Hyd CP సంచలనం...పంజాగుట్ట పీఎస్‌ సిబ్బంది మొత్తం బదిలీ !

0

హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సైల నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఒకేసారి బదిలీ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 85 మందిని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు ప్రధాన కార్యాయలంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కేసుల్లో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలు బయటకి పొక్కడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పీఎస్‌కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు.

అత్యధిక క్రైంరేట్‌ నమోదు 

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనే అత్యంత వివాదాస్పదమైన పోలీస్‌ స్టేషన్‌గా పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ గురించి చెబుతుంటారు. అత్యధిక ఎఫ్‌ఐఆర్‌ రేటు నమోదవుతున్న పోలీస్‌స్టేషన్‌ ఇదే కావటం గమనార్హం. మొత్తం అయిదు సెక్టార్లుగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలూ దీని పరిధిలోకి వస్తాయి.సెక్టార్‌- 1: ఎల్లారెడ్డి-గూడ, హనుమాన్‌ టెంపుల్‌, ఇమామ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ, శాలివాహన్‌ నగర్‌, నాగార్జున నగర్‌, సుభాష్‌ నగర్‌, శారదా కాలనీ, ఆర్బీఐ క్వార్టర్స్‌, వడ్డెరబస్తీ, షాలిమార్‌ జంక్షన్‌, కేశవనగర్‌, అప్పర్‌ బస్తీ, ప్రతాప్‌ నగర్‌, శ్రీనగర్‌ కాలనీ పార్క్‌ ఏరియా, జర్నలిస్ట్‌ కాలనీ, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, నాగార్జున సర్కిల్‌, నాగార్జునహిల్స్‌ వస్తాయి.సెక్టార్‌-2 పరిధిలో అమీర్‌పేట్‌ ఎలిఫెంట్‌ హౌస్‌, శాంతినగర్‌, దుర్గానగర్‌, బొంగులబస్తీ, ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం, లాల్‌ బంగ్లా, అభయ్‌ నగర్‌, అపరాజిత కాలనీ, సెక్టార్‌-3లో బీఎస్‌ మక్తా, కుందన్‌బాగ్‌, మెథడిస్ట్‌ కాలనీ, గ్రీన్‌ ల్యాండ్స్‌ గెస్ట్‌ హౌస్‌, కుందన్‌బాగ్‌ ఆఫీసర్స్‌ కాలనీ, కంట్రీ క్లబ్‌, ఉమానగర్‌, హుస్సేన్‌ నగర్‌, రాజ్‌భవన్‌ చిల్లా వంటివి దీని పరిధిలోకే వస్తాయి. సెక్టార్‌- 4లో మోనప్ప సర్కిల్‌, దుర్గా నగర్‌, సెంట్రల్‌, పంజాగుట్ట, కుమ్మరిబస్తీ జాఫర్‌ అలీ బాగ్‌, కపాడియా లేన్‌, సెక్టార్‌-5లో పంజాగుట్ట జంక్షన్‌, ద్వారకాపురి కాలనీ, ఎర్రమంజిల్‌, కేసీపీ జంక్షన్‌, నిమ్స్‌, పంజాగుట్ట మార్కెట్‌, హిందీ నగర్‌, బాలాపూర్‌ బస్తీ, రామకృష్ణ నగర్‌ వంటివి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనివే.సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కొందరు కానిస్టేబుళ్లు సుదీర్ఘకాలంగా ఈ పోలీస్‌ స్టేషన్‌లో పాతుకుపోయారనే ఆరోపణలు తరచూ వస్తోన్నాయి. సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారనే విమర్శలూ లేకపోలేదు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వారందరినీ బదిలీ చేశారు.

పోలీసు శాఖ ప్రక్షాళనకు శ్రీకారం !

ఒక్క సంతకంతో 86 మంది వేర్వేరు పోలీస్‌ స్టేషన్లకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు బీ హరీశ్వర్‌ రెడ్డి, ఎన్‌ శివశంకర్‌, షేక్‌ నాగుల్‌ మీరా, మహిళా ఎస్‌ఐ కే భావన, మహ్మద్‌ యాసీన్‌ అలీ, ఎన్‌ గిరిధర్‌ ఉన్నారు. ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు.. ఇలా అందరినీ ఒకేసారి బదిలీ చేశారు.కొత్త ఎస్‌ఐలుగా బీ వేణుగోపాల్‌- కుల్సుంపురా, బీ శివ శంకర్‌- నల్లకుంట, ఎం వెంకటకృష్ణ- మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్ల నుంచి పంజాగుట్టకు బదిలీ అయ్యారు. బేగంపేట్‌, దోమల్‌గూడ, బోయిన్‌పల్లి, తుకారాంగేట్‌, సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్లల్లో ఎఎస్‌ఐలుగా పని చేస్తోన్న వారిని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. పోలీస్‌ శాఖలో ప్రక్షాళనకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పూనుకుంది. పోలీసులలో అవినీతి ఆరోపణలపై సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. నగర శివార్లల్లో మూకుమ్మడి బదిలీలకు రంగం సిద్ధం చేసింది. అవినీతి ఆరోపణలపై విచారణకు స్పెషల్‌ బ్రాంచ్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దింపింది. హైదరాబాద్‌లో ఇప్పటికే 52 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. త్వరలో బడా పోలీస్‌ అధికారులు కూడా బదిలీ కానున్నారు. పోలీసులు జోక్యం చేసుకున్న భూ వివాదాలపై ఇంటిలిజెన్స్‌ ద్వారా ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులకు అవినీతి అధికారుల చిట్టా చేరింది. రాబోవు రోజుల్లో  మూడు కమిషనరేట్‌ పరిధిలో భారీగా కీలక అధికారుల బదిలీలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్‌ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మొదట గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ట్రై కమిషనరేట్స్‌ పోలీస్‌ కమిషనర్లను బదిలీ చేసింది. ఇకపై ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ రికమెండేషన్స్‌, ఎమ్మెల్యే లెటర్స్‌ పని చేయవని, ప్రతిభావంతులకే పట్టం కట్టి పోస్టింగ్‌లు ఇస్తామని ఇటీవల సీపీలు ప్రకటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !