టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసే అంశాన్ని బీజేపీకి అంటగట్టి బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్న వార్తలను కిషన్ రెడ్డి ఖండిరచారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్డి లేదా సీబీఐ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మెదటగా కేసు నమోదు చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ పార్టీ బీజేపీ దగ్గర నాలుగు వందల కోట్లు లేవని వ్యాఖ్యానించారు. మునుగోడులో ఓటమి కళ్ళ ముందు కన్పించటంతో కొత్త ఆటకు కేసీఆర్ తెర తీశారన్నారు. దొరికిన డబ్బు ప్రగతి భవన్ నుంచి వచ్చిందా? ఫాంహౌస్ నుంచి వచ్చిందో? భయటపెట్టాలన్నారు. ఎంత డబ్బు దొరికింది ? దానిని ఎవరు తీసుకొచ్చారు ? అనే అంశాలను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరచలేదన్నారు.
ఇంకా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చేసిన అవినీతికి శిక్ష తప్పదని కల్వకుంట్ల కుటుంబానికి అర్థమైంది. నాతోనే కాదు.. జోగినపల్లి సంతోష్, హరీష్ రావు సహా చాలా మంది నేతలతో నందకుమార్ ఫోటోలున్నాయి. టీఆర్‌ఎస్‌లో చేరాలని స్వయంగా కేసీఆర్ ముద్దుల కుమారుడు ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. ఏ పార్టీలో గెలిచి... ఏ పార్టీలో మంత్రి అయ్యాడో ఇంద్రకరణ్ రెడ్డి చెప్పాలి. శాసనసభలో కేసీఆర్ సీపీఐ, సీపీఎంల గొంతు నొక్కింది నిజం కాదా? ప్రజా బలం లేని ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం బీజేపీకి లేదు. మధ్యవర్తులు అవసరం లేదు.. పదవులకు రాజీనామా చేసి ఎవరైనా బీజేపీలో చేరొచ్చు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఇచ్చే స్తోమత బీజేపీకి లేదు. సొంత విమానాలు కొనే పార్టీ బీజేపీ కాదు. దొంగే దొంగ దొంగ అన్న చందంగా పోలీసుల తీరు ఉంది. దుబ్బాక బైపోల్స్ ముందు కూడా రఘునందనరావు బంధువుల ఇంట్లో పోలీసులే డబ్బులు పెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే పరిస్థితి లేదు. నవంబర్ 6న కేసీఆర్ తీసిన సినిమా రిజల్ట్ రాబోతోంది. ఈడీ, సీబీఐ పేరుతో సానుభూతి పొందాలని ప్రయత్నించిన టీఆర్‌ఎస్ విఫలమైంది. ప్రధాని మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలను తగలబెట్టడాన్ని ఖండిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.