- అందుకే గాయంతోనే జనంలోకి వెళ్తున్నారా ?
- జగన్ సిఎంగా ఉన్నప్పుడు దాడి చేసే ధైర్యం ఎవరికీ ఉంది ?
- 24 గంటలు గడిచినా నిందితుల్ని ఎందుకు పట్టుకోలేదు ?
- సిఎం ప్రచారం చేసే రూట్ కరెంట్ కట్ చేసే ధైర్యం ఎవరు చేస్తారు ?
- పథకం ప్రకారమే కరెంట్ కట్ చేశారా ?
- దాడికి విజయవాడనే ఎందుకు ఎంచుకున్నారు ?
జగన్‌మోహన్ రెడ్డి...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి...తన పవర్‌తో రాష్ట్రాన్ని శాసిస్తున్న శక్తి...అలాంటి వ్యక్తిపై దాడి చేయటం ఎవరి వల్ల అవుతుంది. దాడి చేసే సాహసం ఎవరు చేయగలరు ? ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగనే గులకరాయి డ్రామా తెరతీశారా ? కొడికత్తి దాడి జరిగినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడే, బాబాయి వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడే...మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి జగనే కదా. దాడి చేసిన వ్యక్తులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ? దాడి చేసిన రాయిని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు ? కరెంట్ పోతుందని దుండగుడికి ముందే తెలుసా ? దాడి చేసేందుకు అదే అవకాశంగా భావించాడా ? దాడి చేసిన దుండగుడు ఎలా తప్పించుకోగలిగాడు ? దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు కానీ భద్రతా సిబ్బంది కానీ ఎందుకు ఆ ప్రాంతాన్ని అదుపుతోకి తీసుకోలేకపోయారు ? కరెంట్ పోయిన సమయంలోనే భద్రతా సిబ్బందికి ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ? ఈ ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి. సిఎం పర్యటన జరుగుతున్న సమయంలో కరెంట్ కోత ఎందుకు విధించారు ? దాని వెనుక ఎవరు ఉన్నారు ? ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భద్రతా వైఫల్యం...
సీఎం జగన్‌పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడికి ముందు, ఆ తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత లోపభూయిష్ఠంగా ఉంది. వివేకానంద స్కూల్ వైపు నుంచే రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీడియోల్లోనూ అలానే కనిపిస్తోంది. సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తయిన భవనాలను ముందే గుర్తించి, అక్కడ పోలీసులను మోహరిస్తారు. వీఐపీ వచ్చే ముందుగా ఆ మార్గంలో ఒకటికి రెండు సార్లు భద్రతా తనిఖీలు చేస్తారు. రెండంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్ గదుల తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ భవనమంతా ఖాళీగానే ఉంది. అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు? భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు? జగన్ పర్యటిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్ ఎగరవేసి.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించి, భద్రతాపరంగా ఎక్కడైనా సమస్యలున్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు. మరి అలాంటిది వివేకానంద స్కూల్ భవనం లోపల నుంచి గానీ, భవనం పైనుంచి గానీ ఎవరైనా, ఏదైనా విసిరితే ముప్పు ఉండే అవకాశముందని ముందే ఎందుకు గుర్తించలేదు? వీఐపీ భద్రత పట్ల ఇది నిర్లక్ష్యం కాదా?
కరెంట్ కోత ఎందుకు విధించారు ?
జగన్‌పై రాయి విసిరినప్పుడు విద్యుత్తు సరఫరా లేదు. అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఫోకస్ లైట్లు వేసి వారికి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపించేలా చూసుకోవాలి. కానీ అదీ చేయలేదు. ముఖ్యమంత్రి బస్సుపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది డేగకళ్లతో అన్ని వైపులా గమనిస్తుండాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే రక్షణ వలయంగా ఏర్పడి కాపాడాలి. వెంటనే స్టోన్‌గార్డులు, బుల్లెట్‌ప్రూఫ్ షీట్లు తెరవాలి. వీఐపీని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి. రాయి తగిలినా సీఎం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడలేదు. రాయి వచ్చిన వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముడితే రాయి విసిరినవారిని పట్టుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అక్కడ ఉండే వందల మంది సిబ్బంది ఎవరూ ఈ దాడిని గుర్తించలేదు, తక్షణం స్పందించలేదు.
కేసులో పురోగతి ఎందుకు లేదు
ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినా సోమవారం గడుస్తున్నా ఇంత వరకూ పోలీసులు ఏమీ ప్రకటించలేదు. డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా ముగ్గురూ సిఎం జగన్‌కు వీరవిధేయులే. భద్రతా వైఫల్యానికి ప్రధాన బాధ్యత వీళ్లదే. సీపీ కాంతి రాణా అయితే.... చిన్న చిన్న విషయాలకూ ప్రెస్‌మీట్లు పెట్టి వివరాలు చెబుతుంటారు. అలాంటిది ఇంత పెద్ద ఘటన జరిగితే ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా లేదు. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులే రాయి విసిరారని అనుకుంటే, ఈ పాటికే నిందితుడెవరో తేల్చేయాలి కదా ! ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఇంత పెద్ద ఘటన జరిగితే... డీజీపీ, నిఘావిభాగం అధిపతి, విజయవాడ సీపీ ఎవరూ దానిపై నోరు విప్పట్లేదు. ఈ ఘటనపై అధికార, విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వాస్తవమేంటో ఆధారాలతో తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కదా! వాళ్లు దర్యాప్తులో ఎందుకింత జాప్యం చేస్తున్నారు? అత్యంత క్లిష్టమైన కేసుల్ని సైతం సాంకేతికతను ఉపయోగించేసి ఛేదిస్తున్నామని చెప్పుకొనే ఏపీ పోలీసులు.. ఈ దాడి ఘటనలో ఇప్పటివరకూ ఏం నిగ్గుతేల్చారో ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు?
అసలు తగిలింది రాయేనా? లేదా మరేదైనానా?
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌కు పదునైన రాయి తగలి రక్తగాయమైందని, అదే రాయి పక్కనే ఉన్న తన ఎడమ కంటికి తగిలి తనకూ రక్తగాయమైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నాయకులు మాత్రం ఎయిర్‌బుల్లెట్, పెల్లెట్, క్యాట్‌బాల్ వంటి వాటితో కొట్టారని ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవమేంటి? ముఖ్యమంత్రి నుదుటిపై తగిలింది ఏంటో ఇప్పటివరకూ పోలీసులు తేల్చలేదు. అసలు తగిలిన వస్తువును స్వాధీనం చేసుకున్నారో, లేదో కూడా స్పష్టత లేదు. దర్యాప్తు రీత్యా ఇది చాలా అవసరం. నిజంగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ అయితే ఈ పాటికే వాటిని చూపించాలి కదా! కానీ అవెక్కడా చూపించట్లేదు.
విజయవాడలోనే దాడి ఘటన ఎందుకు జరిగింది ?
రాజధాని ప్రాంతాన్ని ఇప్పటికే నిర్లక్ష్యం చేయటంతో పాటు ఆ ప్రాంత ప్రజలు, రైతులు వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. రాజధాని రైతుల పోరాటంతో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ దాడి ఘటన ద్వారా ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఈ దాడి ఘటనను ప్లాన్ చేశారని టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తలకు గాయంతోనే ప్రజల్లోకి వెళితే దాని ప్రభావం గట్టిగానే ఉంటుందని అందుకే యాత్ర ఆగకుండా కొనసాగిస్తున్నారని టీడీపీ నాయకులు బహిరంగంగానే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.