ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కసరత్తు చేశామని చెప్పారు. సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన, బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు చూసుకుంటాం !
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం అడుగడుగునా కనబడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. వాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోను. సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు మేం చూసుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశం కల్పిస్తాం. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశాం. నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేదే కూటమి లక్ష్యం’’ ఎన్డీయే కేంద్రంలో 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో కూటమికి 160కిపైగా అసెంబ్లీ సీట్లు వస్తాయి. కడప ఎంపీ సీటును మనమే గెలవబోతున్నాం. ఆ పార్టీ అభ్యర్థి.. ఈ పార్టీ అభ్యర్థి అని చూడొద్దు. అందరూ ఎన్డీయే అభ్యర్థులుగానే భావించాలి. మూడు పార్టీలు వేసే పునాది.. 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్లలో జగన్ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారనుకోలేదు. ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టారు. అబద్ధాలు చెప్పి మరోసారి గెలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. విశాఖలో డ్రగ్స్ కంటెయినర్ దొరికితే తెలుగుదేశంపై విమర్శలు చేస్తారా? బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నిక కాగానే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. డ్రగ్స్ మాఫియాను పెంచి పొషించిందెవరో అందరికీ తెలుసు. చేసేది, చేయించేది వైసీపీనే అని చంద్రబాబు మండిపడ్డారు.