ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దేవర. సక్సెస్ కాంబో కావడం, ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు అంతే ఆత్రుతగా ఎదురుచూశారు. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆయన కూడా కాస్త జాగ్రత్తగా హిట్ కొట్టాలనే కసితో పనిచేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘దేవర’ ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేస్తుండటం, జాన్వీ ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమవుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూడు రోజులు ముందు రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ వదిలారు. అది సినిమాపై అంచనాలు పంచేలా చేసింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది. కొరటాల ఖాతాలో హిట్ పడిరదా లేదా అన్నది చూద్దాం. మరి ‘దేవర’ వాటిని అందుకుందా? ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం మెప్పించిందా?
కథేంటంటే
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతమది. సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండపై నాలుగు ఊళ్లని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరు వెనక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ నాలుగు ఊళ్ల అవసరాల కోసం దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్ అలీఖాన్) వాళ్ల అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటుంది మురుగ (మురళీశర్మ) గ్యాంగ్. సంద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించిన దేవర... ఇకపై ఆ పనుల్ని చేయకూడదనే నిర్ణయానికొస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెబుతాడు. కానీ, భైర అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవరని అడ్డు తొలగించుకుని సంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైర. దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుంటాడు. ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది? అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన తనయుడు వర (ఎన్టీఆర్) ఏం చేశాడు? వరని ఇష్టపడిన తంగం (జాన్వీకపూర్) ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే
రత్నగిరి అనే ప్రాంతంలో సముద్రం, అందులో జరిగే వ్యాపారం, ఆ ప్రాంతంలో బతుకుతెరువు కోసం పనిచేసే మనుషులు ఇతివృత్తంగా సాగే కథ ఇది. బ్రిటీష్ కాలం, ఎర్ర సముద్రం, ఆ ప్రాంత వాసుల ఘనత, ఆ సముద్రానికి కాపలాగా ఉండే దేవర కథను ఓ కేసును చేధించడం కోసం వచ్చిన పోలీస్ ఆఫీసర్ (అజయ్)కు సింగప్ప (ప్రకాశ్‌రాజ్)తో చెప్పిస్తూ కథను నడిపించారు. సంద్రంలో ఉవ్వెత్తున ఎగసే కెరటంలాగే ఎన్టీఆర్ పాత్ర పరిచయమవుతుంది. ఆ ఎలివేషన్స్, సముద్రం నేపథ్యం అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికీ గొప్ప థియేట్రికల్ అనుభూతిని పంచుతుంది. నౌకలపైన కంటైనర్లని చాకచక్యంగా దొంగిలించడం, ఆ తర్వాత ఆయుధాల కోసం ఊళ్లో దేవర, భైర మధ్య సాగే భీకర పోరాటం తదితర సన్నివేశాలు ఎర్ర సముద్రంలో మనం కూడా ఓ భాగం అనే అనుభూతిని కలిగిస్తాయి. దర్శకుడు తెలివిగా ఆ రెండు పాత్రల్ని అత్యంత శక్తిమంతంగా తెరపై ఆవిష్కరించి, వాటి మధ్య అంతర్యుద్ధం రాజేశాడు. సమ ఉజ్జీల్లాంటి ఇద్దరి మధ్య పోరులో గాఢత ఎలా ఉంటుందో దేవర, భైర పాత్రల మధ్య డ్రామాలో అది పక్కాగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి కథ మారిపోతుంది. అప్పటి వరకూ ‘అక్రమ ఆయుధాల రావాణాకు పని చేస్తున్నాం’ అనే విషయం తెలియక ఆ పనిని వదిలేసి, కొత్త జీవితం మొదలు పెట్టాలనుకోవడం, అందుకు భైర అండ్ కో అంగీకరించపోవడం అంతా బాగానే సాగింది. దేవరను చంపాలనే స్కెచ్ వేసి దెబ్బ తిన్న భైర బృందం, సంద్రానికి కాపలాగా నేనుంటాను అని చెప్పి దేవర అజ్ఞాతంలోకి వెళ్లడం నుంచి కథ కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా చకచకా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో వర, తంగం పాత్రలు పరిచయం అవుతాయి. వారి మధ్య చిన్న లవ్ ట్రాక్ నడుస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో ఉన్న ఇంటెన్స్ సెకెండాఫ్‌లో ఉండదు. దేవర అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి ప్రతి సన్నివేశం ఊహకు అందేలా ఉంటుంది. భయం భయంగా కనిపించే వర ఆయుధ పూజ కోసం బరిలోకి దిగినప్పుడే తండ్రి స్థానంలో ఉండి అంతా చేసేది అతనే అని అర్థమైపోతుంది. దేవర పాత్ర ముగింపు, వర పాత్ర మళ్లీ ఎలా మొదలైంది, భైరను ఎలా అంతమొందించాలన్నది రెండో పార్ట్‌లో చూడాలి అన్నట్లు ముగింపు పలికారు. దర్శకుడు కొరటాల శివ బలం రచన. తను తెరకెక్కించిన హిట్ చిత్రాలు చూస్తే.. కథలో బలం కనిపిస్తుంది. ఈ కథలో బలమున్నప్పటికీ ఆయనలోని రచయిత సీన్స్ రాయడం, స్క్రీన్‌ప్లే రాయడంలో ఎక్కడో ఫెయిల్ అయిన భావన కలుగుతుంది. ఆయన సినిమాల్లో ఉండే కొత్తదనం ఈ చిత్రంలో మిస్ అయింది. ఇంటర్వెల్ నుంచి ప్రతి సీనూ ఊహించేలా ఉంది. అయితే తారక్ నటన, పోరాటాలు, అనిరుద్ సంగీతం సినిమాకు ఎసెట్‌గా నిలిచాయి. డైలాగ్‌ల విషయంలోనూ కొరటాల మార్క్ మిస్ అయింది. ‘దేవర అడిగినాడంటే సెప్పినాడని, సెప్పినాడంటే..’ భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి..’ జరిగిన పొరపాటుకు కళ్లలోకి చూసి మాట్లాడలేక.. కాళ్లను చూసి మాట్లాడుతున్నా’ వంటి డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు, ఈలలు వేయిస్తాయి. పోరాట ఘట్టాలు ఎన్టీఆర్ స్టామినాకు తగ్గట్లు ఉన్నాయి. ఆ సముద్రానికి రారాజుగా ఎన్టీఆర్ పాత్రను చూపించారు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తాయి. సమ ఉజ్జీలాంటి రెండు పాత్రలను పవర్‌ఫుల్‌గా తెరపై చూపించారు. మనిషి బతకడానికి సరిపడినంత ధైర్యం చాలు... అంతకు మించి ఉన్నా మనిషికి హాని చేస్తుందన్న విషయాన్ని చెప్పారు.
ఎవరెలా చేశారంటే
తారక్ డ్యూయల్ రోల్ చేసిన ఐదో చిత్రమిది. ఇందులో దేవరగా తండ్రి పాత్రలో, ‘వర’గా యంగ్ ఎన్టీఆర్ పాత్రలో ఆకట్టుకున్నారు. దేవర పాత్రలో తారక్ బాడీ లాంగ్వేజ్, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. తారక్ స్టార్ మాత్రమే కాదు.. మంచి నటుడు అని మరోసారి నిరూపించాడు. ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా కనిపించిన ఆయన నటన పరంగా అభిమానులకు ఫుల్‌మీల్స్ పెట్టారు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌కు తెలుగులో తొలి చిత్రమిది. ఆమె పాత్ర గురించి మొదటి నుంచీ మాంచి ఎలివేషన్ ఇచ్చారు కానీ మూడు సీన్లు, ఓ పాటలకు పరిమితమైంది. సినిమా మొత్తం మీద ఓ 15 నిమిషాలే కనిపించింది. పాత్ర నిడివి తక్కువే అయినా నటనతో ఆకట్టుకుంది. గ్లామర్‌తో మెప్పించింది. విలన్‌గా భైర పాత్రలో కనిపించారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. సినిమాకు కీలకమైన పాత్రే కానీ ఆయనే చేయాల్సిన పాత్ర అయితే కాదు. అయితే హిందీ మార్కెట్ కోసం సైఫ్, జాన్వీలను ఎంపిక చేసినట్లు అనిపిస్తుంది. సింగప్ప పాత్రలో ప్రకాశ్ రాజ్ నటన బాగానే ఉంది కానీ అతని గెటప్ అంతగా ఆకట్టుకోలేదు. శ్రీకాంత్, మురళీశర్మ, అజయ్, శ్రుతి తదతరులు కీలక పాత్రల్లో పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అండర్ వాటర్ సీన్స్‌కు బాగా ఖర్చు చేసినట్లు తెరపై కనిపిస్తోంది. రత్నవేలు కెమెరా పనితనం సినిమాకి హైలైట్. సంగీత దర్శకుడు అనిరుద్ నేపథ్య సంగీతంతో అలరించాడు. పోరాట ఘట్టాలు వాటికి నేపథ్య సంగీతం విషయంలో అనిరుద్ 100 శాతం న్యాయం చేశాడు. విజువల్‌గా పాటలు ఆకట్టుకున్నాయి. దావూదీ పాట సినిమాలో మిస్ అయింది. కొరటాల శివ ప్రత్యేకతలన్నీ ఇందులో పక్కాగా కనిపిస్తాయి. ఆయన మాటలు, కథా రచన, భావోద్వేగాలు ప్రభావం చూపించాయి.
(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)