలు తీసుకున్నారు.

కంపెనీ వారు టీకాలు తీసుకున్నవారికి ప్రొత్సాహకాలు ప్రకటించినా నమ్మని జనం నాయడి మాటని నమ్మారు. మశూచి టీకా పంపిణీలో నాయడి కృషిని అభినందిస్తూ అప్పటి మద్రాసు గవర్నర్ ఎడ్వర్డ్ క్లైవ్ వాసిరెడ్డి సంస్థానాధీశుడికి ప్రశంసా పత్రాన్ని, వెండి పళ్ళాన్ని బహూకరించాడు.

నాయడి తీర్థయాత్రలు

పరిపాలనలో కంపెనీనుండి ఎదురవుతున్న చిక్కులు, కుమార్తె మరణం మొదలైనవాటివల్ల చింతాక్రాంతుడైన నాయడు కంపెనీ అధికారుల అనుమతి తీసుకుని తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైల యాత్రలు చేసాడు. నాయడి దైవభక్తి , దానధర్మాలు చేయాలనే ఉత్సాహం మధ్యలో వచ్చినవి కావనీ, ఎదురుదెబ్బలు తగిలినప్పుడు సైతం ఆయన భక్తి చెదరలేదనీ, దానాలు తీసుకున్న అయోగ్యుల దుష్ప్రవర్తన చూసాకా కూడా ఆయన దాననిరతి మారలేదనీ ఆయన ఆస్థానకవి పాపయారాధ్యుడు వ్రాసిన పద్యాల వల్ల తెలుస్తుంది.

నాయడి దైవభక్తిని గురించి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు పాపయారాధ్యుడు ఆంధ్రీకరించిన దేవీభాగవతానికి ఉపోద్ఘాతం వ్రాస్తూ ఒక సంఘటనని వెల్లడించారు.

నిజాం నవాబు ఏదో మిషతో నాయడిని ఆహ్వానించి కోటలో నిర్బంధించినప్పుడు (ఈ నిర్బంధం గురించి చారిత్రక ఆధారాలు లేవు) కూడా నాయడు శివపూజ మానలేదు. ఆయన వద్ద పూజాసామాగ్రితో ఎప్పుడూ ఒక చిన్నపెట్టె ఉండేది. సంస్థానంలో ఆయన మంత్రి పాపయారాధ్యుడు నిత్యం పూజ చేసేవాడు. ఆయన వద్ద కూడా ఒక పెట్టె ఉండేది. సంస్థాన విశేషాలతో, క్షేమసమాచారాలతో కూడిన పత్రాన్ని పాపయారాధ్యుడు ఒక తాళపత్రాన్ని తన దగ్గరున్న పెట్టెలో ఉంచగానే అది నాయడి పెట్టెలోకి వచ్చేది. స్వయంగా ఈ మహత్తుని చూసి ఆశ్చర్యపోయిన నవాబు సాలీనా ఆదాయం వచ్చే అగ్రహారాన్ని నాయడు నిత్యపూజ చేసే దైవానికి కానుకగా ఇచ్చాడని ఒక కథనం.

నాయడి భక్తి కేవలం గుళ్ళు, గోపురాల నిర్మాణానికే పరిమితం కాలేదు. రాజ్యపాలన చేస్తూనే ఆయన తీర్థయాత్రలు చేసాడు. తన యాత్రల సమయంలో పాలనకి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకునేవాడు. తాను తిరిగివచ్చేలోగా కంపెనీకి చెల్లించవలసిన పన్నుని సైతం ముందే చెల్లించేవాడు.

ఆ రోజుల్లో ఏటీఎంలు లేవు కాబట్టి దేశమంతటా విస్తరించిన కంపెనీవారికి ముందరే కొంత ధనం ముట్టజెప్పి కంపెనీ యంత్రాంగం ద్వారా తాను వెళ్ళినచోట డబ్బు సమకూర్చుకునే ఏర్పాటు చేసుకున్నాడు.

