ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును ప్రస్తావిస్తూ.. ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, పీఎం మోడీని టార్గెట్ చేశారు. భారత్ గెలవకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని దుయ్యబట్టారు. జలోర్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో మాట్లాడిన రాహుల్ గాంధీ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి పనౌతి (చెడుశకునం) వచ్చాడు, దీంతో భారత్ గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోయింది. టీవీలో దీనిని చూపించదరు, కానీ దేశ ప్రజలకు తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ ఒక ‘‘చెడు శకునం’’ గా అభివర్ణించారు. నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ని అధికారం నుంచి దించాలని బీజేపీ, మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధానంగా కులగణన హమీని ఇస్తుంటే.. బీజేపీ రాజస్థాన్‌లో మహిళలపై అత్యాచారాలను అడ్డుకుంటామని, కాంగ్రెస్ అవినీతిని బయటపెడతామని ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.