- మరణానికి ముందే ఏర్పాట్లు చేసుకున్న యువకుడు
- ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆస్ట్రేలియాలో మృతి
- ఖమ్మంలో అంతిమ సంస్కారాలు పూర్తి
అతనిది శ్రీమంతుల కుటుంబం..! ఏ చీకూచింతా లేకుండా చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగాడు..! చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడు. హైదరాబాద్‌లో బీ-ఫార్మసీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అస్ట్రేలియా వెళ్లి, అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డాడు. తిరిగి స్వస్థలానికి వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వచ్చిన తర్వాత తీసుకువెళ్తానని భార్యకు చెప్పి వెళ్లిన యువకుడు...ఊహించని రీతిలో క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రాణాంతక వ్యాధి సోకినా హర్షవర్థన్ ఏ మాత్రం భయపడలేదు. అంతకు మించి కుంగిపోలేదు. తాను చనిపోతానని తెలిసినా మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాలనుకున్నాడు. అమ్మా..నాన్నా...నేను చనిపోతున్నా. మీరు ధైర్యంగా ఉండండి అని వారిని ఓదార్చాడు. తన మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి ఇంటికి తరలించేందుకు తనే ఏర్పాట్లు చేసుకున్నాడు. నమ్మలేకున్నా..కళ్లు చెమ్మగిల్లే వాస్తవమిది. చివరకు అనారోగ్యంతో ఆయన కన్నుమూయగా.. ఖమ్మంలో బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకింది..
ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి, తల్లి ప్రమీల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్ (33), రెండో కుమారుడు అఖిల్. హర్షవర్ధన్ బీ-ఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. బ్రిస్బేన్‌లోని యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్‌మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు. క్వీన్స్‌ల్యాండ్ నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డాక్టర్‌గా చేరాడు. 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వచ్చిన తరువాత భార్యను తీసుకెళ్తానని చెప్పి... అదే నెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు. అదే ఏడాది అక్టోబరు నెలలో వ్యాయామం చేస్తుండగా దగ్గుతోపాటు ఆయాసం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వచ్చేయమని తల్లిదండ్రులు కోరగా.. ‘ఇక్కడే మంచి చికిత్స లభిస్తుంది. మీరేం కంగారు పడకండి’ అని వారికి నచ్చజెప్పాడు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు...
క్యాన్సర్ సోకింది.. నయమయ్యే పరిస్థితి లేదు.. ఇక చావు తప్పదని తెలిసిన ఆ యువకుడు ముందుగా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమె జీవితంలో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. తొలుత క్యాన్సర్‌కు చికిత్స తీసుకోగా.. నయమైందని వైద్యులు తెలిపారు. 2022 సెప్టెంబరులో ఖమ్మం వచ్చి 15 రోజులు గడిపి వెళ్లారు. తర్వాత వ్యాధి తిరగబెట్టింది. ఈసారి చికిత్సకు వ్యాధి లొంగదని, మరణం తప్పదని వైద్యులు నిర్ధారించారు. హర్షవర్ధన్ భయపడలేదు. విషయం బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. తను మరణించాక మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ దేశ చట్టాలకు అనుగుణంగా అనుమతులు తీసుకునేందుకు ఒక లాయర్‌ను పెట్టుకున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో చివరి రోజుల్లో తరచూ బంధువులకు వీడియోకాల్ చేసి మాట్లాడేవాడు. కొందరు స్నేహితులను ఇంటికి కూడా పిలిపించుకున్నాడు. మార్చి 24న కన్నుమూశాడు.
నగరంలో తుది వీడ్కోలు...
హర్షవర్ధన్ మృతదేహం బుధవారం ఉదయం ఖమ్మంలోని అతని ఇంటికి చేరింది. తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతా బాగుంటే మే 21న హర్షవర్ధన్ ఇండియా రావాల్సి ఉంది. ఆ నెలలో తమ్ముడు అఖిల్ వివాహం ఉంది. అందరూ సంతోషంగా గడపవచ్చు అనుకున్నారు. కానీ ఇంతలోనే కుమారుడు విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.