Chandrababu : గెలిచే అవకాశం ఉన్న నాయకులకే సీట్లు !

0

రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అవసరం ఎంతో ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ. ‘‘గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తాను. అంతర్గతంగా చేయించే సర్వేల్లో నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదు. ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతా తప్ప పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఓట్ల అవకతవకల విషయాన్ని ఇన్‌ఛార్జ్‌లు బాధ్యతగా తీసుకోవాలి. అన్నీ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందనే అలసత్వం వద్దు’’ అని పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరించారు. అనంతరం గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయిన అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గేటు కొట్టుకుపోయిందని నేతలు ఆరోపించారు. ఉదయమే సంఘటనాస్థలానికి వెళ్లి.. వారు చేసిన క్షేత్రస్థాయి పరిశీలనను చంద్రబాబుకు నేతలు వివరించారు.

జనసేనతో కలిసి పనిచేద్దాం

ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం - జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని జనసైనికులకు చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేస్తూ జగన్‌ను ఇంటికి సాగనంపుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలోనూ కలసి పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలుగుదేశం - జనసేన నిర్వహించే కార్యక్రమాల్లో నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు వారితో అన్నారు. 

గేట్లు కాపాడుకోలేని దుస్థితి 

సీఎం జగన్‌ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా, ఉన్న వాటి నిర్వహణనీ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో.. గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందని లోకేష్‌ ఆరోపించారు. గతేడాది గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయిందని.. నీరు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టుల నిర్వహణను జగన్‌ గాలికొదిలేశారని టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్‌ సోమరితనంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఊడి నీరు వృథాగా పోతోందని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు రాకుండా తమపై నిందలా అంటూ మండిపడ్డారు. టీఎంసీ - క్యూసెక్కుకు తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల దగ్గర ఆందోళనలు చేపడతామని అచ్చెన్న హెచ్చరించారు. మరోవైపు, గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద విరిగిన రెండో గేటును టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, స్వామి, టీడీపీ విజయకుమార్‌ తదితరులు పరిశీలించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !