Telangana : తెలంగాణలో పొలిటికల్‌ మైండ్‌గేమ్‌ !

0

తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు అంతా సీఎం రేవంత్‌ రెడ్డి తన భుజాల మీద వేసుకుని 10-12 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీకి మళ్లీ మోదీ ఛరిష్మానే నమ్ముకుంది. ఇక గులాబీ పార్టీ గుభాళింపు కోసం మాజీ సీఎం ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ రంగంలోకి దిగారు.  ఈ మూడు పార్టీలు తమ తమ బలాబలాలను సమీకరించుకుని 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలవడానికి కృషి చేస్తున్నాయి. దీని కోసం అన్ని పార్టీలు మైండ్‌ గేమ్‌ స్టార్ట్‌ చేశాయి. గెలుపు తమదేనంటూనే... ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలుతుందని ఓ పార్టీ అంటే, మరో పార్టీ ఈ ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు ఉనికి కోల్పోతాయని జోస్యం చెబుతోంది. అయితే ఈ మూడు పార్టీలు తమదైన శైలిలో మానసిక యుద్ధానికి తెర లేపాయి. ఇందులో  ఏ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు సాగుతుందో ఇప్పుడు చూద్దాం.

రెండంకెల సీట్లే లక్ష్యంగా...కాంగ్రెస్‌ !

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాలు గెల్చుకోగా, మిత్రపక్షం సీపీఐ ఒక స్థానంలో గెలిచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా ఉత్తర, దక్షిణ తెలంగాణలో మెజార్టీ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఈ లెక్కన దాదాపు 12 సీట్ల వరకు తాము గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలు,  రాహుల్‌ గాంధీ పాదయాత్ర, బీజేపీ వ్యతిరేక గాలి తమకు కలిసి వస్తుందన్నది హస్తం పార్టీ అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లో చెక్‌ పెట్టిన బీఆర్‌ఎస్‌ మళ్లీ కోలుకోకుండా ఉండేందుకు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టింది. సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ సాగుతోంది. తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే తప్ప బీఆర్‌ఎస్‌ కాదని నేతలు చెబుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత  బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అవుతుందని, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కారు దిగడం ఖాయమని చెబుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ లో నలుగురు మాత్రమే ఉంటారని, మిగతా వారంతా బయటకు రావడం ఖాయమని గులాబీ నేతలను మానసికంగా కృంగదీసే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా, కోమటి రెడ్డి వంటి మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలతో  మైండ్‌ గేమ్‌ లో దిగారు.

బీజేపీ ‘ దశ ‘ తిరగనుందా.. 

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 4 స్థానాల్లో మాత్రమే కమలం పార్టీ విజయం సాధించింది. ఈ దఫా దశ తిరిగి పది స్థానాలకుపైగా తెలంగాణలో దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే బీజేపీ నుంచి గెలిచారు. కాని 4 ఎంపీ స్థానాల్లో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌లలో గెలిచి బీజేపీ సంచలనం సృష్టించింది.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లతో ఒక్క స్థానం గెలిచిన బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం ఓట్లతో 8 స్థానాలు గెల్చుకుంది. అంతే కాకుండా దాదాపు 19 స్థానాల్లో రెండో స్థానంలో బీజేపీ నిలబడటం విశేషం . ఇందులో ఎక్కువ గ్రేటర్‌ హైదరాబాద్‌ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో తప్పనిసరిగా 10 స్థానాల వరకు గెలుస్తామని కమలం నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కూడా ఆపరేషన్‌ ఆకర్ష్‌ స్టార్‌ చేసి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. కొందరికి టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో  బీజేపీ మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని అల్టిమేటం జారీ చేయడం విశేషం. తమ పార్టీ గేట్‌ ఓపెన్‌ చేస్తే 48 గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెబుతున్నారు. బొటా బోటి మెజార్టీతో ఉన్న కాంగ్రెస్‌, ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుకున్న స్థానాల్లో గెలవకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమేనని కమలం నేతలు తమ అంతర్గత సంభాషణల్లోను చెబుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందా.. ఊడుతుందా అంటూ...పొలిటికల్‌ మైండ్‌ గేమ్‌తో అధికార కాంగ్రెస్‌ను  డిఫెన్స్‌లోకి నెట్టేందుకు కమలం నేతలు సన్సేషనల్‌ కామెంట్స్‌  చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ విజయానికి కేసీఆర్‌ తనదైన శైలిలో..

అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా  బీఆర్‌ఎస్‌ చతికిలబడటం, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న ప్రచారం, ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లడం, ముఖ్యనేతలు అనుకున్న వారంతా కారు దిగి హస్తం పార్టీలోకో, బీజేపీ గూటికో చేరడం వంటి పరిణామాలతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీంతో పార్టీ క్యాడర్లో జోష్‌ నింపేందుకు కేసీఆర్‌ రంగంలోకి దిగారు. రైతుల పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ అని  చెప్పేందుకు జిల్లా యాత్రలు చేపట్టారు. రైతులను పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీతోనే రైతులకు లాభం జరుగుతుందని యాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. 39 అసెంబ్లీ స్థానాలు గెలవడంతో ఈ దఫా పార్లమెంట్‌ ఎన్నికల్లో  కూడా 1 లేదా రెండు స్థానాల్లోనే గెలుస్తుందని సర్వేలు చెప్పడంతో కారు క్యాడర్‌లో నిరూత్సాహం ఆవహించింది. దాన్ని పొగొట్టే ప్రయత్నంలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో గందర గోళ రాజకీయాలు ఉంటాయని చెబుతున్నారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలే సూచనలు ఉన్నట్లు చెపుతున్నారు. 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే తన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ చేసిందని, 64 స్థానాలున్న కాంగ్రెస్‌ ను కూల్చడం పెద్ద కష్టం కాదని కేసీఆర్‌ సూత్రీకరిస్తున్నారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు లాంటి నేతలు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుందని, రేవంత్‌ రెడ్డి పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పార్టీ క్యాడర్‌ ను , లీడర్లను కాపాడుకోవడంతో పాటు ఈ ఎన్నికల్లో గరిష్ట ఎంపీ స్థానాలు గెల్చుకునే వ్యూహంతోనే బీఆర్‌ఎస్‌ నేతలు ఈ మైండ్‌ గేమ్‌ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్‌ కూలుతుందా....

ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి అస్త్రాలనైనా ఉపయోగించేందుకు రాజకీయ పార్టీలు వెనుకాడవు. అయితే కాంగ్రెస్‌ పార్టీ కూలుతుందని బీజేపీ-బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పడం రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మైత్రికి ఇదేమైనా నాందియా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బీజేపీకి ప్రధాన శత్రువు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ మాత్రమే. బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ అయినా దాని ప్రభావం జాతీయ రాజకీయాల్లో  ఏ మాత్రం లేదు. కాబట్టి  దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కన్నా ప్రాంతీయ పార్టీలు ఉంటేనే  బీజేపీకి లాభం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు- మిత్రులు ఉండరన్న నానుడి బీజేపీ- బీఆర్‌ఎస్‌కు వర్తిస్తుంది. అదే రీతిలో శత్రువు-శత్రువు మిత్రువు అన్న నానుడి కూడా ఈ రెండు పార్టీలకు వర్తిస్తుంది. ఎందుకంటే.. జాతీయ స్థాయిలో బీజేపీకి శత్రువు కాంగ్రెస్‌, రాష్ట్ర స్థాయిలో బీఆర్‌ఎస్‌ కు శత్రువు కాంగ్రెస్‌. ఈ సూత్రం ప్రకారం... బీజేపీ- బీఆర్‌ఎస్‌ లు రానున్న రోజుల్లో అంటే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ను గద్దె దింపే ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీనే అటు బీఆర్‌ఎస్‌,బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని కౌంటర్‌ ఎటాక్‌ చేస్తుందా... లేక కమలం, గులాబీ పార్టీలు కలిసి తెలంగాణలో కాంగ్రెస్‌ కు చెక్‌ పెడతాయా అన్నది మాత్రం వేచిచూడాల్సిందే. ఏది ఏమైనా. అన్ని పార్టీలు తమదైన శైలిలో మైండ్‌ గేమ్‌ స్టార్ట్‌ చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ గేమ్‌ లో ఎవరు విన్‌ అవుతారో పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతే తేలనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !