ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ ఢల్లీిలోని రౌస్ అవెన్యూ కోర్టు‘(సీబీఐ ప్రత్యేక కోర్టు) తీర్పు ఇచ్చింది. ఇవాళ్టితో ఆమె సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజులకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలిస్తున్నారు. కాగా, ఢల్లీి మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. జైలులో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభ కలిసినా, తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించలేదు. కవిత అరెస్ట్ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ
సీబీఐ అధికారులపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. సోమవారం సీబీఐ కస్టడీ ముగియడంతో ఆమెను మరోసారి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బయట బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆరోపణలనే లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు. కొత్త ప్రశ్నలు ఏవీ అధికారులు అడగటం లేదని చెప్పారు.