తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ ఫైబర్‌నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ లో ఏ1గా చంద్రబాబు, ఏ2 వేమూరి హరికృష్ణ, ఏ3గా కోకంటి సాంబశివరావును పేర్కొంది. ఏసీబీ కోర్టులో ఛార్జి షీట్ దాఖలు చేయడంతో సీఐడీ మళ్లీ స్పీడ్ పెంచినట్లే కనపడుతుంది. మొత్తం 2వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాప్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గుతేల్చింది.
114కోట్ల మేర నష్టం
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అప్పటి అధికార పార్టీ అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల కేటాయింపు నుంచి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగినట్లు సీఐడీ ఛార్జిషీట్ లో పేర్కొంది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం ఏర్పడినట్లు గుర్తించింది. నాణ్యతలేని మెటీరియల్ ను వినియోగించినట్లుగా తేల్చింది. అంతేకాదు షరతులను ఉల్లంఘించినట్లుగా సీఐడీ తన ఛార్జిషీట్ లో స్పష్టం చేసింది.ఫైబర్ నెట్ ఒప్పందాన్ని అమలుచేసే సమయంలో జరిగిన ఉల్లంఘనలతో ప్రభుత్వానికి దాదాపు 114కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా తేల్చింది. టెండర్ ప్రక్రియను చంద్రబాబు సమర్థించినట్లు సీఐడీ ఛార్జిషీట్ లో పేర్కొంది. వేమూరి హరికృష్ణ ను నిబంధనలకు విరుద్ధంగా వాటాదారుడిగా మార్చినట్లు సీఐడీ నిర్ధారించింది. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని మూడేళ్ల క్రితం సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ కేసు ద్వారా అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు 114 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. తొలుత చంద్రబాబును 25వ నిందితుడిగా చేర్చిన సీఐడీ విచారణ అనంతరం ఏ1గా చేర్చడం విశేషం.