TDP election manifesto in Mahanadu : భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మేనిఫెస్టో

0

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో నిర్వహించిన మహానాడు వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకోవడానికి ముందుంటామని టీడీపీ మహానాడు వేదికగా పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. ఇంతవరకు తన మంచితనాన్నే చూశారని, రాజకీయ రౌడీలకు శిక్ష వేసే బాధ్యత తనదన్నారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తామన్నారు. మహిళల కోసం ‘మహాశక్తి’ కార్యక్రమం తెస్తామని వెల్లడిరచారు. ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామన్నారు. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో పోటీకి పిల్లల నిబంధన ఎత్తివేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు.. ఇకపై ఆ నిబంధన రద్దు చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు చొప్పున ఇస్తాం. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు.

మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం. 

18 - 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ప్రతి మహిళకు పథకం వర్తింపు. ‘తల్లికి వందనం’ కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు. జిల్లా పరిధిలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇంటికే పరిమితమైన ఆడబిడ్డల ఆదాయం కల్పించే బాధ్యత నాది’’ అని చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు.

నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి

యువగళం నిధి కింద నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం. ఇంటింటికి మంచినీరు పథకం కింద ఉచితంగా నల్లా కనెక్షన్‌. ‘బీసీలకు రక్షణ’ చట్టం తెచ్చి అండగా నిలుస్తాం. పూర్‌ టూ రిచ్‌’ పథకం కింద పేదలను సంపన్నులను చేస్తాం’’ అని మేనిఫెస్టోని చంద్రబాబు వివరించారు.

ఉద్యోగులకు జీతాలు రావడం లేదు.

జగన్‌ ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నది టీడీపీ సిద్దాంతం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్‌ప్లాన్‌ తెచ్చాం. పేదల పక్షపాతి టీడీపీ. టీడీపీపై నమ్మకంతో రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు. 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నాలుగేళ్లలో జగన్‌ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో జాబ్‌ క్యాలెండర్‌ లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వైసీపీ నేతలది అహంకారంతో కూడిన పాలన. దళిత యువకుడిని చంపి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేశారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

జగన్‌ ఇక మళ్లీ గెలవడు.

మహానాడుకు ఇబ్బందులు పెట్టే చర్యలకు పాల్పడ్డారు. పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీవి చిల్లర రాజకీయాలు. ధరల బాదుడుతో పేదలపై భారం మోపుతున్నారు. జగన్‌ పేదల రక్తం తాగుతున్నారు. నకిలీ మద్యం, జేబ్రాండ్‌తో పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. జగన్‌, వైసీపీ నేతలు దోచుకున్న డబ్బును జప్తు చేస్తాం. ఆ డబ్బును పేదలకు పంచుతాం. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం. జగన్‌ అసమర్థతతో రాష్ట్రం అప్పులపాలైంది. నేను వేసిన ఫౌండేషన్‌ వల్లే ఇప్పుడు తెలంగాణకు భారీ ఆదాయం. జగన్‌ చేతకానితనం వల్ల పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. రాష్ట్రంలో డగ్స్‌, గంజాయి, మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలని ప్రజలు నమ్ముతున్నారు. జగన్‌ పనైపోయింది.. ఇక మళ్లీ ఇక రాడు.. రాలేడు. మళ్లీ టీడీపీ అవసరం వచ్చింది.. సమయం లేదు మిత్రమా’’ అని చంద్రబాబు గర్జించారు.

పథకాలైతే ప్రకటించారు, గెలిచాక షరతులు వర్తిస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల పాలైంది, మరో శ్రీలంక అవుతుంది అని లేనిపోని ప్రచారం చేసి చంద్రబాబు ఇప్పుడు ఈ పథకాలన్నింటికి డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారో చెప్పగలరా. ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలరా. గెలిచే వరకు ఇలాంటి హామీల వరద పారిస్తారు. గెలిచాక షరతులు పెడతారు అని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !