Sunitha Arguments in Supreme Court : వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలుసు - సునీత

0

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి  సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ సందర్భంగా సునీత స్వయంగా వాదనలు వినిపిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.

సునీత పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు..

‘‘తెలంగాణ హైకోర్టు అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇచ్చే సమయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. సీబీఐ సేకరించిన సాక్షాలను పరిగణలోకి తీసుకోలేదు. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన అంశాలకు విరుద్ధంగా అవినాష్‌ రెడ్డికి హత్య కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు అయింది. అవినాష్‌ రెడ్డి సీబీఐ దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదు. చివరిగా సీబీఐ విచారణకు రమ్మంటూ మూడుసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన హాజరు కాలేదు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యంతో ఉందనే కారణాలు చూపి అవినాష్‌ రెడ్డి హాస్పిటల్‌లో షెల్టర్‌ తీసుకున్నారు. సీబీఐ అరెస్టు చేయకుండా అవినాష్‌ రెడ్డి ఆయన మద్దతుదారులు, గూండాలు అడ్డుపడ్డారు. స్థానిక పోలీసుల సమక్షంలోనే అవినాష్‌ రెడ్డి ఘటన స్థలంలోని ఆధారాలు చెరిపేశారు. ఆధారాలు చెరిపేయటమే కాకుండా గుండెపోటుతో చనిపోయినట్లుగా కథను అల్లి ప్రచారం చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా చూశారు. సిట్టింగ్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న అవినాష్‌ రెడ్డి ఇతర నిందితులతో కలిసి.. రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకారంతో.. అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతుతో అదేపనిగా సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదులు చేయడమే కాకుండా కేసులు నమోదు చేయించారు.

సాక్షులను బెదిరిస్తున్నారు

తనకు సహకరిస్తున్న అధికార యంత్రాంగం అధికార పార్టీలోని కీలక వ్యక్తులు సహాయంతో సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరిస్తున్నారు. అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న సోదరుడు అవినాష్‌ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. వివేకానంద రెడ్డి హత్య బయట ప్రపంచానికి తెలియడానికి ముందే జగన్మోహన్‌ రెడ్డికి తెలుసని కూడా సీబీఐ పేర్కొంది. ఈ నెల 30వ తేదీ నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ఏ వన్‌ నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి డిఫాల్ట్‌ బెయిల్‌ను కూడా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. అంతేకాక దర్యాప్తు కొనసాగింపునకు కూడా అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. 

ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతున్నాం

గతంలో అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు మినీ ట్రయల్‌ని నిర్వహించడమే కాకుండా అవినాష్‌ రెడ్డి సహా ఇతర నిందితులు చేసిన వాదనలనే పరిగణలోకి తీసుకోనున్నట్లు కనబడుతోంది. సాక్ష్యులను బెదిరించడం ప్రభావితం చేస్తున్నారనే కారణంగా దర్యాప్తును తప్పుదోవ పట్టించటం.. సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టడం వంటి కారణాలతో కేసు విచారణను సుప్రీంకోర్టు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసింది. సీబీఐ దర్యాప్తు విచారణను ఏపీ నుంచి బదిలీ చేయడమే కాకుండా వివేక హత్య వెనక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని తేల్చాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మొత్తం పరిణామాల నేపథ్యంలోనే అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతున్నాం’’ అని సునీత పేర్కొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !