అధికార కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఉన్నట్టుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రెండు అంశాలు కుదిపేస్తున్నాయి. అందులో కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టిన పోల్ ఒకటి అయితే..ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ మరో టాపిక్. ఈ రెండు అంశాలు ఇటు రేవంత్ సర్కార్‌ను, అటు హస్తం పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నాయట. వారం రోజు క్రితం తెలంగాణలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారనే ప్రశ్నతో కాంగ్రెస్ పార్టీ.. అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఓ పోల్ నిర్వహించింది. అందులో ఫామ్ హౌస్ పాలనకు ఏకంగా 70శాతం పైగా ఓట్లు పడగా, ప్రజల దగ్గరకు పాలనకు 30 శాతం లోపు మంది మాత్రమే మద్దతుగా నిలవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరి సంగతి పక్కనపెడితే అధికార కాంగ్రెస్‌కు గుండెల్లో రైళ్ళు పరుగెత్తినంత పనైందట. తాము పెట్టిన పోల్‌లో తమకే వ్యతిరేకంగా రావటంతో అవాక్కువటం కాంగ్రెస్ పార్టీ వంతైందట. తాము పెట్టిన పోల్‌ను బీఆర్‌ఎస్ హ్యాక్ చేసి.. విదేశాలను నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల్క్ ఓటింగ్ చేసిందని పైకి గంబీరంగా చెబుతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి లోలోపల మాత్రం సందిగ్దంగానే ఉందన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డే ఈ పోల్ గురించి ప్రస్తావించారంటే ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
నిజంగా వ్యతిరేకత ఉందా ?
ప్రభుత్వంపై ప్రజలకు నిజంగానే వ్యతిరేకత ఉందా అన్న అనుమానం హస్తం పార్టీలో మొదలైందట. ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు పోల్‌లో అనుకూలమైన ఓట్లు పోల్ అవ్వడం, ఫామ్ హౌస్ పాలనకు మద్దతు లభించడం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. ఈ పోల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితం రావడంతో..పార్టీ క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలను వెళ్తాయని..సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోందట. పోల్ ఇష్యూ కాక మంటలు రేపుతుండగానే..సడెన్‌గా ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అంటూ మరో రచ్చ స్టార్ట్ అయింది. పది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రహస్య భేటీ తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతోంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు ఆలస్యంగా తెలసుకున్న హస్తం పార్టీ తెగ ఆందోళన చెందుతోందట.
ఎవరికి వారే !
ఓ మంత్రి తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తిగా ఉండగా.. ఆయన తమను అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండా నిర్ణయాలు జరుగుతున్నాయని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారట. భవిష్యత్ కార్యాచరణపై వారంతా సమాలోచనలు జరిపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాము భేటీలో పాల్గొన్నది నిజమేనని..సీఎంకు, టీపీసీసీ చీఫ్‌కు సమాచారం ఇచ్చామని 10 మంది ఎమ్మెల్యేలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం ఒక మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య జరిగిన చిన్న గొడవ మాత్రమేనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యేల రహస్య భేటీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురి చేస్తోందట. పార్టీలో అసలేం జరుగుతోందన్న కంగారు మొదలైందట. ఆలస్యంగా మేల్కొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తే..ఇది ఒక మంత్రిపై అసంతృప్తి వ్యవహారం కాదని, చాలా జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉందని తెలిసిందంటున్నారు.
సమన్వయ లోపం ?
జిల్లాకు చెందిన మంత్రులకు, జిల్లా ఇంచార్జ్ మంత్రులకు ఏ మాత్రం పొసగటం లేదట. ఏ మాత్రం సమన్వయం లేకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. తాజాగా ఓ జిల్లా ఇంచార్జ్ మంత్రి సదరు జిల్లా మంత్రి లేకుండానే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం ఆసక్తికరంగా మారింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. దీంతో జిల్లా మంత్రులు, ఇంచార్జ్ మంత్రుల మధ్య ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారట. మంత్రుల విభేదాలతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మెజార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కొన్ని సందర్భాల్లో తాము అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల్లాగా మిగిలి పోతున్నామని, తమకు ఏ విషయంలోనూ ప్రాధాన్యత దక్కడం లేదని వాపోతున్నారట. ఈ విషయాలన్నీ తెలుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం నిర్వహించి..పార్టీలో, ప్రభుత్వంలో నెలకొన్న ఈ సమన్వయ లోపాన్ని ఎలా సరిదిద్దాలనే దానిపై దీర్గాలోచన చేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
ఇదే కాదు అంతకుమందు వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీని కలవర పెట్టింది. మాల సామాజికవర్గానికి చెందిన నేతలు, మాదిగ సామాజిక వర్గ నేతలు పోటాపోటీగా మీటింగ్‌లు పెట్టడం చర్చకు దారి తీసింది. మొన్న పోల్ వ్యవహారం..నిన్న వర్గీకరణ.. నేడు ఎమ్మెల్యేల సీక్రెట్ ఇష్యూతో పార్టీలో అసలేం జరుగుతోందన్న ఆందోళన మొదలైందట. అంతా గాడిలో పెట్టాలని భావిస్తున్నప్పటికీ..ఇది ఇగోతో కూడుకున్న పంచాయితీ అని..సున్నితంగా నచ్చజెప్పి వ్యవహారం కొలిక్కి తేవాలని అనుకుంటున్నారట. సీఎం రేవంత్, కాంగ్రెస్ పెద్దల ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి మరి.