నాయడు 1812వ సంవత్సరంలో కాశీ, గయ, రామేశ్వరం, పూరి, చిదంబరం దర్శించాడు. ఆయన గయని దర్శించినప్పుడు దానాల కోసం వెంటపడుతున్న యాచకులకి ఒక చోటు చూపించి అక్కడ తవ్వుకోమన్నాడని, అక్కడ త్రవ్వుకున్న ఆ యాచకులకి నిధి(నాయడు పాతిపెట్టినదే) దొరకడంతో వారు చాలా తృప్తి చెందారని కథనం ఉంది.

తీర్థయాత్రల సమయంలో నాయడు తన హోదాకి తగినట్లే ప్రవర్తించేవాడు. తీర్థయాత్రల్లో తాను బసచేయడానికి అక్కడి ప్రజలనుండి ఇండ్లని కొని, తిరిగివెళ్ళేటప్పుడు వారికే ఆ ఇండ్లని దానం చేసేవాడు.

నాయడి సంపదకి కారణమేమిటి?

జమిందార్లందరూ సంపన్నులే అయినా కొందరు మహా సంపన్నులు. కొందరు తమ దగ్గరున్న ధనంతో విలాస జీవితం గడిపితే మరికొంతమంది దాన, ధర్మాల మీద దృష్టి పెట్టారు. కొందరు ఆదాయం చాలక భూములని అమ్ముకుంటే(అలా అమ్మిన చాలా గ్రామాలని నాయడు కొన్నాడు), మరికొందరు కౌలుకి ఇచ్చుకున్నారు.

ప్రజలనుండి పన్ను వసూలు చేసే అధికారం తన ఆధీనంలో ఉన్నప్పుడు కూడా నాయడు అధిక పన్నులు వేసి ప్రజలని పీడించలేదు. పోనీ నవాబులకి, కంపెనీకో చెల్లించాల్సిన పన్నులని ఎగ్గొట్టాడా అంటే అదీ లేదు. పంటలు పండక ప్రజలు దీనావస్థలో ఉన్నప్పుడు తప్పితే ఆయన కంపెనీకి కట్టాల్సిన డబ్బుని ఎప్పటికప్పుడు చెల్లించాడని స్వయంగా కంపెనీవారే ప్రకటించారు. మరి ఇన్ని దానధర్మాలకి డబ్బెక్కడిదని కంపెనీవారు ఆశ్చర్యపడేవారు.

నాయడు స్థానిక అధికారులతో కుమ్మక్కై వసూలు చేయవలసినంత పన్ను వసూలు చేయడం లేదని, వసూలు చేసిన మొత్తాన్ని తమకి కట్టకుండా తను తినెస్తున్నాడని కంపెనీ అధికారులు అనుమానించడంతో నాయడు మరింత విరివిగా దానాలు చేసాడు.

అసలు ఇంతకీ నాయడికి అంత ధనం ఎక్కడిదన్న ప్రశ్నకి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆయనకి లంకెబిందెలు దొరికాయంటే మరికొందరేమో ఆయన ఆస్థాన కవి పాపయారాధ్యుడికి బంగారం చేసే విద్య తెలుసనేవారు. ఈ కథలన్నింటిలోకీ కాస్తంత విశ్వసనీయంగా అనిపిచేది విష్ణుభట్ల శ్రీరామశాస్త్రి రచించిన వేంకటాద్రీంద్ర చరితములో ఉంది.

అమరావతి రాజధానిగా నాయడు పరిపాలిస్తున్న కాలంలో అక్కడికి దగ్గర్లోని ఒక ఊరిలో ఒక వ్యాపారస్థుడు ఉండేవాడు. అతడు రత్నాలని పరీక్షించడంలొ నేర్పరి అయినప్పటికీ వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారాన్నే చేసేవాడు. ఒకరోజు అతడి దగ్గరకి గొర్రెలు మేపుకునే ఒక వ్యక్తి మెరుస్తున్న ఒక రాయిని చూపించి అది తీసుకుని దానికి బదులుగా ఒక పొగాకు కాడని ఇవ్వమని అడిగాడు. ఆ రాయి విలువని గ్రహించిన ఆ వ్యాపారి అది ఎక్కడినుండి తెచ్చావని అడిగి, ఆ వ్యక్తిని అక్కడే ఉండమని చెప్పి వెంటనే వెళ్ళి నాయడిని కలిసి తన చేతిలోని రాయిని చూపించి అలాంటివి దగ్గర్లోని వాగులో కోకొల్లలుగా ఉన్నాయని చెప్పాడు. నాయడు వెళ్ళి ఆ వాగు నుండి ఆ రత్నాలని బళ్ళళ్ళో నింపుకుని కోటకి తిరిగివచ్చాడని ఆ కథనం సారాంశం.

చేబ్రోలు ఆలయల నిర్మాణ సమయంలో కూడా నాయడికి సంపద దొరికిందని అంటారు కానీ దానిని ధృవపరిచే ఆధారాలేమీ లేవు.

నాయడి పాలనకి గ్రహణం

రాజ్యాన్ని విస్తరింపజేసుకుని, గుళ్ళూ గోపురాలు నిర్మిస్తూ, దాన ధర్మాలు చేస్తూ జనరంజకంగా పాలిస్తున్న నాయడి ప్రాభవం కంపెనీవారు అవలంబించిన కుటిలనీతి వల్ల మసకబారసాగింది.

నిజానికి కంపెనీ అవలంబించిన కుటిలనీతి కేవలం నాయడి జమిందారీకే పరిమితమైనది కాదు. దక్కన్ ప్రాంతంలో నిజాంని లొంగదీసుకునేముందు చిన్నా పెద్దా జమిందారీలన్నింటినీ ఈ వ్యూహానికి బలిచేసారు. వెల్లస్లీ రూపొందించిన సైనిక సహకార విధానానికి ఒప్పుకుని ఆ ఒప్పందం వల్ల సంస్థానం కంపెనీ రక్షణలోకి వస్తుందని అందరూ పొరబడ్డారు. నిజానికి సంస్థానం తన స్వాతంత్రాన్ని కోల్పోతుంది. ఎందుకంటే ఆంగ్లేయుల సైన్యం సంస్థానంలోకి వచ్చి తిష్ట వేయడం వల్ల వారి ఖర్చులన్నింటినీ సంస్థానమే భరించాల్సి వస్తుంది.

సొంత సైన్యాలని తగ్గించుకోవాలని కంపెనీవారు ఉత్తర్వులు జారీచేసినప్పుడు తమకి సైన్యపు ఖర్చు తగ్గుతుందని కొందరు సంస్థానాధీశులు భావించారు కానీ తమ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతోందని వారు గ్రహించలేదు. గ్రహించినా నిస్సహాయత వల్ల కూడా మారుమాట్లాడకపోయి ఉండవచ్చనిపిస్తుంది.

పెద్ద సంస్థానమైన నిజాం మీద చేసిన ప్రయోగం సఫలమవడతో ఆ విధానం అమరావతి మీద కూడా అమలుచేబడింది. కంపెనీ సైన్యం చింతపల్లి కోటలో దిగడం ఈ వ్యూహంలో భాగమే.

ఆ తరువాత సంస్థానం చెల్లించాల్సిన పేష్కష్‌ని విపరీతంగా పెంచి సంస్థానాధీశులు దానిని చెల్లించలేమన్నప్పుడు ఆ సంస్థానాన్ని కబళించడం ఈ ఒప్పందంలోని వ్యూహం.

జమిందారీలో పన్నులు చాలా తక్కువగా వసూలు అవుతున్నాయని, జమిందారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారన్న సాకుతో కంపెనీ పేష్కషుని పెంచింది. అయినా కూడా నాయడు కంపెనికి చెల్లించవలసిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నాడు. కంపెనీ పేష్కషుని క్రమంగా పెంచుకుంటూపోవడం వల్ల అప్పుడప్పుడు బాకీపడటంతో అధికారులతో మాట్లాడటానికి నాయడిని మద్రాసుకో, మచిలీపట్నానికో రమ్మని ఆఙాపించేవారు.

అప్పట్లో విజయనగం, నూజివీడు, అమరావతి పెద్ద సంస్థానాలు. చీటికీమాటికీ తమని అధికారులు పిలుస్తుండటం సంస్థానాధీశులకి నామోషీగా అనిపించేది. అదీగాక వారిని కలవడానికి మందీమార్బలంతో వెళ్ళడం వల్ల అదనపు ఖర్చు. అందువల్ల అప్పుడప్పుడు సంస్థానాధీశులు ఆ ఆఙలని లెక్కజేసేవారు కాదు, లేదా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవారు. తమ సాయుధ బలగం సగానికి పైగా తగ్గించేయడంతొ తాను ఒక్కడే కంపెనీని ఎదిరించలేడు కాబట్టి వారితో నాయడు సర్దుకుపోవాలనుకున్నాడు.

ఇంతలో మైలవరం జమిందారీకి చెందిన వారసుల వివాదంలో కంపెనీ జోక్యం చేసుకుంది. వారసుల్లో ఒకరైన వేంకటరామారావు సైనికులని సమకూర్చుకుని కంపెనీని ఎదిరించాడు. కంపెనీ తమ సైనిక బలగంతో అతడి తిరుగుబాటుని అణచివేయడంతో వేంకటరామారావు నాయడి శరణు కోరాడు. కంపెనీ నాయడి మీద ఒత్తిడి తెచ్చి వేంకటరామారావుకి ఆశ్రయం ఇవ్వకుండా చేసింది. తాను బలహీనుడవ్వడం వల్లే ఆశ్రితుడిని పంపించివేయవల్సి వచ్చిందని నాయడు కలతపడ్డాడు.అలాగే ఇంకొక ఆశ్రితుడిని కూడా తిరిగి పంపించేసాడు.

నాయడు కంపెనీకి చెల్లించాల్సిన డబ్బు సకాలంలో చెల్లించలేకపోయినప్పుడు నాయడు ఎవరికీ భూములు బదిలీ చేయడానికి వీలు లేదని కంపెనీ ఆంక్షలు విధించింది. అంటే, నాయడిని నలువైపులనుండీ నిస్సహాయుడిని చెయ్యాలని కంపెనీ వ్యూహం.

పన్ను వసూళ్ళ వివరాలని కంపెనీ అధికారులకి సమర్పించే జమాబందీకి తాను వెళ్ళకుండా తన వకీలుని పంపడంతో కంపెనీ అతడే స్వయంగా రావాలని పట్టుబట్టింది. నాయడు పట్టుదలకి పోయి తెగేదాకా లాగకూడదని తానే స్వయంగా హాజరయ్యాడు.

నిజాం రాజు తనకిచ్చిన బిరుదుని స్వీకరించడానికి అనుమతించవలసిందిగా నాయడు కంపెనీని కోరితే కంపెనీ అధికారులు నవాబు ఇచ్చిన లేఖని చూపించమని అడగటంతో తాను చులకనయ్యానని నాయడు బాధపడ్డాడు.

ఒక సంస్థానాధీశుడు కంపెనీకి బకాయిలు చెల్లించలేక తన భూములు కొన్నింటిని నాయడికి అమ్మాడు. ఆ విషయాన్ని కూడా నాయడు కంపెనీకి నివేదించుకోవలసి వచ్చింది. గ్రామాల కొనుగోళ్ళు, అమ్మకాల విషయంలో జమిందారుల స్వేఛ్ఛని కంపెనీ హరించేసిందనడానికి ఇదొక నిదర్శనం. అయినా నాయడు అప్పటిలాగే రాజ్యవిస్తరణ చేసుకుంటూనే ఉన్నాడు.

నాయడి చరమదశ, వారసులకి ఆస్తి పంపకాలు

1798లో తన పెత్తండ్రి మనుమడైన జగన్నాధబాబుని, 1807లో తన పినతండ్రి మనుమడైన రామనాథబాబుని నాయడు దత్తత తీసుకున్నాడు.

కంపెనీ జమిందారులపట్ల అనుసరిస్తున్న కుట్రని గుర్తించో లేక తన కుటుంబలోని కలతలో, తన అనారోగ్యమో కానీ నాయడికి తన కుమారులిద్దరికీ ఆస్తిని పంచాలనే ఆలోచన 1812లో కలిగింది.

తన మీద కుట్రపన్నుతున్నారని దాయాదులని నాయడు చింతపల్లికోటలో బంధించడంతో అతడు కఠినాత్ముడు, స్వార్థపరుడిగా అంగ్లేయులు చిత్రీకరించారు. నాయడు తన కుటుంబాన్ని ఇతరుల కుట్రల గురించి కాపాడాలనుకున్నాడే కానీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యాలనుకోలేదు. ఎందువల్లనంటే తన తాత నాగన్న కాలంలో బసాలత్ జంగ్ తన కుటుంబంలో పెట్టిన చిచ్చువల్ల ఒకరిపై ఒకరికి కక్ష పెరిగి కలహాలు, హత్యలదాకా పోవడం నాయడికి తెలుసు. అందుకే పరాయివారు తమ కుటుంబలో చిచ్చుపెట్టకుండా తన దాయాదులని అదుపాఙలలో ఉంచాడు. కానీ దానిని ఆంగ్లేయులు 'నిర్బంధించడం' అన్నారు.

1812లో తన ఆస్తిని నాయడు నాలుగు భాగాలుగా చేసి ఒకటి తనకోసం, రెండవది ధర్మం కోసం, మిగతా రెండు భాగాలు కొడుకుల కోసం ఇచ్చాడు. అప్పటికి అతడి కుమారులిద్దరూ మైనర్లు.

తన తమ్ముడైన రామనాథబాబు దత్తత చెల్లదని, తనకే ఆస్తి మొత్తం చెందాలని నమ్మే నాయడి పెద్దకొడుకు జగన్నాథబాబుకి ఇది నచ్చలేదు. కానీ ఈ ఏర్పాటు తమకి సమ్మతమేనని 1814లో నాయడు ఇద్దరి కొడుకులచేతా సంతకాలు పెట్టించుకున్నాడు. అప్పుడు కూడా ఇద్దరూ మైనర్లే.

1815లో పెద్దకొడుకుకి మైనారిటీ తీరింది. 1816 ఫిబ్రవరిలో నాయడు మరొకసారి ఆస్తి విభజన చేసి ఈసారి ధర్మం కోసం ఉంచినది మాత్రం తానుంచుకుని మిగతా మూడు భాగాలనీ ఇద్దరు కొడుకులకీ సమానంగా పంచాడు. అందువల్ల ఇంతకుముందు జరిగిన ఆస్తిపంపకాలప్పటికంటే ఇప్పుడు ఇద్దరు కొడుకులకీ ఎక్కువే లభించింది.

మళ్ళీ అదే సంవత్సరం జూలైలో తనపేర ఉంచుకున్న ఆ ఒక్క భాగాన్ని కూడా కొడుకులకి పంచి ఎవరికి ఏది ఇవ్వాలో తాను నిర్ణయించకుండా చీట్లు వేసి నిర్ణయించాడు. పెద్దకొడుకైన జగన్నాథబాబుకి 314, చిన్నవాడైన రామనాథబాబుకి 237 గ్రామాలు లభించాయి.

నాయడు ఎన్ని దానధర్మాలు చేసినా, నవాబులకి, పాదుషాలకి ఎన్ని నజరానాలు సమర్పించినా, ఎందరో కవులు, కళాకారులని పోషించినా ఆయన మరణించే సమయానికి ఆయన సైనికబలగం, ఆయుధసంపత్తి తగ్గాయే కానీ ధనసంపద మాత్రం తరగలేదు.

తన కుమారులకి ఆస్తి పంపకాలు జరిపినప్పుడు భూములే కాకుండా ఆభరణాలు, తన నివాసంలోని బంగారు వస్తువులు, ధనం, ఏనుగులు, గుర్రాలు, గొసంపద, తుపాకులు, శూలాలు మొదలైన ఆయుధాలు కూడా ఉన్నాయి. దానధర్మాలకి ఎంత ఖర్చు చేసినా నాయడు తన కుమారులకి ఇవ్వాలనుకున్న ధనాన్ని, వస్తుసంపదని ఇచ్చాడు కానీ వారు దానిని నిలబెట్టుకోలేకపోయారు.

నాయడు తన చిన్నకుమారుడికిచ్చిన వస్తుసంపద వివరాలు ఈ క్రింది చిత్రంలో చూడవచ్చు.

పంపకాల తరువాత పెద్దకొడుకు భాగం క్రింద వచ్చిన గ్రామాల పాలన అతడికే వదిలి మైనరైన చిన్నకొడుకుకి లభించిన గ్రామాలని తను పాలించాడు.

వారసుల పోరాటాలు

1816 ఆగస్టు 18న నాయడు మరణించాడు. ఆయన మరణించాకా ఆయన కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కాయి. నాయడి అంత్యక్రియలప్పుడు మొదలైన రచ్చ కోర్టుకి చేరింది.

నాయడు మరణించాక వచ్చిన డల్హౌసీ చట్టం ప్రకారం సంస్థానాధీశులకి సొంతవారసులు లేకపోతే సంస్థానం ఆంగ్లేయుల వశమవుతుంది కానీ నాయడు ఆస్తి విభజన చేసే సమయానికి ఈ చట్టం అమలులో లేకపోవడం వల్ల అతడి దత్తపుత్రులు ఆస్తి కోసం తగువులాడుకుని దేశంలోని అన్ని కోర్టుల చుట్టూ తిరిగి చివరికి లండనులోని ప్రివీకౌన్సిల్ దాకా వెళ్ళారు. నాయడి ఆస్తి అంతా ఈ న్యాయపోరాటానికే హరించుకుపోయింది.

నాయడు మరణించాకా 1815 సంవత్సరానికి గాను కంపెనీకి చెల్లించవలసిన బకాయి క్రింద జమిందారీలో కొంతభాగాన్ని జప్తు చేసి, పరిపాలన కోసం ప్రత్యేక వ్యవస్థని కంపెనీ అధికారులు ఏర్పరిచారు.

నాయడి మరణం తరువాత 1816 నుండి 1852 వరకూ అంటే దాదాపు 36 సంవత్సరాలపాటు ఆయన తనయులిద్దరూ ఆస్తి కోసం కోర్టుల్లో పోరాడారు. మధ్యలో ఆయన పెద్దకొడుకు మరణించినా అతడి ఇద్దరి భార్యలలో ఒకామె ఆ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళింది.

1817 వ సంవత్సరంలో నాయడి పెద్దకొడుకు జగన్నాథబాబు తన తండ్రి బ్రతికుండగా కంపెనీకి చెల్లించవలసిన పన్నుని తన వద్ద ఉన్న ధనం చాలకపోవడంతో అప్పు చేసి మరీ చెల్లించినా కంపెనీ ఆ సంస్థానాన్ని జప్తు చేసింది. ఈ జప్తు మీద జగన్నాథబాబు గుంటూరు కలెక్టరు మీద కోర్టులో వ్యాజ్యం వేసినా అది వీగిపోయింది.

ఆ తరువాత నాయడికి రావల్సిన సొమ్ముని కుటుంబంలో కలహాలని సాకుగా చూపించి అప్పటి ప్రభుత్వం కోర్టులో జమ చేసింది. నాయడి ఇద్దరు కుమారులూ ఆ ధనం కోసం పిటీషన్లు వేసారు కానీ నాయడి కొడుకుల్లో హక్కుదారులెవరో తేలేవరకూ ఆ ధనం ఎవరికీ చెందదని కోర్టు ఆదేశమిచ్చింది. కానీ మరెందుకో మళ్ళీ ఆ ధనాన్ని నాయడి కొడుకులిద్దరూ చెరి సగం తీసుకోవలసిందని తీర్పునిచ్చినా నాయడి పెద్దకొడుకు దానికి సమ్మతించకపోవడంతో ఆ ధనం ప్రభుత్వ ఖజానాకి చేరిపోయింది.

1825లో పెద్దకొడుకు జగన్నాథబాబు మరణించాడు.అందువల్ల వాసిరెడ్డి సంస్థానానికి తానే వారసుడినని రామనాథబాబు ప్రకటించాడు. జగన్నాథబాబు రెండవ భార్య రంగమ్మ సైతం మరిది రామనాథబాబుని సమర్ధించింది.

ఇంతలో జగన్నాథబాబు పెద్దభార్య అచ్చమ్మ మొత్తం జమిందారీ తనదేనంటూ కోర్టు ముందుకి వచ్చింది. అందుకు సాక్ష్యంగా జగన్నాథబాబు బ్రతికుండగా తనని రంగమ్మ పెడ్తున్న బాధలని వర్ణిస్తూ తన భర్త జగన్నాథబాబు వ్రాసిన ఉత్తరం, వీలునామా మొదలైనవాటిని కోర్టుకి సమర్పించింది.

వాసిరెడ్డి సంస్థానానికి నాయడి పెద్దకొడుకు పెద్దభార్య అచ్చమ్మే వారసురాలని కోర్టు తీర్పునిచ్చినా రామనాథబాబు దీనిపై అప్పీలు చేసాడు. ఆ తరువాత వివాదం మరిన్ని మలుపులు తిరిగింది.

రామనాథబాబు తనని మోసం చేసాడని, ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలని కోర్టుకి సమర్పించాడని, జగన్నాథబాబు బ్రతికుండగానే తమకి ఒక దత్తపుత్రుడు లక్ష్మీపతి ఉన్నాడని రంగమ్మ క్రొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది.

అనేక మలుపులు, విచారణల తరువాత కోర్టు రామనాథబాబుకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అతడి అన్న వాటాకి సైతం అతడే అధిపతయ్యాడు. కానీ ఇదంతా కాగితాల మీద మాత్రమే. వాస్తవంలో అతడు జమిందారీని అనుభవించనే లేదు.

తీర్పు తమకి అనుకూలంగా రాలేదని జగన్నాథబాబు భార్యలైన ఆచ్చమ్మ, రంగమ్మ(మొదట్లో వీళ్ళిద్దరూ విడిగా ఉన్నా చివరికి కలిసిపోయి మరిది మీద దావా వేసారు)కలిసి లండన్ ప్రివీకౌన్సిలుకి అప్పీలు చేసారు.

ఇంతలో 1846లో రెవెన్యూబోర్డు వాసిరెడ్డి సంస్థానాన్ని పాక్షికంగా అమ్ముతామని ప్రకటించింది.

ప్రివీకౌన్సిలులో ఇచ్చిన తీర్పు ప్రకారం నాయడి పెద్దకొడుకు జగన్నాథబాబు దత్తత తీసుకున్న లక్ష్మీపతే జగనాథబాబు ఆస్థికి వారసుడు. రామనాథబాబుకి ఏ హక్కూ లేదు.

లక్ష్మీపతికి అనుకూలంగా తీర్పు వచ్చినా అప్పటికే జమిందారీని ప్రభుత్వం కొనేసుకుంది. చివరికి వాసిరెడ్డి కుటుంబానికేమీ దక్కలేదు. వారు కంపెనీనుండి భరణం అందుకుంటూ సాధారణ పౌరులుగా జీవించారు. నాయడి పెద్దకొడుకు జగన్నాథబాబు 1825లో మరణిస్తే చిన్నకొడుకు 1859లో మరణించాడు.

నాయడి మరణానంతరం సాగిన కోర్టు వ్యవహారాలు ఏ దశలోనూ రాజీకి ఆస్కారం లేని విధంగానే కొనసాగాయి. మొదట అన్నదమ్ములిద్దరూ ఒకరిమీద ఒకరు చేసిన పోరాటం, పెద్దకొడుకు జగన్నాథబాబు మరణించాకా అతడి తమ్ముడు, చిన్న భార్య కలిసి పెద్దభార్య మీద చేసిన పోరాటం, ఆ తరువాత పెద్దకొడుకు భార్యలిద్దరూ కలిసి మరిది మీద చేసిన పోరాటం, తుదకి పెద్దకొడుకు దత్తపుత్రుడు చేసిన పోరాటం చూస్తే వాళ్ళందరూ ఎంత ఆశావహులై ఈ కేసులని నడిపించారో తెలుస్తుంది. కేసు ఎన్ని మలుపులు తిరిగిందోనని ఆశ్చర్యమేస్తుంది.

వాసిరెడ్ది జమిందార్ల దావాలలో ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క రకంగా, కక్షిదారులందరికీ ఏదో ఒక కోర్టులో అనుకూలంగా, మరొక కోర్టులో వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు చెప్పాయి. చివరికి ప్రివీకౌన్సిలులో నాయడు పెద్దకొడుకు జగనాథబాబు దత్తపుత్రుడు లక్ష్మీపతికి అనుకూలంగా తీర్పు వచ్చినా ఒరిగిందేమీ లేదు.

ఇలాగే ప్రివీకౌన్సిల్ దాకా వెళ్ళి ఆస్థులు హరించుకుపోయిన సంస్థానాధీశులు అప్పట్లో దేశమంతా ఉన్నారు.

అమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయడు పుస్తక రచయిత పొత్తూరి వేంకటేశ్వరరావు గారు చెప్పిన ఈ క్రింది మాటలు కొంతవరకూ నిజమేననిపిస్తాయి.

గతజల సేతుబంధనం అవుతుందేమో కానీ నాయడు తన దగ్గరున్న ధనంలో కొంతభాగాన్ని అప్పటికి అందుబాటులో ఉన్న తుపాకులు, ఫిరంగులు, మందుగుణ్డు సామాగ్రిపై వెచ్చించి ఉంటే ఇంగ్లీషు కంపెనీ అధికారులు అతడిని చూసి మరింత భయపడి ఉండేవాళ్ళు.

ఒకవేళ నాయడు కనుక ఇలా చేసివుంటే మరికొంతకాలమైనా కంపెనీవారిని ఎదిరించిగలిగి ఉండేవాడు. సంస్థాన ప్రజలకి మరికొంతకాలం చక్కటి పాలనలో ఉండే అవకాశం లభించేది.

కుటుంబవ్యవహారాలు రచ్చకెక్కితే కలిగే పర్యవసానాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కాబోలు!

నాయడి కుమారులు తమ పూర్వీకులు సంపాదించిన ఆస్థినంతా కోర్టు ఖర్చులకి ధారపోసారని చదివాకా ఈ రెండు పద్యాలు మదిలో మెదిలాయి.


పొత్తూరి వేంకటేశ్వరరావుగారి అమరావతి ప్రభువు వేంకటాద్రి నాయడు అనే పుస్తకం కళ్ళబడటంతో అది చదివి నాయడి గురించి మరింత తెలుసుకోవాలనిపించి వెతికితే మరో రెండు పుస్తకాలు(ములుగు పాపయారాధ్యుల రచనలు- రచయిత గోలి వేంకటరామయ్య గారు, రాజా వేంకటాద్రి నాయుడు- రచయిత కొడాలి లక్ష్మీనారాయణగారు) కనపడ్డాయి.ఈ మూడింటిలోంచి తీసుకున్న సమాచారాన్ని కుదించి కుదించి వ్రాసినా ఇంత పెద్దదై కూర్చుంది.

ఈ సమాధానంలో 'కంపెనీ' అని కనపడినప్పుడల్లా ఈస్టిండియా కంపెనీ అని నా భావం. పదే పదే జపించడానికి అదేమీ తారకమంత్రం కాదు కాబట్టి ఆ పదాన్ని కుదించాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !