Rajadhani Files Review: ‘రాజధాని ఫైల్స్‌’.. సినిమా రివ్యూ

0


రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే తమ పంట పొలాల్ని నిస్వార్థంగా ఇస్తే ఆ రైతులకి కన్నీళ్లే ఎదురయ్యాయి. దీంతో పోరుబాట పట్టారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో ‘రాజధాని ఫైల్స్‌’ తెరకెక్కింది. ఈ చిత్రం ఎలా ఉందంటే? రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని కోసం మూడు పంటలు పండే తమ పంట పొలాల్ని నిస్వార్థంగా ఇస్తే ఆ రైతులకు కన్నీళ్లే ఎదురయ్యాయి. ఊళ్లు బాగుపడతాయని... భావి తరాల భవిష్యత్తు బాగుంటుందని... కళ్ల ముందు రాజధాని కలల సౌధాలు సాకారమవుతుంటే చూడాలనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. బిడ్డని పొదిగే గర్భంలో గొడ్డలి దించిన కర్కశత్వంలా ఒక్కరి అహం కోట్ల మంది కలల్ని... వేల మంది రైతుల జీవితాల్ని కాలరాసినట్లయింది. దీంతో రైతులు ఉద్యమబాట పట్టారు. న్యాయస్థానాలు మొదలుకొని దేవస్థానాల వరకూ వెళ్లి వాళ్ల ఆక్రందనను బయట పెట్టారు. ఇప్పటికీ సాగుతున్న ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ‘రాజధాని ఫైల్స్‌’ చిత్రం తెరకెక్కింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.

కథేంటంటే?

అరుణప్రదేశ్‌ రాష్ట్రంలో కత్తి గుర్తు కె.ఆర్‌.ఎస్‌ పార్టీ ఎన్నికల్లో గెలిచాక నిర్మాణ దశలో ఉన్న అయిరావతిపై కత్తి కడుతుంది. ఎవరో కన్నబిడ్డకి మీరు తండ్రిగా ఉండటమేంటి అంటూ తన రాజకీయ వ్యూహకర్త చెప్పిన మాట విని ముఖ్యమంత్రి అధికార వికేంద్రీకరణ అంటూ నాలుగు రాజధానుల పల్లవి అందుకుంటాడు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిరావతి నిర్మాణాన్ని సమ్మతించిన అదే వ్యక్తి, అధికారంలోకి రాగానే మాట మార్చడంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన బాట పడతారు. తన అధికార బలంతో ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతాడు. ముఖ్యమంత్రికి మరో ఇద్దరు ఎంపీలు తోడై  రైతుల మానప్రాణాలతో చెలగాటమాడతారు. ఎంతోమంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతారు. అయినా ధైర్యం కోల్పోని రైతులు ఉద్యమాన్ని కొనసాగించినా ముఖ్యమంత్రి దిగిరాకపోవడంతో అరుణప్రదేశ్‌లోని తెలుగు ప్రజలు ఏం చేశారు?  ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పేందుకు ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?  రైతులకు ప్రతినిధులుగా ఉన్న ఓ కుటుంబం (వినోద్‌కుమార్‌, వాణీ విశ్వనాథ్‌, అఖిలన్‌)  ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

అహంతో అభివృద్ధికి సమాధి కడితే ప్రజల ఆగ్రహ జ్వాలలకు ఆహుతి కాక తప్పదని రాజకీయ  నాయకుల్ని హెచ్చరించే  చిత్రమిది. రాజధాని పరిధి వెలగగూడెంలోని పచ్చని పంట పొలాలు, వాటితో రైతులకు తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ కథను మొదలుపెట్టాడు దర్శకుడు. రాష్ట్ర అభివృద్ధి, తమ ప్రాంత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం,  రాజధాని నిర్మాణం కోసం పవిత్ర జలాలతో భూమి పూజ చేయడం నుంచి కథ ఊపందుకుంటుంది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం వచ్చాక పరిణామాలు మారిపోతాయి. తనని తాను నమ్ముకోని ముఖ్యమంత్రి రాష్ట్రంతో సంబంధం లేని తన రాజకీయ వ్యూహకర్త, రౌడీల్లా వ్యవహరించే తనకు సన్నిహితమైన ఇద్దరు ఎంపీలు చెప్పినట్టుగానే స్వార్థ పూరిత నిర్ణయాలు తీసుకోవడం.. ప్రశ్నించేవాళ్ల గొంతుల్ని నొక్కేయడం వంటి పరిణామాలు వాస్తవ పరిస్థితుల్ని కళ్లకు కడతాయి. భూములిచ్చిన రైతుల శాంతియుత పోరాటంపై తన అధికార బలాన్ని ప్రదర్శించే తీరు, ఆ క్రమంలో మహిళలంతా మరింత చైతన్యవంతమై  ఉద్యమంలో అలుపెరగకుండా పోరాటం చేసే క్రమం ఆసక్తికరంగా సాగుతుంది.  తమ ఆక్రందనని పాలకులు పట్టించుకోకపోవడం, ఆఖరికి తమ గళాన్ని కూడా బయటకు వినిపించకుండా అడ్డుకునే తీరు, దాంతో రైతులు ఉద్యమంలో ప్రాణాల్ని కోల్పోవడం వంటి సన్నివేశాలు హృదయాల్ని మెలిపెడతాయి. తెరపై కనిపించే ప్రతీ పాత్ర, ప్రతీ సన్నివేశంతో ప్రేక్షకుడు కనెక్ట్‌ అవుతాడు. రైతుల ఆవేదనలో ఎంత నిజాయతీ ఉందో మరింత బాగా అర్థమయ్యేలా దర్శకుడు సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు. ద్వితీయార్థంలో మరో దఫా ఓట్లు దండుకుని అధికారాన్నిచేజిక్కించుకోవడం కోసం రాజధాని ప్రాంత భూముల్ని పేదలకి పంచేందుకు ఎత్తుగడ వేయడం,  అయిరావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చడం వంటి సన్నివేశాలు కీలకం. కష్టపడమని చెబితే ఎవడైనా ఇష్టపడతాడా, వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి అంటూ అభివృద్ధిని పక్కనపెట్టి ముఖ్యమంత్రి వేసే పథకాల ఎత్తుగడ, ప్రజల్ని చైతన్యవంతం చేస్తారనే భయంతో ఉపాధ్యాయుల్ని పక్కనపెట్టాలని నిర్ణయించుకునే తీరు ఇవన్నీ ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. ఇవన్నీ ఒకెత్తైతే, పతాక సన్నివేశాలు మరో ఎత్తు.  ఓటరు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూనే తీసుకున్న స్ఫూర్తిదాయకమైన నిర్ణయం సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. గొడ్డలితో వేటు వేసి గుండెపోటు వచ్చిందని ప్రచారం చేయండంటూ ముఖ్యమంత్రి చెప్పడంతో సినిమా ముగుస్తుంది.  ఓ సామాన్యుడు అసెంబ్లీలోకి వెళ్లి మాట్లాడటం, ముఖ్యమంత్రే తమ దగ్గరికి  వచ్చేలా  చేయడం వంటి ఫిక్షనైజ్డ్‌గా సన్నివేశాలు ఎక్కువ సినిమాటిక్‌ లిబర్టీని తీసుకుని తెరకెక్కించినట్టు అనిపిస్తుంది.  

ఎవరెలా చేశారంటే?

ఈ సినిమాలో పాత్రలే తప్ప నటులు కనిపించరు. రైతు ప్రతినిధులుగా, దంపతులుగా వినోద్‌కుమార్‌, వాణీ విశ్వనాథ్‌ చక్కటి అభినయం ప్రదర్శించారు. వారి తనయుడుగా అఖిలన్‌ నటించాడు. ఏఐ టెక్నాలజీలో ఉన్నత చదువులు చదివిన ఇంజినీర్‌గా అతని పాత్ర, నటన ద్వితీయార్థానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రాజధాని కోసం భూములిచ్చిన పలువురు రైతులు ఇందులో కీలక పాత్రల్లో కనిపిస్తారు. ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కనిపించిన నటులు నిజ జీవిత వ్యక్తుల్ని గుర్తు చేస్తూ ఆ పాత్రల్లో మంచి అభినయం ప్రదర్శించారు. సాంకేతిక విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. కెమెరా, సంగీతం, కూర్పు అన్నీ బాగా కుదిరాయి. మాటలు సినిమాకి ప్రధానబలం. ఒడిలో పిల్లల్ని జో కొట్టే మహిళ... ఉద్యమంలోకి వచ్చి జై కొట్టిందంటే ప్రళయమే, మన పంటకి నీరు ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం,  దేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణ అరుణప్రదేశ్‌ భవతీ భిక్షాందేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులు అడుక్కునే స్థాయికి దిగజారిపోయింది.. తదితర సంభాషణలు సినిమాకు బలాన్నిచ్చాయి. దర్శకుడు భాను వాస్తవ సంఘటనల్ని డాక్యుమెంటరీలా కాకుండా..  వాణిజ్యాంశాల్ని జోడిరచి తెరపైకి తీసుకొచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !