దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న NEET UG-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఇద్దరూ 720/720 మార్కులు సాధించి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 720 మార్క్‌లతో ఇరువురికీ సంయుక్తంగా ఫస్ట్ ర్యాంక్ దక్కింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి రెండో ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. NEET కు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు NTA తెలిపింది. ఈ ఏడాది నీట్‌కు దేశ వ్యాప్తంగా మొత్తం 11,45,976మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులు ఉన్నారు.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో మే 7న నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ప్రిలిమినరీ ఆన్షర్ కీని విడుదల చేసిన NTA. దీనిపై జూన్ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న NTA అధికారులు తాజాగా తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.