Loksabha : లోక్‌సభలో అగంతకుల కలకలం ! భద్రతా వైఫల్యమేనా ?

0

పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌సభలో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు ఆగంతుకులు గందరగోళం సృష్టించారు. ఒంటిగంట ప్రాంతంలో పబ్లిక్‌ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకారు. ఇద్దరు ఆగంతకులు కిందకు దూకగానే గ్యాస్‌ విడుదల చేసే వస్తువులను సభలోకి విసిరారు. ఆగంతకుల చర్యతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా సభ నుంచి బయటకు పరుగులు తీశారు. లోక్‌సభలోకి దూకిన వ్యక్తి.. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి ‘నల్ల చట్టాలను బంద్‌ చేయాలి’ అని నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో వెంటనే స్పీకర్‌ సభను వాయిదా వేశారు. 

భద్రతా వైఫల్యం

జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు, అదే సమయంలో పార్లమెంట్‌ బయట ఇద్దరు వ్యక్తులు స్మోక్‌ డబ్బాలతో నిరసనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీలు. జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనలో గ్యాస్‌​ విడుదల చేసే వస్తువులను దుండగులు తాము ధరించిన బూట్ల నుంచి తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆగంతకులు విసిరిన వస్తువుల నుంచి విడుదలైన పొగతో సభలో కలకలం రేగింది. కొంతమేర పొగ అలుముకుంది. కొందరు ఎంపీలు తెగువ ప్రదర్శించి గ్యాలరీ నుంచి దూకిన వ్యక్తులను చుట్టుముట్టారు. ఈలోపు అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బందికి ఆగంతకులను అప్పగించారు. బయటకు వచ్చిన ఎంపీలు- ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకినట్టు చెప్పారు. లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన వ్యక్తులు ఎవరు వారు సభలోకి ఎవరి అనుమతితో ప్రవేశించారనే అంశంపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన తీవ్రవాద వ్యతిరేక ప్రత్యేక సెల్‌ బృందం పార్లమెంట్‌​ వద్దకు చేరుకుంది. మరోవైపు పార్లమెంటు బయట నిరసన తెలుపుతున్న మరో ఇద్దరిని కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ మహిళను నీలమ్‌(42)గా, మరో వ్యక్తిని శిందే(25)గా గుర్తించారు. ట్రాన్స్‌​పోర్ట్‌ భవన్‌ ఎదుట వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ పోలీస్‌ స్టేషన్‌​కు తరలించారు.

దిల్లీ పోలీసులకు స్పీకర్‌ ఆదేశం!

ఘటనపై విచారణ కోసం దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని లోక్‌​సభ స్పీకర్‌ ఓంబిర్లా తెలిపారు. సభలో దుండగులు స్ప్రే చేసింది పొగ మాత్రమేనని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తిరిగి సమావేశం అయిన తర్వాత సభలో ఆయన మాట్లాడారు. ‘‘పార్లమెంట్‌ లోపల ఇద్దరు ఆగంతులను, బయట ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారికి సంబంధించిన వస్తువులన్నీ సీజ్‌ చేశారు. ఘటనపై ఎంపీల ఆందోళనలన్నీ వింటాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సభ కార్యకలాపాలు జరిగేలా చూడటం మన ఉమ్మడి బాధ్యత’’ అని స్పీకర్‌ పేర్కొన్నారు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడిరది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు దిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్‌ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !