బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఒకసారి.. లక్కీ లాటరీ తగిలిందని మరోసారి.. ఓటీపీ చెప్పమని, ఇలా మాయమాటల్లో పెట్టి ఇంకోసారి బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్ము కొల్లగొట్టడం కామన్ గా మారిపోయింది. కానీ ఇప్పుడు.. ఆ కొల్లగొట్టిన క్యాష్ జమ చేసేందుకు నకిలీ ఖాతాల కోసం జనాలను ట్రాప్ చేసేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. సేకరించిన వివరాలను విదేశాలకు పంపించి వాళ్ల నేరాలకు ఈ ఖాతాలను ఆపరేట్ చేసేస్తున్నారు. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు తీగ లాగితే.. లింకు థాయిలాండ్, చైనా, కంబోడియా వయా.. తెలుగు రాష్ట్రాలకు తగిలింది. దీంతో.. అసలు నిందితులు మాటేమో గానీ, ఖాతాలోకి డబ్బులు వచ్చినందుకు తెలుగు వాళ్ళు కటకటాల పాలవుతున్నారు. ట్రేడిరగ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో అధిక లాభాలు అర్థించాలనుకుంటున్నారా..? మాకు కాస్త సహకరిస్తే చాలు.. ఆశించిన డబ్బు మీ సొంతం. అందుకు మీరు చేయాల్సింది.. కేవలం బ్యాంకు ఖాతా క్రియేట్ చేసి వివరాలు ఇవ్వడమే..! ఇది ఈ మధ్యకాలంలో సైబర్ క్రిమినల్స్ వేస్తున్న వల. కాస్త కమిట్ అయితే చాలు.. ప్రత్యక్షంగా మీ ప్రమేయం లేకుండానే, సైబర్ క్రిమినల్స్ మీ ఖాతాలను ఆపరేట్ చేసేస్తున్నారు. జనాలను మోసం చేసిన సొమ్మును ఆ ఖాతాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు.. కూపీ లాగితే చివరకు ఆ లింకు థాయిలాండ్, చైనా, కాంబోడియా వయా తెలుగు రాష్ట్రాలకు తగిలింది. కట్ చేస్తే.. అసలు నిందితులు తప్పించుకుంటున్నారు. బ్యాంక్ ఖాతాలు ఇచ్చినందుకు అమాయకులు బలి అవుతున్నారు.
మోసం చేసిన డబ్బును దాచేందుకు అకౌంట్లు కోసం ట్రాప్ !
టెక్నాలజీ అప్డేట్ అయినట్టుగానే.. సైబర్ క్రిమినల్స్ కూడా అదే రేంజ్‌లో అప్డేట్ అయిపోతున్నారు. రోజుకో స్టైల్లో స్ట్రాటజీతో జనాలను నిలువునా ముంచేస్తున్నారు. తెలియకుండా మోసాలు చేయడం కామన్.. కానీ ఇప్పుడు ఆ మోసం చేసిన డబ్బులు దాచేందుకు జనాలను ట్రాప్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఖాతా క్రియేట్ చేసి ఇస్తే కమిషన్ ఇస్తామంటూ.. ఆఫర్ చేస్తున్నారు. వారి ట్రాప్ లో పడుతున్న కొందరు.. ఖాతాలను క్రిమినల్ చేతికి అందించి కేసుల్లో ఇరుక్కొక తప్పడం లేదు. తాజాగా చైనా, కంబోడియా నుంచి ఆపరేట్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఆపరేషన్ కు చెక్ పెట్టారు విశాఖ పోలీసులు. బ్యాంకు ఖాతాలు ఇస్తే కమిషన్ మీ సొంతమంటూ ఆఫర్ చేస్తున్నారు. దీంతో వారి మాయమాటల్లో పడి.. క్రిమినల్స్ చేతికి ఖాతాలో మొట్ట చెబుతున్నారు. వాళ్లు ఇచ్చిన కమిషన్ తో విలువైన సమాచారాన్ని కోల్పోవడమే కాకుండా కేసుల్లో ఇరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, సైబర్ నేరగాళ్ళు రోజుకో స్టైల్ లో మోసాలు చేస్తున్నారు. కమిషన్ ఆశచూపటమే వారి అస్త్రం. సోషల్ మీడియాలో ప్రకటనలతో కొందరినీ ఆకర్షిస్తున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడిరగ్ ఇన్వెస్ట్మెంట్ యాప్లతో వల వేస్తూ ట్రాప్ చేస్తున్నారు. కాస్త కమిట్ అయితే మాయమాటలతో కమిషన్ ఆశ చూపిస్తున్నారు. తమకు బ్యాంకు ఖాతాలో క్రియేట్ చేసి ఇస్తే, మంచి కమిషన్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. వారి ఆఫర్లకు టెంప్ట్ అయ్యి వివరాలు ఇస్తే వాటిని విదేశాల్లో సైబర్ నేరగాళ్ళకు అమ్మేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ తరహా మోసాలు ఎక్కువయ్యాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సామాన్యులే సమిథలు
ఇటీవల ఓ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వాళ్లు సైబర్ క్రిమినల్స్ కాదు. కాకపోతే విదేశాల్లో ఉంటూ ఆపరేట్ చేసే సైబర్ నేరగాళ్లకు.. బ్యాంకు ఖాతాలు సప్లై చేయడమే వారి పని. కమిషన్ కోసం ఆశపడి.. కొన్ని నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి.. వాటి వివరాలను సైబర్ నేరగాళ్ళకు అందిస్తున్నారు. ఆ ఖాతాలను బేస్ చేసుకుని.. సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. అమాయకులను మాయమాటలతో మోసం చేసి లాగేస్తున్న నగదును అయా అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయిస్తున్నారు. ఆ నగదును క్రెప్టో కరెన్సీలోకి మార్చి నగదు విదేశాలకు బదిలీ చేయిస్తున్నారు. ఆ కేసులో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు సహా నలుగురిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ థాయిలాండ్ కేంద్రంగా జరుగుతున్నట్టు గుర్తించారు. మరో కేసులో కూపీ లాగేసరికీ.. తెలుగు వారి బ్యాంకు ఖాతాల్లో సైబర్ క్రిమినల్స్ మోసాలు చేసిన నగదు పడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. దాన్ని ట్రాక్ చేసేసరికి.. చైనా, కంబోడియా వయా ఏపీ, తెలంగాణకు ఆ లింకు తగిలింది. సైబర్ క్రిమినల్స్ ఇచ్చిన కమిషన్లు ఆశతో.. నకిలీ ఖాతాలను తయారు చేసి వారికి అప్పగిస్తున్నారు కొంతమంది. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన మాతాంగి ప్రశాంత్, మాతంగి కుమార్, పెరుమండ్ల అశోక్ తోపాటు గుంటూరుకు చెందిన శ్రీరాగ రమేష్ లను అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. వాళ్లకు కూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ట్రేడిరగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో జాయిన్ అయితే కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. వారి నుంచి బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సేకరిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు వివరాలు ఇచ్చిన వారికి కొంత కమిషన్ జమ చేసి నమ్మకం కలిగిస్తున్నారు. ఆ తర్వాత ఆయా ఖాతాలకు లింక్ అయినా ఫోన్ నెంబర్లను మార్చేసి అకౌంట్లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి.. ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న సైబర్ నేరగాళ్ళకు అమ్మేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. పెరుగుతున్న కొత్త తరహా సైబర్ నెలలపై విశాఖ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రోజుకో స్టైల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళ వ్యూహాలపై ఒకవైపు జనాలను అవగాహన పెంచుతూనే.. సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో నేరాలకు కళ్లెం వేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. నిత్యం రకరకాల సైబర్ నేరాలకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి.. లక్షలు పోగొట్టుకోవడం ఇప్పటివరకు చూశాం. కానీ.. ఇప్పుడు కేటుగాళ్ళ ఉచ్చులో పడిన కొంతమంది కేసుల్లో ఇరుక్కుని కటకటాల పాలవుతున్నారు. కమిషన్ కోసం ఆశపడి బ్యాంకు ఖాతాల వివరాలు వాళ్ళ చేతికి ఇవ్వడమే..! సో బీ అలర్ట్. వ్యక్తిగత ఖాతాలో వివరాలు బయటకు చెప్పడం గానీ, వాటిని వేరొకరి చేతికి ఆపరేట్ చేసేందుకు ఇవ్వడం గానీ చేస్తే అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.