iBomma : పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చిన ఓటీటీ పైరసీ వెబ్‌సైట్‌ !

0

తెలుగు సినిమా నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పైరసీ వెబ్‌సైట్‌ ఐ బొమ్మ వ్యవహారం (iBomma) మళ్ళీ వార్తల్లో నిలిచింది. కొత్తగా విడుదలైన సినిమా థియేటర్‌లో అడుగుపెట్టగానే క్షణాల్లో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం, కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా విడుదల కాని సినిమాలు కూడా లీక్‌ కావడం పరిశ్రమను కుదిపేస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్‌ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్‌ పోలీసులకే(Hyderabad Police) సవాల్‌ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్‌ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది. 

వదిలిపెట్టేది లేదు 

ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్‌సైట్లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. పైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు రూ.3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు.  ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..

పోలీసులకే వార్నింగ్‌

ఐబొమ్మ తన వైబ్‌సైట్‌లో ఒక నోట్‌ని విడుదల చేసింది. వైరల్‌ అవుతున్న ఆ నోట్‌ యధాతథంగా ఇలా ఉంది..  ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్‌ చేస్తే మేము ఎక్కడ ఫోకస్‌ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రింట్స్‌ అమ్మిన తరువాత మీరు ఏమి పట్టనట్టు కెమెరా ప్రింట్స్‌ (మూవీ రూల్స్‌ వెబ్‌సైట్‌ ) తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్‌ పెట్టారు.

1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్‌ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...

2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఏమి అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్‌ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్‌కి వస్తాయా ?

3) సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్‌ మరియు విదేశాలలో షూటింగ్‌ లకు మరియు ట్రిప్స్‌ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్‌ బాయ్స్‌ నుంచి లైట్‌ బాయ్స్‌ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్‌ చేస్తే బడ్జెట్‌ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా ?

4) అనవసర బడ్జెట్‌ పెట్టి ఆ బడ్జెట్‌ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్‌ అండ్‌ థియేటర్‌ ఓనర్స్‌ ఆ అమౌంట్‌ ని కలెక్ట్‌ చేసుకోవటానికి టికెట్‌ అమౌంట్‌ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు. మా వెబ్సైటు మీద ఫోకస్‌ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్‌ చేయాల్సి వస్తుంది.

ఫస్ట్‌ వేరే కెమెరా ప్రింట్స్‌ (మూవీ రూల్స్‌ వెబ్‌సైట్‌ ) రిలీజ్‌ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్‌ నుంచి ఈ -సిగిరెట్‌ కు యూజర్స్‌ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌ కి నా రియాక్షన్‌ ఉంటుంది.

ఈ మిడిల్‌ లో - వేరే ఏ హీరో కూడా (Example : Vijay) టార్గెట్‌ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్‌ డిలీట్‌ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్‌ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..

ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్‌ చేసి టెక్నాలజీ షేర్‌ చేయాలని కోరాము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్‌ చేయటం లేదు. మేము iBomma.net  వాళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.

మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.

(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose)

ఈ పరిణామాలను గమనిస్తే.. 

ఎంతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని ఉపయోగించి తెలంగాణ పోలీస్‌ సైబర్‌ నేరస్థుల ఆట కట్టించి పేరు గడిస్తూ ది బెస్ట్‌ పోలీస్‌ అని పేరు తెచ్చుకుంటుంటే .. ఇప్పుడు ఐ బొమ్మ వాళ్లనే ఎదురిస్తూ కొత్త సవాల్లను విసురుతుంది.సీవీ ఆనంద్‌ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్‌ హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్‌ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.  ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్‌ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !