YS JAGAN : హైద్రాబాద్‌ని తలదన్నేలా వైజాగ్‌ని అభివృద్ధి చేస్తా

0


‘విజన్‌ వైజాగ్‌’ పేరిట పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌-వీఎంఆర్డీఏ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1,500 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను- మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, విడదల రజినితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహించిన విజన్‌ విశాఖ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాల గురించి వివరించారు.ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ విజన్‌ విశాఖ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. 8:48 నిమిషాల పాటు ఉండే ఈ వీడియో- వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. విశాఖలో ఈ అయిదు సంవత్సరాల కాలంలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఇందులో పొందుపరిచారు.ఇన్ఫోసిస్‌, అదాని డేటా సెంటర్‌ పెట్టుబడులు, జాతీయ రహదారులు, వైజాగ్‌ పోర్ట్‌ కనెక్టివిటీ గురించి వివరించారు. విశాఖ నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. పూర్తిస్థాయి రాజధానిగా బదలాయించిన తరువాత వాహనాల రాకపోకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడానికి నిర్మించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్‌.. వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే- ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ సిటీగా మారిన తరువాత విశాఖలో నిర్మించబోయే ప్రభుత్వ భవన కార్యాలయాల డిజైన్లు కూడా ఇందులో పొందుపరిచారు. రాష్ట్రస్థాయి సచివాలయం డిజైన్‌ ఎలా ఉంటుందనేది వివరించారు. దీపపు వెలుగు ఆకారంలో సచివాలయం నమూనాను డిజైన్‌ చేశారు.ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు జగన్‌. ఎన్నికల్లో గెలిచిన తరువాత ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. విశాఖపట్నాన్ని పూర్తిస్థాయిలో కార్యనిర్వాహక రాజధానిగా మారుస్తామని, తాను ఇక్కడే ఉంటాననీ అన్నారు. విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని అన్నారు. ఈ నగరాన్ని ఎకనమిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌గా మారుస్తామని జగన్‌ పేర్కొన్నారు.


ఉత్పత్తి రంగంలో ఏపీ మెరుగ్గా

రాష్ట్రంలో​ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌న కోల్పోయామని దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. అయితే వైజాగ్‌ నగరం అభివృద్ది చెందుతోందని.. హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో​ విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.

నిరుద్యోగం తగ్గింది

ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. డీబీటీ పద్దతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. సముద్రతీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని.. ఉపాధి అవకాశాలు పెరిగాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణం చేస్తా

ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే ఉంటా. ఈసారి సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా. నగర అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళిక అవసరం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయలేదు. కేంద్రం సహకారం ఉండాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలి. సమష్టిగా కృషి చేస్తేనే విశాఖ నగరం మారుతుంది. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు. అమరావతికి నేను వ్యతిరేకం కాదు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాలా కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. అక్కడ 50వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని.. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్‌ తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని చెప్పారు. విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌లా మారుస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

విశాఖపై విషం కక్కుతున్నారు

చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సీఎం జగన్‌ తెలిపారు. స్వయం సహాయక బృందాల పెండిరగ్‌ రుణాలను మాఫీ చేశామని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కొన్నిమీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని అన్నారు. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని తెలిపారు. కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ది చెందదని అన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని సీఎం జగన్‌ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !