ఈ నెల 27 నుంచి జగన్ బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కి నివాళులు అర్పించిన తర్వాత.. అదే రోజు ప్రొద్దుటూరులో యాత్ర ఉంటుంది. రూట్ మ్యాప్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశంలో వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. 28న నంద్యాలలో బహిరంగ సభ ఉంటుంది. ఇక 30వ తేదీన ఎమ్మిగనూరులో బహిరంగ సభ నిర్వహించేలా పార్టీ ప్లాన్ చేసింది. పాదయాత్ర తరహాలోనే జగన్ ఇకపై పూర్తిగా జనాల్లోనే ఉండబోతున్నారు. సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా.. రాష్ట్రమంతా జగన్ బస్సుయాత్ర ఉంటుంది. జగన్ సభ అంటే తిరునాళ్లలా ఉంటుంది. ఊళ్లకు ఊళ్లే తరలివస్తాయి. గతంలో ఎన్నడూ లేనంతగా జనసమీకరణ ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఇక మేమంతా సిద్ధం !
ఇప్పటికే మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు. నాలుగు సిద్ధం సభలతో క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేశాం. ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం. సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి. దీనికి కొనసాగింపుగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారు. ఇడుపులపాయ నుండి ఈ బస్సుయాత్ర మొదలు పెడతారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలుస్తారు. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర సాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు’ అని సజ్జల పేర్కొన్నారు.
ఇకపై పూర్తిగా జనాల్లోనే
సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు. ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. సీఎం జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయి. అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి. ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్స్ ఉంటుంది. వారినుండి సలహాలు సూచనలు తీసుకుంటారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం . తొలిరోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుంది. రెండవ రోజు నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్. నంద్యాలలో బహిరంగ సభ. 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుందని సజ్జల వెల్లడిరచారు. ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ 27వ తేదీ మొదలైతే.. నోటిఫికేషన్ వచ్చే దాదాపు 18వ తేదీ వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.