Flexes-Chandrababu-corruption-And-Fraud-Amaravati : అమరావతి పర్యటనలో చంద్రబాబుకు నిరసన సెగ !

0

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నుంచి మూడు రోజులపాటు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అయితే చంద్రబాబు పర్యటనకు ముందు రోజే వైకాపా కార్యకర్తలు నిరసన కార్యక్రమాలకు తెరలేపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని, గతంలో ఇచ్చిన హామీలను, చేసిన మోసాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు సిగ్గు.. సిగ్గు.. అంటూ అమరావతి పట్టణం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. 

దళితులుగా పుట్టడం తప్పా.. 

చెప్పండి చంద్రబాబు, లోకేశ్‌బాబు.. మా జగనన్న సంక్షేమ పాల­నలో మేం దళితులుగా పుట్టినందుకు గర్విస్తున్నాం అని ప్లెక్లీలో పేర్కొన్నారు. రుణమాఫీ పేరుతో రైతుల గొంతు కోసిన నీ ప్రభుత్వం ఎక్కడ? పెట్టుబడి సాయం, పంట బీమాతో రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలుస్తున్న జగనన్న పాలన ఇక్కడ 600 హామీలతో అందుబాటులో లేని నీ మేనిఫెస్టో ఎక్కడ? నవరత్నాలతో 98 శాతం హామీలను అమలు చేసిన మా జగనన్న మేనిఫెస్టో  ఇక్కడ... డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి వారిని నిట్టనిలువునా ముంచిన నీ ప్రభుత్వం ఎక్కడ ? ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళాభ్యుదయానికై సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, వంటి పథకాలను అమలుచేస్తున్న మా జగనన్న ప్రభుత్వం ఇక్కడ... అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  విద్యార్థులకు సాయం, డ్వాక్రా మహిళలకు అందుతున్న చేయూత, రైతులు, వ్యాపారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు చంద్రబాబు పాలనలో జరిగిన మోసం, సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో కలుగుతున్న లబ్ధిని వివరిస్తూ కూడా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. వాస్తవాలను చాటుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను చూసి గత ప్రభుత్వంలో జరిగిన నష్టం, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. 

ఉద్రిక్త పరిస్థితులు

ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ కార్యకర్తలు అమరావతిలో ధర్నా చేపట్టారు. తెదేపా వారి బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్న అధికారులు వైకాపా వారు కట్టిన వాటిపై మిన్నకుండిపోతున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇరుపార్టీల వారితో చర్చించి పర్యటన సక్రమంగా జరిగేలా చూడాల్సి ఉంది. అయితే చంద్రబాబును వ్యతిరేకిస్తూ కట్టిన బ్యానర్లను తీయించడంలో జాప్యం చేస్తుండటంపై తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. ఎలాంటి అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడుకు వస్తున్న జనాదరణ చూసి వైకాపా నేతల్లో వణుకు పుడుతోందని అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ! 

పాత కాపుగా ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్‌ మరియు కొత్త నాయకుడు వట్టికుంట శేషగిరిరావు వర్గాల మధ్య విభేదాలు పొడచూపాయి. రెండు వర్గాల మధ్య ప్లెక్సీల విషయంలో వాదోపవాదాలు జరిగాయి. వట్టికుంట శేషగిరి రావు ప్లెక్సీలు తొలగించారు. ఎక్కడ చూసిన కొమ్మాలపాటి శ్రీధర్‌ ఫోటోలు కనిపించేలా గ్రామంలో నాయకులు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ చీలిక వైసీపీకి అనుకోని వరంగా మారే అవకాశం ఉంది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !