‘‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..’’ అంటూ ఏళ్లపాటు అలరించిన ఆ స్వరం శాశ్వతంగా మూగబోయింది. తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రెండ్రోజుల కిందట గుండెపోటుతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. దూరదర్శన్‌లో తెలుగు న్యూస్ రీడర్‌గా తనదైన ముద్ర వేసిన శాంతి స్వరూప్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన శాంతి స్వరూప్.. 1978లోనే దూరదర్శన్‌లో చేరారు. అయితే యాంకరింగ్ చేసేందుకు ఆయన ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన దూరదర్శన్ తెలుగు తొలి బులిటెన్ వార్తల్ని చదివి వినిపించారాయన. టెలి ప్రాంప్టర్(ఎదురుగా స్క్రీన్ మీద చూసి..) లేని రోజుల్లో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు వినిపించడంలో ఆయన ఆరి తేరారు. అలా పదేళ్ల పాటు స్క్రిప్ట్‌పేపర్లతోనే వార్తలు చదువుతూ వచ్చారు. దూరదర్శన్‌లో 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు.
న్యూస్ రీడర్ల గురువు
చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్‌ను తమ గురువుగా భావిస్తుంటారు. అయితే 24/7 పేరిట న్యూస్ రంగంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పుల్ని ఆయన స్వాగతించలేకపోయారు. వార్తలు చదవకండి.. వార్తలు చెప్పండి.. అని తర్వాతి తరం యాంకర్లకు సూచించారాయన. శాంతి స్వరూప్ సతీమణి రోజా రాణి కూడా న్యూస్ రీడర్. 1980లో వీళ్ల వివాహం జరగ్గా.. వీళ్లకు ఇద్దరు కుమారులు , వీరు విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద ‘‘రాతి మేఘం’ అనే నవల రాశారు. క్రికెట్ మీద మక్కువతో ‘క్రేజ్’, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ అనే నవల రాశారాయన. యాంకరింగ్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఇక శాంతి స్వరూప్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ‘‘తొలి తరం న్యూస్ రీడర్ గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ గారి మృతి బాధాకరం. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ సంతాప సందేశాల్ని తెలియజేస్తున్నారు.