secunderabad railway station renovation : ఎయిర్‌పోర్ట్‌లా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ !

0

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అధునాతన సౌకర్యాల కల్పనతో పాటు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. దీనితో సికింద్రాబాద్‌ కొత్తరూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహా సౌకర్యాలతో స్టేషన్‌ ముస్తాబు కానుంది. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఇక్కడ భూసార పరీక్షలు చేయడంతో పాటు టికెట్‌ బుకింగ్‌ కేంద్రాలు, రైల్వే రక్షణ దళం కార్యాలయాలను తరలించేందుకు ప్రత్యామ్నాయ భవనాల నిర్మాణం చేపట్టారు. శంకుస్థాపన అనంతరం పనులు జోరందుకోనున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.

అందుబాటులోకి రానున్న సౌకర్యాలు..

  1.  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఉత్తర, దక్షిణ వైపు ఉన్న భవనాలు ప్రస్తుతం 11,427 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉండగా.. అభివృద్ధి పనుల తర్వాత ఉత్తర, దక్షిణ వైపు జీం 3 అంతస్తులతో 37,308 చ.మీ.ల మేర అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న భవనాల విస్తీర్ణం 227 శాతం పెరుగుతుంది.
  2. ప్లాట్‌ఫామ్‌ల నిడివి పెరుగుతుంది. దీంతో ఒక్కో ప్లాట్‌ఫామ్‌ మీద 2 రైళ్లు ఆగుతాయి. రైళ్లు ఎక్కేవారు, దిగేవారు వేర్వేరు మార్గాల్లో వెళ్లడానికి వీలవుతుంది. ప్రస్తుతం అందుతున్న సేవలు రెట్టింపవుతాయి.
  3. మొదటి అంతస్తులో ప్రయాణికులు రైళ్లు ఎక్కేందుకు వీలుగా 24,604 చ.మీ.ల స్థలం అందుబాటులోకి రానుంది. రెండో అంతస్తులో రూఫ్‌టాప్‌ ప్లాజా వాణిజ్య సముదాయం రూపొందనుంది. ప్లాట్‌ఫామ్‌ల మీద రూఫ్‌ మొత్తం 42,212చ.మీ.ల మేర అందుబాటులోకి వస్తుంది.
  4.  7.5 మీటర్ల వెడల్పుతో రెండు పాదచారుల వంతెనలు, 26 లిఫ్టులు, 35 ఎస్కలేటర్లు నిర్మించనున్నారు. 1 నుంచి 10 ప్లాట్‌ఫామ్‌లను కలుపుతూ స్టేషన్‌కు చేరుకునే ప్రయాణికులకు పాదచారుల వంతెన ఏర్పాటు కానుంది.
  5. విద్యుత్‌ కోసం 5,000 కేడబ్ల్యూపీ సోలార్‌ పవర్‌ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
  6. పచ్చదనం, పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నారు. దివ్యాంగులు సులభంగా స్టేషన్‌లోకి చేరి రైళ్లు ఎక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లోపలికి ప్రవేశం, బయటికి వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఉండబోతున్నాయి.
  7. విశాలమైన డబుల్‌ లెవెల్‌ రూఫ్‌ ప్లాజాతో పాటు రిటైల్‌ దుకాణాలు, ఫలహారశాలలు, వినోద సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
  8. స్టేషన్‌కు ఉత్తర వైపు బహుళ అంతస్తుల స్థాయిలో, దక్షిణ వైపు అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. ఉత్తర, దక్షిణ భవనాల దగ్గర ట్రావెలేటర్‌తో పాటు 2 నడక మార్గాలను నిర్మించనున్నారు. ఈస్ట్‌, వెస్ట్‌ మెట్రోస్టేషన్లను స్కైవేతో అనుసంధానం చేయనున్నారు. సికింద్రాబాద్‌ ఈస్ట్‌కు, పాత గాంధీ ఆసుపత్రి మెట్రోస్టేషన్‌కు నేరుగా వాక్‌వేలు ఉంటాయి. రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకొనేలా వాక్‌వేలు నిర్మిస్తారు.

రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణతో ప్రజలకు ప్రయోజనం: మోదీ



సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు, సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణతో అసంఖ్యాక ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదో ముఖ్యమైన మౌలికవసతుల అభివృద్ధి కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణకు సంబంధించిన నమూనా చిత్రాలను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. అలాగే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా తిరుపతికి ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుందన్నారు. ‘‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆత్మగౌరవం, సౌకర్యం, అనుసంధానతలకు పర్యాయపదంగా మారింది. సికింద్రాబాద్‌, తిరుపతిల మధ్య ప్రవేశపెట్టే ఈ రైలు పర్యాటకానికి, మరీముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి విశేష ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిని కూడా ఇనుమడిరపజేస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !