రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్పును వెల్లడిరచింది రాజ్యాంగ ధర్మాసనం.
రాజ్యాంగ విరుద్ధం !
ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదు. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకో కు దారి తీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం కుదరదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది. అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడిరచింది. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకుర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని అక్టోబరు 10న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్(ఏడీఆర్ తరఫున) చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్ 2వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కానిస్టిట్యూషన్ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సీల్డ్ కవర్‌లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కూడా. అదే సమయంలో ఎలక్టోరల్ బాండ్స్‌ను వెంటనే నిలిపివేయాలని.. వాటిని అమ్మకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి ఇప్పటిదాకా జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మూడు వారాల్లో(మార్చి 6వ తేదీలోగా) కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐను సుప్రీం ఆదేశించింది. అలాగే పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరిచ్చారో తెలియ పర్చాల్సిన అవసరం ఉందని.. ఆ వివరాలను బహిర్గత పర్చాల్సిన అవసరమూ ఉందని.. ఎలక్టోరల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చాయన్న వివరాలు మార్చి 13వ తేదీ లోగా తన వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. మరోవైపు.. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్న విరాళాలను వెనక్కి ఇచ్చేయాల్సిందేనని(ఇంకా ఎన్‌క్యాష్ అవ్వని బాండ్లను) రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం 15 రోజుల గడువు విధించింది.
ఏంటీ ఎన్నికల బాండ్లు..?
ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
పిటిషనర్ల వాదన ఇదే..
- కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది
- అధికారప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోంది
- ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయి
- విపక్ష పార్టీలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలు వచ్చాయి
- ఈ మేరకు గణాంకాలతో సహా వివరించారు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్
కేంద్రం వాదన..
- ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
- మన దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు, 2.38 లక్షల డొల్ల కంపెనీలపై చర్యలు వంటివి కేంద్రం తీసుకుంది.
- స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసింది
ఒక దశలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ...‘‘అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయి. దీనికి కారణమేమిటి’’ అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని ఆయన సూచించారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ....‘అప్పుడు అసలు విరాళాలే రావ’ని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదని అందులో పేర్కొన్నారు.
ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
- రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయి
- గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోంది
- ఎస్‌బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు
- అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదు
- అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుంది
రాజకీయ అభ్యంతరాలు
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి రూ.5,127.97 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిసి కేవలం రూ.1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. దీని ప్రకారం ఎలక్టోరల్ బాండ్లతో అధికార పార్టీకి ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.