మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 6న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీబీఐ అధికారులు శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. అయితే 6వ తేదీన విచారణకు రాలేనని ఎంపీ చెప్పగా.. కచ్చితంగా రావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండుసార్లు సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని విచారించారు. ఇప్పటికే రెండు సార్లు జవవరి 28, ఫిబ్రవరి 24న విచారించిన అధికారులు.. వివేకా హత్యకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6 న కడపలో విచారణకు రావాలని ఆయనకు సూచించారు.