Chandrababu : అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ...పొత్తుపై చర్చలు !

0

తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి పొద్దుపోయాక 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురూ సమావేశమయ్యారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో తెలుగుదేశంనూ ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. మొదట బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షాలతో రాత్రి 7.30 గంటలకు సమావేశమవుతారన్న ప్రచారం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయేవరకూ పార్లమెంటు ఉభయసభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంటులోనే ఉండిపోయారు. అనంతరం రాత్రి 11.25 గంటలకు భేటీ మొదలై 12.16కు ముగిసింది. బీజేపీ నాయకత్వం ఎన్డీయే పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఇటీవల ఎన్డీయే కూటమిలోకి వచ్చిన బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు అమిత్‌షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. తర్వాత కమలనాథులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇవి ప్రాథమిక చర్చలు కావొచ్చని, ఇందులో పొత్తులపై ఇరుపార్టీల పెద్దలు ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అయితే దీని గురించి ఇరుపార్టీల నేతలెవ్వరూ అధికారికంగా స్పందించలేదు. 

ఎన్డీయే కూటమి బలోపేతమే లక్ష్యం !

దేశవ్యాప్తంగా ఎన్డీయేను బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్‌ షా పేర్కొన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ - తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్‌ షా ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న అధికార పక్షానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తమకు సమాచారం అందిందని కూడా చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్డీయేను బలోపేతం చేసినట్లుగానే... ఇప్పుడూ సహకరించాలని చంద్రబాబును అమిత్‌షా కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: బాబు

అమిత్‌షాతో భేటీకి ముందు చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీజేపీకి దేశప్రయోజనాలు ముఖ్యమైతే... తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకునే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కు పోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొద్ది నెలల క్రితం అమిత్‌ షా తనతో మాట్లాడారని, ఇప్పుడు మళ్లీ కబురు పంపారని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు, ఎన్నికల వ్యూహకర్త రాబిన్‌ శర్మ తదితరులు చంద్రబాబుతో చర్చలు జరిపారు. .వైసీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, రఘురామకృష్ణం రాజు కూడా చంద్రబాబుతో చర్చించారు. చంద్రబాబు ఢల్లీి వచ్చిన సంగతి తెలుసుకుని రాష్ట్రంలో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు పెద్ద సంఖ్యలో ఢల్లీికి వచ్చి ఆయనను కలుసుకునేందుకు ప్రయత్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !