- ఉసురు తీసుకుంటున్న విద్యార్థులు !
- కళ్ళు తెరవని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు !
ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉందని లాన్సెట్ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 10, 11, 12 వ తరగతి నుండి మొదలై ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది. విద్యలో మెరుగైన ఫలితాల కోసం తల్లిదండ్రుల నుండి ఒత్తిడి, మార్కుల కోసం స్కూల్స్/ కాలేజ్‌ల నుండి విద్యాపరమైన ఒత్తిడికి ఎక్కువగా కారణమని నివేదికలో పేర్కొంది. విద్యాసంస్థలు విద్యార్థులను నిరంతరం ఒత్తిడి చేయడం వల్ల కొంతమంది పిల్లలు చదువు మరియు పరీక్షలకు సంబంధించిన ఆందోళనను పెంచుకుంటున్నట్లు సర్వేలో తెలిసింది. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు వివిధ రకాల విద్యాసంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు - పరీక్షల ఒత్తిడి, తరగతులకు హాజరయ్యేందుకు ఆసక్తి లేకపోవడం మరియు సబ్జెక్టును అర్థం చేసుకోలేకపోవడం. అలాంటి ఒత్తిడి వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, నెర్వస్‌నెస్ మరియు స్ట్రెస్-సంబంధిత సమస్యలు తలెత్తి కొన్ని రకాల మానసిక లేదా శారీరక సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితి వారి విద్యా ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఆందోళన మరియు ఒత్తిడి పిల్లల సామాజిక, భావోద్వేగ మరియు విద్యాపరమైన విజయాలపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ రోజుల్లో విద్యార్థులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ మానసిక ఆరోగ్య సమస్యగా డిప్రెషన్ మారుతోంది.
స్కూల్స్ / కాలేజ్‌ల్లో వ్యాపారాత్మక ధోరణి కారణంగానే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. 24 గంటల్లో 18 గంటలు చదువుకే కేటాయించటం, ఆటవిడుపు, విరామం లేకపోవటం, వినోద కార్యక్రమాలు, క్రీడలు ఆడేందుకు సమయం కేటాయించేకపోవటం, లేచింది మొదలు టీచర్లు చెప్పే పాఠాలు వినటం, హోంవర్క్ చేయటం, స్టడీ అవర్స్, ఎగ్జామ్స్ వ్రాయటం, మార్కులు, ర్యాంకుల చుట్టూనే పరిభ్రమించటం మూలంగానే విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రులూ అర్థం చేసుకోకపోవటం బాగా చదవాలి అనే విపరీతమైన అంచనాల నేపధ్యంలో మానసికంగా కుంగిపోతున్నారు. అంచనాలను అందుకోలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన మిగుల్చుతున్నారు. ఒత్తిడిని నిరోధించడానికి ప్రభుత్వం శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. అత్మహత్యలు నివారించడానికి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మనోవైజ్ఞానికులను భాగస్వాములగా చేసి విద్యాపరంగా కొత్త నిబంధనలను రూపొందించాలి.