కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పన్ను చెల్లింపుదారులకు బంపర్ న్యూస్ ఇచ్చింది. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ 2025 రానే వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, శనివారం నాడు పార్లమెంటులో సమర్పించారు.
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి నిర్మలాసీతారామన్ వరాలు కురిపిస్తున్నారు. ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న ఆదాయపు పన్ను చెల్లింపు దారుల కోసం బడ్జెట్‌లో శుభవార్త అందించారు మంత్రి నిర్మలా సీతారామన్. పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే శుభవార్త అందించారు. 12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. కొత్త పన్ను శ్లాబులను సవరించింది కేంద్ర ప్రభుత్వం. 12 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఇచ్చింది. రూ.0-రూ.4 లక్షలు ఆదాయం ఉంటే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. రూ.4-రూ.8 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.8-రూ.12 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.12-రూ.16 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.16 నుంచి రూ.20 లక్షల ఆదాయం మీద 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల ఆదాయం ఉంటే 25 శాతం.. రూ.24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను విధించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
#UnionBudget2025 | Finance Minister Nirmala Sitharaman says, " I am now happy to announce that there will be no income tax up to an income of Rs 12 lakhs." pic.twitter.com/rDUEulG3b9
— ANI (@ANI) February 1, 2025
ఎందుకు ఈ నిర్ణయం !
ప్రభుత్వం ఆదాయపు పన్నులో భారీ మార్పును తీసుకొచ్చి మధ్యతరగతిని ఖుషీ చేసింది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో రూ.80 వేలు వరకు మిగిలే అవకాశం ఉంది. ఓవైపు వృద్ధి రేటు తగ్గడం, ప్రజలు కూడా ఖర్చులను తగ్గించుకోవడం, కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు వంటి అంశాలు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
మరిత ఆకర్షణీయంగా చేయడం..
పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్తది చాలా సరళంగా ఉంది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారుల్లో దాదాపు 70శాతం మంది దీనిలోకి మారినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా కొత్త దానిలో మరిన్ని శ్లాబ్‌లను తీసుకురావడంతో పాత విధానం ఇక దాదాపు చాలామందికి పెద్దగా లబ్ధి చేకూర్చే పరిస్థితి లేదు.
మధ్యతరగతికి గాలం..
మోదీ సర్కారు ఆదాయపు పన్నుదారుల విషయంలో దయ చూపడం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో ఎదుర్కొంటోంది. చాలా వేదికలపై ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామనే ప్రజల అసంతృప్తిని ప్రత్యక్షంగా చూశారు. 2022లో ప్రైస్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశ జనాభాలో 43.2 కోట్ల మంది (31శాతం) మధ్యతరగతివారే. 2046 నాటి వారి సంఖ్య 100 కోట్లను దాటేస్తుందన్నది అంచనా. ఇది నాటి జనాభాలో 61 శాతానికి సమానమవుతుంది. తాజాగా దిల్లీ, మరికొన్ని నెలల్లో బిహార్‌లో ఎన్నికలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే దీనిని బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. పన్ను మినహాయింపుతోపాటు.. తాజాగా అద్దెలపై కూడా టీడీఎస్‌ను రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచే నిర్ణయం కూడా మిడిల్ క్లాస్‌ను లక్ష్యంగా చేసుకొన్నదే.
వినిమయం పెంచేలా..
ప్రభుత్వం తాజాగా పన్ను మినహాయింపు నిర్ణయంతో చెల్లింపుదారులు ఒక్కొక్కరు అత్యధికంగా రూ.80వేలు వరకు లబ్ధి పొందొచ్చు. మొత్తం చూసుకొంటే ఈ రూపంలో ఆర్థికవ్యవస్థలోకి రూ.లక్ష కోట్లు వెళతాయి. దీంతో ఈ నిధులను కొనుగోళ్లు, పెట్టుబడులకు మళ్లిస్తారని అంచనా. దీంతోపాటు వస్తువులను కూడా ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్నిరకాల వస్తువులపై పరోక్ష పన్నులను కూడా తగ్గించారు. మొబైల్ ఫోన్లకు విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వంటివి వీటిల్లో ఉన్నాయి.
కీలక రంగాలకు మద్దతు..
ఈ బడ్జెట్ నిర్ణయాలతో ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలకు లబ్ధి చేకూరనుంది. వీటిపైనే పన్ను మిగులు సొమ్మును వినియోగదారులు వెచ్చించే అవకాశాలు ఉన్నాయి.