టెక్ వర్గాల్లో ఏఐ (Artificial Intelligence) ఎంత ఆసక్తి కలిగిస్తుందో.. అంతే ఆందోళనకూ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు పోవడంతో పాటు భవిష్యత్‌లో మానవాళి ఉనికికే ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్ ( Elon Musk ) వంటి టెక్ నిపుణులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వెంటనే అత్యాధునిక ఏఐ (Artificial Intelligence) వ్యవస్థల తదుపరి దశ అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ పలువురు నిపుణులు ( Tech Experts ) బహిరంగ లేఖ రాశారు. దీనిపై ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్, యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ సహా 1,000 మందికి పైగా నిపుణులు సంతకం చేశారు. ‘పాజ్ జియాంట్ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్’ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. ఏఐ ఆధారిత చాట్‌బాట్ ChatGPT అభివృద్ధి చేసిన OpenAI సంస్థ ఇటీవల GPT - 4 పేరిట మరింత Advanced AI వ్యవస్థను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖను ‘ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్’ తరఫున విడుదల చేశారు. ఈ సంస్థకు ఎలాన్ మస్క్ ( Elon Musk) నిధులు సమకూరుస్తున్నారు. సంతకం చేసిన వారిలో ChatGPTని విమర్శిస్తున్న ప్రముఖులతో పాటు OpenAI ప్రత్యర్థి సంస్థల ప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం. OpenAIకి తొలినాళ్లలో మస్క్ కూడా నిధులు సమకూర్చారు. అలాగే ఆయన నేతృత్వంలో ఉన్న టెస్లా (Tesla) తమ విద్యుత్ కార్ల కోసం ప్రత్యేక AI వ్యవస్థల్ని అభివృద్ధి చేస్తోంది.మానవ మేధస్సును మించి...
మానవ మేధస్సుతో పోటీ పడే GPT-4 వంటి AI వ్యవస్థలు సమాజానికి, యావత్ మానవాళికి తీవ్ర ముప్పును ( DANGER) తలపెట్టే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు ఇవ్వగలిగే AI వ్యవస్థలను మాత్రమే అభివృద్ధి చేయాలని సూచించారు. మనిషికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మనిషి అవసరం లేని వ్యవస్థ ప్రమాదకరమని తేల్చారు. ఒకవేళ ఏమైనా ప్రతికూల ప్రభావాలు తలెత్తినా.. వాటిని నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన AIల దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. GPT-4 కంటే శక్తిమంతమైన AI వ్యవస్థల అభివృద్ధిని వెంటనే నిలిపివేయాలని లేఖలో డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం...గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా
ఏఐ (Artificial Intelligence)లో ఇటీవల కనిపిస్తోన్న పురోగతి ఎన్నో రంగాలపై ప్రభావం చూపనుందనే ఆందోళన ఎక్కువవుతోంది. ముఖ్యంగా ఇవి చాలా రంగాల్లో ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ కూడా తాజా నివేదికలో ఇటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసింది. కృత్రిమ మేధ(AI) సాంకేతికతలో వస్తోన్న నూతన పోకడలు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది. ‘ఆర్థిక ప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ నివేదికలో గోల్డ్‌మాన్ శాక్స్ ఈ అంశాలు వెల్లడిరచింది.
1) కృత్రిమ మేధ అంచనాలకు అనుగుణంగా తన ఉత్పాదక సామర్థ్యాలను నెరవేరిస్తే శ్రామిక రంగంలో మాత్రం ఒడుదొడుకులుంటాయి. అమెరికా, ఐరోపాల్లో వృత్తిపరమైన పనుల సమాచారాన్ని విశ్లేషించి చూస్తే అక్కడ ప్రస్తుతమున్న ఉద్యోగాల్లో మూడో వంతు ఆటోమేషన్‌కు ప్రభావితమవుతాయి.
2 ) సాంకేతికత పురోగతి అంటేనే కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఉత్పాదకతకు మరింత ఊతం. తద్వారా ప్రపంచ జీడీపీని 7 శాతానికి పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని అంచనా వేసింది.
3) ChatGPT వంటి అధునాతన కృత్రిమ మేధ వ్యవస్థలు మానవుల్లానే కంటెంట్‌ను సృష్టించగలవని.. వచ్చే దశాబ్దకాలంలో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది.
4) కృత్రిమ మేధ వల్ల కార్యనిర్వహణ, న్యాయ రంగాల్లోని ఉద్యోగాలపై అత్యధిక ప్రభావం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ రంగంలో 46 శాతం, లీగల్ ఉద్యోగాల్లో 44 శాతం ముప్పు పొంచి ఉంది. నిర్వహణ, ఇన్‌స్టలేషన్, మరమ్మతు, నిర్మాణ రంగ ఉద్యోగాలకు మాత్రం తక్కువ ప్రభావం ఉండనుంది.
