నిషేదిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈడీ కేసు నమోదు చేసింది. కేసు నమోదైన వారిలో.. ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, విజయదేవర కొండ, శ్రీముఖి, రానా, మంచు లక్ష్మీ, అనన్యా నాగళ్ల, సిరి హనుమంతు, వర్షిణి సౌందరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, బండారు శేషయాని సుప్రీతలు ఉన్నారు. వీరిలో కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఉన్నారు. బీఎన్‌ఎస్‌లోని 318(4), 112, రెడ్‌విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని 3, 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008 లోని 66డి సెక్షన్ల క్రింద ఈ కేసు నమోదైంది. హైద్రాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది.
మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు
చట్టవిరుద్దమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు గాను వారు భారీ కమీషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యాప్ ప్రమోషన్‌కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్‌లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ యాప్‌ల కారణంగా పలువురు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోగా, పలు కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఫణీంద్ర శర్మ ఫిర్యాదుతో
మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త పి.ఎం. ఫణీంద్ర శర్మ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ప్రత్యేకించి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో, ఈ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు.. అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని ఫణీంద్ర శర్మ తన కంప్లైంట్‌లో ఆరోపించారు. ఈ యాప్‌ల ద్వారా వేల కోట్ల రూపాయలు చలామణి అవుతున్నాయనీ, మధ్యతరగతి. దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక నష్టాల్ని ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఈ యాప్‌లు సులభంగా డబ్బు సంపాదించే ఆశతో ప్రజలను ఆకర్షిస్తూ, వారిని జూద వ్యసనంలోకి లాగుతున్నాయని కంప్లైంట్‌లో పేర్కొన్నారు.