తెలంగాణ గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు గవర్నర్. ఈ ఇద్దరు అభ్యర్థులు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎంపిక చేయటానికి అర్హతలు అడ్డొస్తున్నాయంటూ.. ఎంపిక ప్రక్రియను పక్కన పెట్టారు గవర్నర్ తమిళి సై. అయితే కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను మంత్రి మండలి సిఫార్సు చేసింది.
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేదు
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎంపిక చేయడానికి సరైన సమాచారం లేదన్నారు గవర్నర్. ఆర్టికల్ 171(5) ప్రకారం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యానారాయణ ఎంపిక జరగలేదని.. వీళ్లిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు.. సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదంటూ గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెప్తోందని గవర్నర్ పేర్కొన్నారు.