అవినీతిని ప్రశ్నించినందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. ప్రభుత్వ తప్పులు బయటపెట్టి.. ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెట్టారు. 28 రోజులుగా రిమాండ్‌లో పెట్టారు. స్కిల్ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతి అని చెప్పారు. అనంతరం రూ.300 కోట్లు అని ఆరోపించారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్‌కు పంపారు.’’ అని అన్నారు.
కొవ్వొత్తులతో నిరసన
న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ, తమ వైపే ఉంటుందని లోకేశ్ అన్నారు. ‘‘ చంద్రబాబు ఏనాడూ తప్పు చేయరు. రిమాండ్‌లో ఉంచినా ఆయన అధైర్య పడలేదు. పోరాటం ఆపవద్దు.. శాంతియుతంగా పోరాడాలని మాతో చెప్పారు. న్యాయం గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. న్యాయపోరాటం కొనసాగిస్తాం. శనివారం రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్‌లైట్లతో సంఫీుభావం తెలపాలి. మా కుటుంబం మొత్తాన్ని వైకాపా ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చింది. మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాడుతాం.’’ అని లోకేశ్ తెలిపారు. దిల్లీలో రాష్ట్రపతిని, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి పరిస్థితి వివరించామన్నారు. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదని ఇతర పార్టీల నేతలు చెప్పారని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తనకు భరోసా ఇచ్చారని లోకేశ్ చెప్పారు. కక్ష సాధింపు ధోరణి వల్ల పక్క రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వెళ్తున్నాయని విమర్శించారు.
చంద్రబాబు భద్రతపై ఆందోళన
చంద్రబాబు భద్రతపై ఆందోళన ఉందని లోకేశ్ మీడియాకు తెలిపారు. ‘‘ రాజమహేంద్రవరం జైలుపై దాడి చేస్తామని కొందరు లేఖ రాశారు. కొందరు జైలుపై నుంచి డ్రోన్ ఎగరేశారు. ఆ జైలులో కొందరు నక్సల్స్, గంజాయి అమ్మేవారు ఖైదీలుగా ఉన్నారు.’’ అని లోకేశ్ అన్నారు. తెదేపా- జనసేన కలిసి సంయుక్తంగా కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ సూచనలతో ముందుకెళ్తామని చెప్పారు. ‘‘ తెదేపా పోరాటం ఆగలేదు. 175 స్థానాల్లో నిరసన చేస్తాం. గడప గడపకు ‘బాబుతో నేను’ కార్యక్రమాన్ని చేపడతాం. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని గడపగడపకు వివరిస్తాం. పాదయాత్ర, ఇతర కార్యక్రమాలపై చర్చించి నిర్ణయిస్తాం.’’ అని లోకేశ్ తెలిపారు.