ఏపీలో అధికార వైసీపీ మంత్రులు తమ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకి వెళ్ళదని పదే పదే చెపుతున్నప్పటికీ, ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకే వెళ్ళబోతోందని టిడిపి, జనసేనలు నమ్ముతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ నుంచి వచ్చిన జనసేన నేతలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఏపీ కంటే ముందుగానే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున, పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా తెలంగాణలో పర్యటించాలని, పార్టీ అభ్యర్ధులను ఖరారు చేయాలని వారు కోరారు. అందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందిస్తూనే, తెలంగాణతో పాటే ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయని అందుకే ఏపీలో పర్యటన మొదలుపెట్టానని చెప్పారు. ఇక్కడ యాత్ర ముగించుకోగానే తెలంగాణలోయాత్ర మొదలుపెడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహరవీరమల్లు, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. వాటిలో బ్రో తప్ప మిగిలిన సినిమాలు షూటింగ్ వివిద దశలలో ఉన్నాయి. వాటన్నిటికీ బ్రేక్ ఇచ్చి ఈ పర్యటన ప్రారంభించారంటే, ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్‌కి ఖచ్చితమైన సమాచారం ఉందనుకోవచ్చు లేకుంటే ఆ సినిమాలు పూర్తిచేసిన తర్వాత యాత్రలు పెట్టుకొనేవారు కదా?
జేపీ నడ్డా, అమిత్ షా హడావుడి
ఏపీలో ముందస్తు ఎన్నికలు లేకపోతే జేపీ నడ్డా, అమిత్ షా ఇద్దరూ హడావుడిగా వచ్చి సభలు నిర్వహించటం వెనుక కారణం కూడా ముందుస్తు ఎన్నికలే అన్ని స్పష్టం అవుతుంది. అంటే జగన్ చూఛాయగా తన అభిప్రాయాన్ని కేంద్ర పెద్దలకు తెలిపి ఉండవచ్చు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సడెన్ డెసిషన్ తీసుకుని విపక్షాలకు తేరుకోనివ్వకుండా చేయటమే వైసీపీ ప్లాన్‌గా తెలుస్తోంది. టిడిపితో పొత్తుల విషయం తేల్చేందుకు వారు చంద్రబాబు నాయుడుని ఢల్లీికి ఆహ్వానించి చర్చలు జరిపారు. ఆ తర్వాతే జేపీ నడ్డా, అమిత్ షా ఇద్దరూ వచ్చి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడటం ముందస్తు కోసమే అని భావించవచ్చు.
ఆగస్ట్‌లోగా ఎన్నికల కమీషన్‌కు తెలియజేయాలి
ఇక తెలంగాణ సిఎం కేసీఆర్ గత ఎన్నికలలో ముందస్తుకి వెళ్ళడం ద్వారా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను వేరు చేయగలిగారు. తద్వారా ఆయన శాసనసభ ఎన్నికలపై పూర్తిగా దృష్టిపెట్టి విజయం సాధించగలిగారు. శాసనసభ ఎన్నికలలో గెలిస్తే లోక్‌సభ ఎన్నికలలో కూడా గెలిచే అవకాశాలు పెరుగుతాయి. కనుక కేసీఆర్ ఫార్ములానే జగన్ కూడా ఫాలో అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశా అందుకే ఇప్పుడు ‘బటన్ నొక్కుడు’ సభలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారనుకోవచ్చు. ఒకవేళ జగన్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్ళదలిస్తే ఆగస్ట్‌లోగా ఆ విషయం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు తెలంగాణ ఎన్నికలతో పాటు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. కనుక జగన్ ప్రభుత్వం ముందస్తుకు వెళుతుందో లేదో ఆగస్ట్ నాటికి తేలిపోవచ్చు.