మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరిపోయారు. మంగళవారం నాడు.. ఆళ్ల సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. గత రాత్రి ఆర్కేతో ఎంపీ విజయసాయి రెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపారు. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ను ఓడిరచడమే లక్ష్యంగా తాడేపల్లి పెద్దలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్కే మళ్లీ పార్టీలోకి వస్తే మంగళగిరిలో వైసీపీ మరింత బలం పెరుగుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్క నాయకుడు పార్టీని వీడి వెళ్ళిపోతుంటే జరగబోయే నష్టాన్ని జగన్ ముందే గ్రహించినట్టు ఉన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పొడు అనే సూత్రాన్ని వంటబట్టించుకున్నట్టు ఉన్నారు. ఒంటెద్దు పోకడకు విరామం ప్రకటించినట్టు ఉన్నారు. జగన్‌లో మార్పు సుస్పష్టంగా కనిపిస్తోంది. తనను కాదని వెళ్ళిపోయిన నాయకల్ని జగన్ మళ్ళీ వెనక్కి పిలిచింది లేదు. అలాంటి జగన్ రామకృష్ణారెడ్డి లాంటి నాయకుడిని వెనక్కి రప్పించగారు అంటే, 2024 లో గెలుపుకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అసంతృప్త నాయకులను బుజ్జగిస్తూ, మళ్ళీ తనవైపు తిప్పుకుంటున్నారు. నాయకులు వెళ్ళిపోతే పార్టీ బలహీన పడుతుంది అనే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇతర పార్టీలోని నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకునేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్‌పై విజయం సాధించారు. అయితే రెండో సారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం జగన్ చోటు కల్పించకపోవడంతో చాలా రోజులు ఆర్కే అసంతృప్తితోనే ఉన్నారు. తర్వాత గంజి చిరంజీవిని పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.
జగన్ నుండి లభించిన హామీ లేంటి?
సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని అభివృద్ధిని గాలికి వదిలేస్తే.. వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందని నిలదీసిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ నుండి ఎలాంటి హామీలు లభించాయి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. డిసెంబర్‌లో పార్టీకి, ఏమ్మేల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్.కె. ఫిబ్రవరికి వచ్చే సరికి మంగళగిరి అభివృద్ధి జరిగిందని వైసీపీలోకి చేరుతున్నారు అనేది ఆయనే చెప్పాలి. అదే కాకుండా సొంత డబ్బులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు విడుదల చేసేందుకు హామీ లభించిందని అందుకే జగన్ చెంతకు చేరారని టీడీపీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్న ఆర్కే.. సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని వైఎస్సార్‌సీపీ అధిష్టానం నియమించింది. ఈ తరుణంలో.. నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించవచ్చనే చర్చ జోరుగా నడుస్తోంది. తాడేపల్లిలో జగన్‌ని కలిసిన అనంతరం తన వాట్సప్ డపీలో జగన్ ఫోటోను పెట్టుకున్నారు.